Viral Video: విమానంలో మహిళకు పురిటి నొప్పులు..షూలేస్​ సాయంతో ప్రసవం చేసిన వైద్యులు..

ప్రతీకాత్మక చిత్రం

Viral Video: అదృష్టం కొద్ది ఆ విమానంలో ముగ్గురు నియోనాటల్​ ఇంటెన్సివ్​ కేర్​ యూనిట్​ నర్సులు, డాక్టర్ డేల్ గ్లెన్ అనే హవాయి పసిఫిక్ హెల్త్ ఫ్యామిలీ మెడిసిన్ వైద్యుడు ఉన్నారు. లావినియా బాధ గమనించిన వారంతా ఆమెను పరీక్షించారు.

  • Share this:
సోషల్​ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరుగుతున్న వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వార్త ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. విమాన ప్రయాణంలో ప్రసవ వేదనతో ఇబ్బందులు పడిన మహిళకు సులభంగా డెలివరీ చేశారు వైద్యులు. ఎలాంటి పరికరాలు లేకున్నా సమయ స్ఫూర్తితో వ్యవహరించారు. బిడ్డ బొడ్డుతాడు కత్తిరించడానికి షూ లేస్‌ను ఉపయోగించారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అసలు తాను గర్భంతో ఉన్నట్టు సదరు మహిళకు కూడా తెలియదట. కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల ఆమె కడుపు సైతం పెద్దగా కనిపించకపోవడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన లావినియా మోంగా అనే మహిళ ఏప్రిల్​ 28న తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు సాల్ట్​ లేక్​ సిటీ నుంచి హవాయికి విమానంలో బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అవి పురిటి నొప్పులని తేల్చారు విమాన ప్రయాణికుల్లో ఉన్న వైద్యులు. దీంతో లావినియా కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.

అదృష్టం కొద్ది ఆ విమానంలో ముగ్గురు నియోనాటల్​ ఇంటెన్సివ్​ కేర్​ యూనిట్​ నర్సులు, డాక్టర్ డేల్ గ్లెన్ అనే హవాయి పసిఫిక్ హెల్త్ ఫ్యామిలీ మెడిసిన్ వైద్యుడు ఉన్నారు. లావినియా బాధ గమనించిన వారంతా ఆమెను పరీక్షించారు. ఆమె గర్భవతి అని.. పురిటి నొప్పులతో బాధపడుతుందని గుర్తించారు. వెంటనే విమానంలోని బాత్రూంకు తీసుకెళ్లి డెలివరీ చేశారు. అయితే డెలివరీకి కావాల్సిన వైద్య పరికరాలేవీ తమ వద్ద లేకపోవడంతో బొడ్డు తాడును కత్తిరించడానికి, కట్టడానికి షూలేస్‌లను ఉపయోగించారు. ఇక, శిశువు హృదయ స్పందన రేటును కొలవడానికి స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించారు. ఎట్టకేలకు సురక్షితంగా బిడ్డను బయటికి తీశారు.

దీనిపై డాక్టర్​ గ్లెన్​ మాట్లాడుతూ.. “విమానంలోని చాలా చిన్న, పరిమిత స్థలంలో పురిటినొప్పులతో బాధపడుతున్న తల్లికి ప్రసవం చేశాం. ఇది పెద్ద సవాలుతో కూడుకున్న పని. అయినప్పటికీ అందరం కలిసి విజయవంతంగా డెలివరీ చేశాం. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు” అని చెప్పారు. కాగా, డెలివరీ సమయంలో లావినియా కేవలం 29 వారాల గర్భవతి మాత్రమే.

క్షణాల్లో వైరల్​ అయిన వీడియో..
డెలివరీ పూర్తయిన తర్వాత అందరిలో ఒకటే అనుమానం. సాధారణంగా గర్భిణులను విమాన ప్రయాణాలకు అనుమతించరు. అలాంటిది బాధితురాలిని ఆరు గంటల పాటు విమానంలో ప్రయాణించడానికి ఎలా అనుమతించారని ప్రయాణికులు ప్రశ్నించారు. అయితే దీనికి ఆమె తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. తమ కూతురు గర్భంతో ఉందనే విషయం ఎవరికీ తెలియదని, చివరికి లావినియాకు సైతం అవగాహన లేదని చెప్పారు. అసలు ఆమెలో గర్భం దాల్చిన లక్షణాలు కూడా ఎప్పుడూ కనిపించలేదని తెలిపారు. నెలలు నిండుతున్న కొద్ది ఉదర భాగం కూడా పెరగలేదన్నారు. వారి సమాధానం విని ఆశ్చర్యపోవడం ప్రయాణికుల వంతైంది. ఏదేమైనప్పటికీ, లావానియాకు ప్రయాణికులు అంతా చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలు చెప్పారు. బిడ్డ ఏడుస్తున్న వీడియో తీసి టిక్​టాక్​లో షేర్​ చేశారు. ఆ తరువాత ఇది క్షణాల్లో వైరల్​గా మారింది. ఆదివారం రాత్రి నాటికి వీడియో 11 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది.
Published by:Sridhar Reddy
First published: