ఉక్రెయిన్ పై రష్యా యుద్దం నాలుగో వారంలోకి ప్రవేశించింది. రోజులు గడుస్తున్నకొద్దీ దాడుల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. రాజధాని కీవ్ తోపాటు పలు నగరాలు ధ్వంసమవుతోన్నా లొంగుబాటు ప్రసక్తేలేదని ఉక్రెయిన్ చెబుతుండగా, దారికొచ్చేదాకా దాడులు ఆపబోమని రష్యా హెచ్చరిస్తోంది. ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోతోన్నవారి సంఖ్య 50 లక్షలపైనే అని అంచనా. ఉక్రెయిన్ పై యుద్దానికి వ్యతిరేకంగా రష్యాలోనూ భారీ నిరసనలు జరుగుతున్నాయి. వాటిలో ఓ మహిళా జర్నలిస్ట్ చేపట్టిన నిరసన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమెకు భారీ జరిమానా, 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి..
తక్షణమే ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలనే డిమాండ్ తో రష్యన్ టీవీ లైవ్ షోలో ఓ మహిళా జర్నలిస్టు ప్లకార్డుతో నిరసన తెలిపింది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోండని అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే అధికారగణానికి ఆదేశాలిచ్చిన దరిమిలా మహిళా జర్నలిస్టును అరెస్టు చేశారు. ఆమెకు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు లాయర్లు చెబుతున్నారు.
మాస్కో కేంద్రంగా పనిచేసే టీవీ ఛానల్లో జర్నలిస్టయిన మెరీనా ఓవ్స్యానికోవా తొలి నుంచీ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగాన్ని, జీవితాన్ని పణంగాపెట్టిమరీ ఆమె వార్తల లైవ్ ప్రసారంలోకి దూసుకొచ్చి యుద్ధవ్యతిరేక సందేశం రాసున్న పోస్టర్ ను ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Russian anti-war protester Marina Ovsyannikova interrupted a live news bulletin on Russia's state TV Channel One, holding up a sign behind a studio presenter and shouting slogans denouncing the war in Ukraine https://t.co/wxhwqx64zl pic.twitter.com/J8NeE4OB3y
— Reuters (@Reuters) March 15, 2022
తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు జర్నలిస్ట్ మెరీనా ఓవ్స్యానికోవా తెలిపారు. కుటుంబాన్నీ కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని, కస్టడీలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా అందలేదని తెలిపారు. మెరీనా అరెస్టు తర్వాత రష్యన్ జర్నలిస్టులు ఒక్కతాటిపైకొచ్చి నిరసనలు చేపట్టేదిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, లైవ్ లో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రష్యన్ జర్నలిస్టు మెరీనాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ధన్యవాదాలు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Journalist, Russia, Russia-Ukraine War, Ukraine