ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలి దాకా అందరినీ అలరించే క్యారెక్టర్ జంగిల్ బుక్ లోని మొగ్లీ.. ఏళ్లు గడిచినా ఆ క్యారెక్టర్ కు ఉన్న క్రేజ్ పెరుగుతుందే తప్ప ఇసుమంతైనా తగ్గడం లేదు. జంగిల్ బుక్ పుస్తకాల రూపంలో వచ్చినా.. సినిమాలు, సీరియళ్ల రూపంలో వచ్చినా.. అందరూ చూసేది మొగ్లీ కోసమే. అతడి విన్యాసాలు.. సాహసాలు అందరినీ కట్టిపడేస్తాయి. ఇప్పుడు మొగ్లీ గురించి ఎందుకు చెబుతున్నారనుకుంటున్నారా...? అక్కడికే వస్తున్నాం. ఆఫ్రికాలో ఒక రియల్ లైఫ్ మొగ్లీ ఉన్నాడు. నిండా పాతికేళ్లు లేని ఆ యువకుడి విషాధ గాధే ఈ కథ.
ఆఫ్రికా అంటేనే చీకటి ఖండం. కనీస సౌకర్యాలు కరువు. అక్కడి మనుషులు వింతగా ఉంటారు. అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా వాళ్లు విచిత్రంగా కనిపిస్తారు. ఇక అడవుల్లో ఉండేవాళ్లయితే.. దాదాపు ఆదిమానవుల వలే కనిపిస్తారు. ఇక రువాండా కు చెందిన జాంజిబన్ ఎల్లీ అయితే.. ముఖం కొంచెం వానరం రూపంలో ఉండి.. విచిత్రంగా కనిపిస్తాడు. జంగిల్ బుక్ లో మొగ్లీ చేసే విచిత్ర సాహసాలన్నీ ఈ కుర్రాడు చేస్తాడు. ఎల్లీ వయసు 21 సంవత్సరాలు మాత్రమే.
1999లో జన్మించిన ఎల్లీది ఒక విషాద గాధ. ఎల్లీ జన్మించిక పూర్వమే అతడి తల్లి ఐదుగురికి జన్మనిచ్చింది. కానీ అందులో ఒక్కరూ కూడా బతికి బట్ట కట్టలేదు. ఇక దేవుడి మీదే భారం వేసిన ఆ తల్లి.. ఎల్లీకి పురుడు పోసింది. కానీ ఎల్లీ మాత్రం మైక్రోసెఫాలీ (శిశువు తల ఊహించినంతగా ఉండకపోవడం..) వ్యాధితో జన్మించాడు. జన్మతా: అరణ్యపుత్రుడైన ఎల్లీ.. అందరి పిల్లల్లా పెరగలేదు. అతడిని చూస్తేనే పిల్లలు భయపడేవారు. పుట్టడమే వైకల్యంతో పుట్టిన ఎల్లీ... ఆ కారణంతో బడికి కూడా వెళ్లలేదు. దీంతో అతడి చదువంతా అడవి తల్లి ఒడిలోనే సాగింది.
తనను తాను వెతుక్కోవడానికి ఎల్లీ ఎక్కువగా అడవి తల్లి ఒడిలోనే గడిపేవాడు. చెట్లను అలవోకగా ఎక్కడం.. జంతువులతో స్నేహం చేయడం.. వాటితో కలిసి జీవించడం.. ఇదే జీవితమైంది. అతడి వైకల్యం చూసిన జనాలు.. ఎల్లీ పెద్దవాడవుతున్న కొద్దీ బెదిరించడం, దాడులకు దిగడం చేసేవాళ్లు. ఎల్లీకి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి పని చేస్తేనే ఇల్లు గడిచేది. దీంతో వారింట్లో రోజూ పస్తులే. కొడుకు ఆకలి చూడలేక ఆ తల్లి ఏడుస్తుంటే.. ఎల్లీ వెళ్లి అడవిలో ఆకులు, గడ్డి తినేవాడు. ఇది చూసిన ఆ తల్లి గుండెలవిసేలా విలపించేది. ఎల్లీకి వింత ఆకారమే గాక అతడికి వినిపించదు. సరిగా మాట్లాడలేడు. కానీ రోజుకు 30 కిలోమీటర్ల దాకా సునాయసంగా నడవగలడు. పరిగెత్తగలడు. పరుగు పందెంలో అతడిని అందుకోవడం కష్టం.
ఎల్లీ గురించి తెలుసుకున్న ఒక ఛానెల్.. అతడి వీడియోను బయట ప్రపంచానికి చూపించింది. అతడికి సాయం చేయాలని సోషల్ మీడియాలో ఒక పేజీని క్రియేట్ చేసింది. దాని ద్వారా నిధులు సేకరించి.. వారికి అందిస్తున్నది. ఈ వీడియో కింద ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘అతడు ప్రజల నుంచి పారిపోతాడు. ఎందుకంటే అతడికి బాధంటే ఇష్టం లేదు. ఈ ప్రజలు చెడ్డవాళ్లని అతడికి తెలుసు. అందుకు ప్రతిసారి వారి నుంచి దూరంగా పరిగెత్తుతూ.. ఈ బూటకపు సమాజానికి దూరంగా బతుకుతున్నాడు...’ అని రాసుకొచ్చాడు. ఎల్లీ కథ చూసినవారికి కన్నీరు తెప్పిస్తున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Social Media, Youtube