Rickshaw journey: కోల్‌కతా నుంచి సియాచిన్‌కు రిక్షాయాత్ర.. పెట్రోల్ ధరల పెంపుపై వినూత్న నిరసన

ప్రతీకాత్మకచిత్రం

కేవలం 2 రోజుల సమయంలోనే సత్యేన్ దాస్ పూరీకి చేరుకున్నారు. గతంలో కోల్‌కతా నుంచి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లద్దాఖ్‌కు కూడా కేవలం సైకిల్ రిక్షాపై చేరుకున్నారు. ఇందుకు అతడికి 65 రోజుల సమయం పట్టింది.

  • Share this:
కరోనా కాలంలో చాలా మంది మధ్య తరగతి ప్రజలు బైక్‌లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బైక్‌లను కొనుగోలు చేసినవారు కూడా ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కోల్‌కతాకు చెందిన సత్యేన్‌దాస్ అనే వ్యక్తి మోటార్ బైక్స్‌కు బదులుగా సైకిల్స్ కొనుగోలు చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో పాటు ఇంధనం ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వినూత్న మార్గంలో నిరసన తెలుపుతున్నారు. ఇందుకోసం కోల్‌కతా నుంచి ఏకంగా కశ్మీర్ లోని సియాచిన్‌కు రిక్షాపై ప్రయాణించడానికి సిద్ధమయ్యారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌కు రిక్షాపై వెళ్లాలని సత్యేన్ దాస్ నిర్ణయించుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి వీధికి ప్రత్యేకంగా సైక్లింగ్ కోసం రోడ్డు ఏర్పాటు చేయాలని నిరసన ద్వారా చెప్పాలనుకుంటున్నారు. కోల్‌కతా నుంచి సియాచిన్ 2000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక రిక్షాపై 2 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం మామూలు విషయం కాదు. అంతేకాకుండా మండే ఎండల్లో, గడ్డకట్టే చలిలో రిక్షా తొక్కాల్సి ఉంటుంది. కానీ అతడు ఏమాత్రం భయపడటం లేదు. తన లక్ష్యాన్ని చేరుకుంటారని సత్యేన్ దాస్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

"పర్యావరణాన్ని పరిరక్షించాలన్నా.. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా సైకిల్ వాడకాన్ని పెంచాలి. అందుకే ప్రతీ ప్రదేశంలో సైకిల్ తొక్కేందుకు వీలుగా రోడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను" అని సత్యేన్‌దాస్ చెబుతున్నారు. తన ప్రయాణంలో ఇదే సందేశాన్ని ప్రతి చోట ప్రచారం చేయబోతున్నారు. ఆయన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నది. అన్నీ సానుకూలంగా జరిగితే ఆయన అక్టోబర్ నెలలో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. "లద్దాఖ్ చలే రిక్షవాలా" పేరిట సత్యేన్‌దాస్ పై ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందించారు. 64 నిమిషాల నిడివిగల ఇది బెస్ట్ నేషనల్ డాక్యుమెంటరీ అవార్డు కూడా గెలుపొందింది.

సత్యేన్‌దాస్ 1993లోనే తన మొదటి జర్నీ ప్రారంభించారు. అప్పట్లో స్థానికులు పూరీ నగరానికి పిక్నిక్ ప్లాన్ చేశారు. అందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో తెలిసినవారి సైకిల్‌పై పూరీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆయన మొదటి జర్నీ ప్రారంభమయింది. కేవలం 2 రోజుల సమయంలోనే సత్యేన్ దాస్ పూరీకి చేరుకున్నారు. గతంలో కోల్‌కతా నుంచి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లద్దాఖ్‌కు కూడా కేవలం సైకిల్ రిక్షాపై చేరుకున్నారు. ఇందుకు అతడికి 65 రోజుల సమయం పట్టింది.
Published by:Krishna Adithya
First published: