RI SOL JU WIFE OF NORTH KOREAN LEADER KIM JONG UN MAKES FIRST PUBLIC APPEARANCE IN A YEAR HSN
Kim Jong Un: కనిపించకుండా పోయిన కిమ్ జాంగ్ భార్య.. ఏడాది తర్వాత మీడియా ముందుకు..
థియేటర్లో ఉత్సాహంగా కిమ్ దంపతులు (Photo Courtesy: Martyn Williams Twitter)
కిమ్ జాంగ్ ఉన్ మీడియా ముందుకు అరుదుగా వస్తుంటారు. ఆయన చాలా కాలం కనిపించకుండా పోతే చనిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఏడాది తర్వాత కిమ్ జాంగ్ ఉన్ భార్య మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు..
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రపంచ మీడియాలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఆయన మీద వచ్చినన్ని వార్తలు ఇతర ఏ దేశ అధ్యక్షుడు మీదా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వాడే హెయిర్ స్టైల్ దగ్గర నుంచి కిమ్ జాంగ్ తినే తిండి వరకు అన్నీ నెట్టింట చర్చనీయాంశాలే. ఒకేసారి కొద్ది నెలల పాటు ఆయన కనిపించకుండా పోతుంటారు. దీంతో ఆయనకు ఏమయిందో ఏమోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంటుంది. ఆయన చనిపోయారని పలు మీడియా సంస్థలు ఎన్నోసార్లు వార్తలను కూడా ఇచ్చాయి. కానీ ఆ వార్తలకు చెక్ పెడుతూ కొన్నాళ్ల తర్వాత మళ్లీ మీడియా ముందుకు కనిపిస్తుంటారు. కిమ్ జాంగ్ సోదరి కూడా సడన్ గా మాయం అవుతుంటుంది. ఆమె విషయంలో కూడా ప్రేమ వ్యవహారం గురించి పొలిటికల్ గాసిప్స్ ఎన్నో వచ్చాయి. తాజాగా కిమ్ జాంగ్ ఉన్ భార్య రి సోల్ జు మీడియా ముందు ప్రత్యక్షం కావడమే పెద్ద వార్తగా నిలిచింది.
కిమ్ జాంగ్ ఉన్ భార్య రి సోల్ జు ఒక ఏడాది కాలంగా బాహ్య ప్రపంచంలోకి రాలేదు. గతేడాది జనవరి తర్వాత ఆమె మీడియా ముందుకు కనిపించలేదు. ఏ ఒక్క అధికారిక కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దీంతో ఆమెకు ఏదో జరిగిందనీ, కరోనా సోకిందనీ ఇలా ఎన్నెన్నో వార్తలు నెట్టింట పుట్టుకొచ్చాయి. అన్నేసి వార్తలు వచ్చినా ఉత్తర కొరియా మీడియా అధికారికంగా ఏమీ స్పందించకపోవడంతో ఆ వార్తలు ఇంకా నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఆయా వార్తలకు చెక్ పెడుతూ కిమ్ జాంగ్ భార్య రి సోల్ జు మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. మేన్సుడే ఆర్ట్ థియేటర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిమ్ దంపతులు పాల్గొన్నారు. అయితే ఆ థియేటర్లో ఉన్న ఏ ఒక్కరు కూడా మాస్కులు ధరించకపోవడం, వ్యక్తిగత దూరం పాటించకపోవడం గమనార్హం.
మంగళవారం కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జయంతి ఉత్సవాల్లో రి సోల్ జు పాల్గొన్నారు. తన భర్తతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్న ఆమె సంతోషంగా కనిపించారు. ఏడాదిపాటు కనిపించకుండా పోయిన ఆమె సడన్ గా ప్రత్యక్షం కావడంతో మీడియా అంతా ఆమెపైనే ఫోకస్ పెట్టింది. ఆమెనే ప్రముఖంగా చూపించింది. కాగా, ఉత్తరకొరియాలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. వాస్తవానికి ఉత్తర కొరియా అధినేతను చైర్మన్ అని పిలుస్తుంటారు. కిమ్ జాంగ్ ఉన్ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపక అధ్యక్షుడు కిమ్ II సంగ్ ను మాత్రమే ప్రెసిడెంట్ అని పిలిచారు. కానీ తాజాగా కిమ్ జాంగ్ ఉన్ ను కూడా ఆ దేశ అధికారిక మీడియా ప్రెసిడెంట్ అని సంబోదిస్తుండటం గమనార్హం.