Royal Benga Tiger Kazi : అసోం రాజధాని గువహటిలోని అసోం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ లో రాయల్ బెంగాల్ టైగర్ "ఖాజీ".. మరో రెండు పులి పిల్లలకు జన్మనిచ్చింది. 2020, ఆగస్టు నెలలో సురేశ్, సుల్తాన్ అనే పులి పిల్లలకు జన్మనిచ్చిన ఖాజీ..ఇప్పుడు మరో రెండు కూనలకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 3న రెండు పిల్లలకు ఖాజీ జన్మనిచ్చినట్లు జూ అధికారులు తెలిపారు. దీంతో ఎనిమిదేళ్ల వయస్సు ఉన్న ఖాజీ రెండేళ్ల వ్యవధిలో.. మొత్తం నాలుగు పులి పిల్లలకు జన్మనిచ్చినట్లయింది. తాజాగా పుట్టిన పులి పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయని, చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ పులి పిల్లలకు వెచ్చదనం ఉండేలా పంజరం వెలుపల హీటర్లు పెట్టినట్టు అసోం రాష్ట్ర జంతు ప్రదర్శనశాల డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ అశ్విని కుమార్ తెలిపారు.
ఈ రెండు పులి పిల్లలకు త్వరలోనే నామకరణం చేయనున్నారు. ఇప్పటికే ఈ పిల్లలకు పేర్లు పెట్టాల్సిందిగా అటవీ శాఖ మంత్రి పరిమళ శుక్లా బాయిద్యను అటవీ శాఖ అధికారులు కోరారు. ఆయన గతంలో కూడా పలు జంతువులకు పేరు పెట్టారు. ఇక,తల్లి పులి ఖాజీకి మంచి పోషకాహారాన్ని అందిస్తున్నట్లు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అమిత్ షాహి చెప్పారు. రోజుకు 6 నుంచి 7 కేజీల మాంసాన్ని అందిస్తూ, వెటర్నరీ డాక్టర్లు సూచించిన ఆహారాన్ని కూడా ఇస్తున్నట్లు తెలియజేశారు. జూలో జంతువులకు పరిశుభ్రమైన వాతావరణం అందించడంపై దృష్టి సారించామన్నారు.
ఖాజీతో పాటు ఇద్దరు పిల్లలకు ఎలాంటి హానీ కలిగించకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతున్నామని తెలిపారు. ఇక, అసోంలో పులుల సంఖ్య పెరిగింది. 2018లో 159 పులులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 200కి పెరిగింది. కాగా, అసోం స్టేట్ జూలో రాయల్ బెంగాల్ టైగర్ పాపులేషన్ తొమ్మిదికి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assam, New born baby, Tiger