భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్, కల్నల్ రాజాచారి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇటీవలే నాసా మూన్ మిషన్‌కు ఎంపికైన రాజాచారి.. తాజాగా స్పేస్ ఎక్స్ మిషన్‌కు కూడా ఎంపికయ్యారు. స్పేస్ ఎక్స్ క్రూ 3 మిషన్ కోసం ఆయన్ను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)) ఎంపిక చేశాయి. ఈ మిషన్‌లో పాల్గొనే నలుగురు సభ్యుల బృందానికి రాజాచారి నాయకత్వాన్ని వహిస్తారు. రాజాచారితో పాటు టామ్ మార్ష్‌బర్న్, మథియాస్ మారర్ కూడా ఈ మిషన్‌కు ఎంపికయ్యారు. మిషన్ కమాండర్‌గా రాజాచారి, పైలెట్‌గా మార్ష్‌బర్న్, స్పెషలిస్ట్‌గా మథియాస్ ఉంటారు. ఈ ముగ్గురితో పాటు మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది.
వచ్చే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో స్పేస్ ఎక్స్ సంస్థ.. ఈ మిషన్‌ను చేపట్టనుంది. వీరంతా ప్రత్యేక క్యాప్సుల్‌లో అంతర్జాతీయ అంతరిక్షా కేంద్రాని (ISS)కి ప్రయాణిస్తారు. అక్కడ 6 నెలల పాటు పలు పరిశోధనల అనంతరం తిరిగి భూమికి చేరుకుంటారు. స్పేస్ ఎక్స్ మిషన్ కోసం భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ ఎంపిక కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
స్పేస్ఎక్స్ మిషన్‌కు ఎంపికయినందుకు చాలా సంతోషంగా ఉందని రాజాచారి ట్వీట్ చేశారు.
రాజాచారి పూర్తి పేరు.. రాజా జాన్ వురుపుత్తూర్ చారి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్. శ్రీనివాసాచారి ఉస్మానియా విశ్వవిద్యాలయం(OU)లో చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. రాజాచారి అమెరికాలోనే పుట్టి పెరిగి.. అక్కడే చదువుకున్నారు. ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రాజాచారి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరి కల్నల్‌గా విధులు నిర్వర్తించారు.
రాజాచారి 2017లో నాసా నిర్వహించిన ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్‌కు ఎంపికయ్యారు. యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లో శిక్షణ పొందిన ఏకైక భారత సంతతి వ్యక్తి కూడా ఈయనే. ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత.. నాసా చేపట్టిన ఆర్టెమిస్ ఆస్ట్రోనాట్ ప్రాజెక్ట్‌కు రాజాచారి ఎంపికయ్యారు. చంద్రుడిపైకి నాసా పంపించబోయే మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ టీమ్‌లో రాజాచారి కూడా ఒకరు. ఈ మిషన్ కోసం నాసా మొత్తం 18 మందిని ఎంపిక చేయగా.. వీరిలో 9మంది మహిళలే ఉండటం గమనార్హం. కాగా, 2024లో చంద్రుడి మీదకి మనుషులను పంపాలని నాసా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే చంద్రుడి కంటే ముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు రాజాచారి.