news18-telugu
Updated: January 19, 2019, 9:03 PM IST
ఐడీ కార్డు లేదని ఫెదరర్‌కి అనుమతి నిరాకరించిన సిబ్బంది
టెన్నిస్ లెజెండరీ ప్లేయర్ రోజర్ ఫెదరర్ అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. క్రీడా ప్రపంచంలో అతను సాధించి కీర్తి అలాంటిది మరి. అంతటి గొప్ప ఆటగాడికి వింత అనుభవం.. కాదు.. కాదు... అవమానకరమైన పరిస్థితి ఎదురైంది. అదెక్కడో కాదు.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో. 20 సార్లు గ్రాండ్ శ్లామ్ గెలిచిన ఈ అత్యుత్తమ ఆటగాడికి.. ఆస్ట్రేలియా ఓపెన్ లాకర్ రూమ్‌లోకి అనుమతి నిరాకరించారు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది. ఫెదరర్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
అదేంటి ఫెదరర్‌ను అడ్డుకోవడమేంటి? అని అనుకుంటున్నారా? అవును ఇది నిజమే. అందు కారణం లేకపోలేదు. ఫెదరర్ మెడలో ఎంట్రీ పాస్ లేకపోవడంతో అక్కడి సిబ్బంది అతణ్ని లోపలికి అనుమతించలేదు. అయితే, తనతో పాటు కాస్త వెనకగా వస్తున్న కోచ్ ఇవాన్ జుబికిక్ వచ్చి పాస్ చూపించడంతో.. అప్పుడు లోపలికి అనుమతించారు. అయితే, ఇవాన్ వచ్చేవరకు ఫెదర్ ఎంతో ఓపికగా వెయిట్ చేశాడు. అతనొచ్చి ఐడీ కార్డ్ చూపించాకే లోపలికి వెళ్లాడు.
ఈ వీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. గ్రాండ్ స్లామ్ సందర్భంగా లోపలికి వచ్చేవారంతా అక్రిడేషన్ పాస్‌లు మెడలో ధరించడం తప్పనిసరి. ఎంట్రీ గేటు దగ్గర ఉన్న సిబ్బంది.. ఫెదరర్ మెడలో అక్రిడేషన్ పాస్ లేకపోవడం గుర్తించాడు. అందుకే తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఇలా జరగడం ఇదే మెదటి సారేం కాదు.. ఇటీవల రష్యన్ ప్లేయర్ మరియా షరపోవాను కూడా ఐడీ పాస్ లేనందుకు కారిడార్‌లో నిలిపివేశారు. ఏదేమైనా.. రూల్స్ విషయంలో అందరూ సమాననేమని నిరూపించారు ఆస్ట్రేలియా ఓపెన్ సిబ్బంది.
అటు రోజర్ ఫెదర్ ఎంతో ఓపికగా వ్యవహరించడం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఐడీ కార్డు లేదని అనుమతి నిరాకరించినా, ఆ భద్రతా సిబ్బంది పట్ల ఫెదరర్ ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించకుండా సహనంతో వ్యవహరించడాన్ని అభినందిస్తున్నారు.
Published by:
Santhosh Kumar Pyata
First published:
January 19, 2019, 9:00 PM IST