• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • PUNJAB POLICE SUSPENDS SHO FOR KICKING VEGETABLE VENDORS CART MK GH

లాక్‌డౌన్ పేరుతో చిరువ్యాపారిపై పోలీసుల దౌర్జన్యం.. ఎక్కడో చూస్తే షాక్ తింటారు..

లాక్‌డౌన్ పేరుతో చిరువ్యాపారిపై పోలీసుల దౌర్జన్యం.. ఎక్కడో చూస్తే షాక్ తింటారు..

పోలీస్ దౌర్జన్యం

లాక్ డౌన్ అమల్లో భాగంగా సామాన్యులపై పోలీసులు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. గతంలోనూ సామాన్యులపై పోలీసులు దౌర్జన్యం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పంజాబ్‌లో ఓ పోలీసు అధికారి చిరు వ్యాపారిని కాలితో తన్నిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
కరోనా వైరస్ రెండో దశలో విజృంభిస్తున్న వేళ ప్రజలంతా భయాందోళనలకు లోనవుతున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. అయితే ఈ లాక్ డౌన్ అమల్లో భాగంగా సామాన్యులపై పోలీసులు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. గతంలోనూ సామాన్యులపై పోలీసులు దౌర్జన్యం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పంజాబ్‌లో ఓ పోలీసు అధికారి చిరు వ్యాపారిని కాలితో తన్నిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధ్యతగా వ్యవహరించాల్సినవారే ఇలా దౌర్జన్యానికి పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తడంతో అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు.

సోషల్ మీడియాలో వైరల్..
వివరాల్లోకి వెళ్తే పంజాబ్ లోని ఫగ్వారా స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా పనిచేస్తోన్న నవదీప్ సింగ్.. లాక్ డౌన్ అమలు చేయాలనే నెపంతో ఓ చిరు వ్యాపారికి చెందిన కురగాయల డబ్బాలను కాలితో తన్నాడు. అంతేకాకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఈ సంఘటనను ఒక వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అధికారులకు ఈ విషయం తెలిసేలా వీడియోను విస్తృతంగా షేర్ చేశారు.

సస్పెన్షన్ వేటు..
అనంతరం పంజాబ్ పోలీసులు ఈ వీడియో గురించి తెలుసుకున్నారు. సామాన్యుడిపై దౌర్జన్యం చేసినందుకు నవదీప్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా పంజాబ్ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా ట్విట్టర్ ద్వారా తెలిపారు. నవదీప్ సింగ్‌పై పంజాబ్ పోలీసులు డిపార్టమెంటల్ ఎంక్వైరీ చేపట్టారని స్పష్టం చేశారు. కపూర్తలా ఎస్ఎస్ పీ కన్వర్ దీప్ కౌర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. SHO ప్రవర్తన సేవాగుణానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. అలాంటి చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ సంఘటన వల్ల పోలీసు డిపార్ట్మెంట్‌కి చెడ్డపేరు వస్తుందని తెలిపారు. వ్యాపారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి పోలీసుల జీతాల నుంచి డబ్బులు సేకరిస్తామని స్పష్టం చేశారు.

పంజాబ్ ప్రభుత్వం మే 15 వరకు కోవిడ్ ఆంక్షలను విధించింది. ఈ సమయంలో అనవసరమైన అన్ని దుకాణాలను మూసివేయాలని నిర్ణయించారు. అవసరమైన వాటిని మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. వీధుల్లో కూరగాయలు, పండ్లు వంటివి అమ్ముకునే చిరువ్యాపారులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని, కూరగాయల మార్కెట్లో సామాజిక దూరం పాటించేలా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌లో బుధవారం కొత్తగా 8015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 182 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 63000కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసుల పెరుగుదలను నియంత్రించడానికి దిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలు కఠినమైన ఆంక్షలను విధించాయి.
First published:

అగ్ర కథనాలు