RS 190 LAPTOP OFFER LEADS TO RS 45000 PENALTY FOR AMAZON HERE IS FULL DETAILS HSN
Amazon: రూ.190కే ల్యాప్ టాప్ అంటూ ఆఫర్.. కస్టమర్ బుక్ చేసుకున్నా ఆర్డర్ కేన్సిల్ చేయడంతో అమెజాన్ కు గట్టి షాక్..!
ప్రతీకాత్మక చిత్రం
రూ.23,499 రూపాయల విలువ చేసే ల్యాప్ టాప్ కేవలం 190 రూపాయలకే అంటూ అమెజాన్ ఆఫర్ పెట్టింది. ఆ ఆఫరే అమెజాన్ కొంపముంచింది. ఓ కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదు వల్ల ఏకంగా 45 వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇంతకీ అసలు సంగతేంటంటారా..? అక్కడికే వెళ్దాం.
‘బంపరాఫర్. 20, 30 వేల రూపాయల విలువ చేసే ల్యాప్ టాప్ కేవలం వందల రూపాయలకు మాత్రమే లభిస్తోంది. ఈ ఆఫర్ ను అస్సలు మిస్సవ్వొద్దు.‘ అంటూ ఆన్ లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫార్మ్ లు ఆఫర్ల వలలు విసురుతుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆఫర్ ప్రారంభమయిన కొద్ది క్షణాల్లోనే ఔటాఫ్ స్టాక్ అని కూడా చూపిస్తుంటుంది. కొందరికి పేమెంట్ వరకు వచ్చి సగంలోనే ప్రాసెస్ ఆగిపోతుంది. కొంత మంది మాత్రమే ఆ ఆఫర్ ద్వారా లక్కీచాన్స్ దక్కుుతంది. ఆ విన్నర్లెవరో ఏమిటో ఎవరికీ తెలియదు కూడా. అయితే అమెజాన్ ను అలాంటి ఆఫరే భారీ జరిమానా చెల్లించేలా చేసింది. ఓ కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదు వల్ల ఏకంగా 45 వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇంతకీ అసలు సంగతేంటంటారా..? అక్కడికే వెళ్దాం.
2014వ సంవత్సరంలో అమెజాన్ ఓ సేల్ ను ప్రకటించింది. 23,499 రూపాయల విలువ చేసే ల్యాప్ టాప్ కేవలం 190 రూపాయలకే ఇస్తామన్నది ఆ ఆఫర్ సారాంశం. సుప్రియో రంజన్ మహాపాత్ర అనే లా విద్యార్థి ఆ ఆఫర్ ను వినియోగించుకుని ల్యాప్ టాప్ ను సొంతం చేసుకోవాలనుకున్నాడు. మొత్తానికి అమెజాన్ చెప్పిన 190 రూపాయలను అమెజాన్ ప్లాట్ ఫామ్ లోనే చెల్లించాడు. అయితే ఆర్డర్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అమెజాన్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు. మీ ఆర్డర్ ను క్యాన్సిల్ చేశాము అంటూ ఆ కస్టమర్ కేర్ సర్వీస్ వాళ్లు అతడికి చావు కబురు చల్లగా చెప్పారు. ల్యాప్ టాప్ ను ప్రొవైడర్ తో వచ్చిన ఇబ్బందుల వల్ల ఇలా జరిగిందని కారణం చెప్పుకొచ్చాడు.
అయితే రంజన్ మహాపాత్ర మాత్రం వెనక్కి తగ్గదలచుకోలేదు. ‘అమెజాన్ చెప్పినట్టు నేను డబ్బును చెల్లించేశా. నాకు వాళ్ల సమస్యతో సంబంధం లేదు. ఆ సమస్యను తీర్చుకోవాల్సిన బాధ్యత అమెజాన్ ది. కస్టమర్ కు చెప్పిన విధంగా ఆర్డర్ ను ఇవ్వాల్సిన బాధ్యత అమెజాన్ ది‘ అన్నది అతడి వాదన. అదే వాదనతో డిస్ట్రిక్ట్ ఫోరమ్ లో ఓ పిటిషన్ ను దాఖలు చేశాడు. ల్యాప్ టాప్ రానందుకు మానసికంగా వేదనకు గురయ్యాననీ, 50 వేల రూపాయల నష్టపరిహారంతోపాటు లీగల్ ఖర్చుల కింద మరో పది వేల రూపాయల పరిహారాన్ని అమెజాన్ చెల్లించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు.
ల్యాప్ టాప్ ప్రొవైడర్ తో ఒప్పందం విషయంలో తలెత్తిన సమస్య వల్లే కస్టమర్ కు ల్యాప్ టాప్ ను ఇవ్వలేకపోయామనీ, దీంట్లో అమెజాన్ కావాలని చేసిన పొరపాటు ఏమీ లేదని ఆ సంస్థ వాదించింది. ఇరువురి వాదనలను విన్న ఫోరం, కస్టమర్ కు పదివేల రూపాయల పరిహారం ఇవ్వాల్సిందిగా అమెజాన్ ను ఆదేశించింది. అయితే ఫోరం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రంజన్ మహాపాత్ర ఒడిస్సా రాష్ట్ర కంజ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ లో మరో పిటిషన్ ను వేశాడు. కమిషన్ పాత తీర్పును సమర్ధిస్తూనే, నష్టపరిహారాన్ని మాత్రం పెంచింది. మొత్తంగా 45వేల రూపాయల నష్టపరిహారాన్ని కస్టమర్ కు చెల్లించాలని తీర్పునిచ్చింది.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.