Home /News /trending /

PREGNANT DOCTOR CORONA DUTIES WITH A FULL PREGNANCY DOCTOR SERVING IN TIMES OF DANGER MK GH

Pregnant Doctor: నిండు గర్భంతో కరోనా విధులు..ఆపద కాలంలో సేవలందిస్తోన్న వైద్యురాలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

మనదేశంలోనూ ఎంతో మంది కరోనా యోధులు ఈ సంక్షోభంలో సాయంగా నిలుస్తున్నారు. వీరిలో డాక్టర్ శివానీ శర్మ కూడా ఒకరు. నిండు గర్భంతో ఉన్నప్పటికీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు గత ఏడాది కాలంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలందిస్తున్నారు. మనదేశంలోనూ ఎంతో మంది కరోనా యోధులు ఈ సంక్షోభంలో సాయంగా నిలుస్తున్నారు. వీరిలో డాక్టర్ శివానీ శర్మ కూడా ఒకరు. నిండు గర్భంతో ఉన్నప్పటికీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా సంక్షోభంలో ప్రసూతి సెలవులు తీసుకోకుండా.. జమ్మూ కశ్మీర్‌లోని లఖన్‌పూర్ కమ్యునిటీ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ ఏడాది మార్చి నెలలో ఉద్యోగానికి ఎంపికయ్యారు శివానీ శర్మ. ఆమెకు CHC లఖన్‌పూర్ ఆరోగ్య కేంద్రంలో విధులను కేటాయించారు. ఇది జమ్మూ కశ్మీర్ ప్రధాన ప్రవేశ స్థానం. వచ్చి పోయే వారికి టీకాలు వేయడమే కాకుండా సాధారణ ఓపీ సేవల బాధ్యతను సైతం ఆమెకు అప్పగించారు. ఉద్యోగంలో చేరేసమయానికి ఆమె ఐదు నెలల గర్భిణి. కోవిడ్ భయాలు నెలకొన్నప్పటికీ వెనక్కు తగ్గకుండా ఉద్యోగంలో చేరారు శివానీ శర్మ.

"గర్భంతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో విధులు కష్టమని నాకు తెలుసు. కానీ బాధ్యతలను వదులుకొని ఇంట్లోనే కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి సమయంలో నా కుటుంబ సభ్యులు ఎంతగానో మద్దతు ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి నా భర్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవారు. ప్రతి 2-3 గంటలకు నీరు తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉంటాను" అని శివానీ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భంతో ఉంది.

కరోనా పరీక్ష కూడా చేయించుకున్నా..
ఉద్యోగంలో చేరిన తర్వాత కోవిడ్ లక్షణాలు కనిపించడం వల్ల శివానీకి కరోనా పరీక్ష చేశారు. అయితే ఆమెకు నెగెటివ్ వచ్చింది. అప్పటి నుంచి CHC అధికారులు నాన్ కోవిడ్ విధులను ఆమెకు కేటాయించారు. కరోనా మహమ్మారి ప్రజల్లో చాలా భయం, ఒత్తిడిని తీసుకొచ్చింది. అందువల్ల తనకు కూడా కోవిడ్ సోకుతుందోమోనని ఇంట్లో వాళ్లు భయపడుతున్నారని శివానీ చెప్పారు. అయితే సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం వల్ల సెలవు తీసుకోకుండా సాధారణ ఓపీడీకి హాజరుకావడం కష్టంగా ఉంటోందని ఆమె తెలిపారు. నిండు గర్భంతో ఉండి ఇలా చేయడం ఇబ్బందిగానే ఉంటుందన్నారు. తన బృందం సహాయంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు వివరించారు.

ప్రస్తుతం కోవిడ్ రోగులను ప్రత్యక్షంగా చూడనప్పటికీ కఠినమైన కోవిడ్ నిబంధనలను అనుసరిస్తున్నట్లు శివానీ తెలిపారు. విధి నిర్వహణలో పీపీఈ కిట్లను ధరిస్తానని, తనను, బిడ్డను వైరస్ నుంచి రక్షించుకోవడానికి పరిమితంగా రోగులను కలుస్తున్నానని చెప్పారు. తన బృందంతో కలిసి వృత్తికి సంపూర్ణ న్యాయం చేస్తున్నానని వివరించారు శివానీ శర్మ. మహమ్మారిపై పోరాటంలో అందరం విజయం సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్లిష్ట సమయంలో వైద్య సేవల అవసరాలను గుర్తించిన ఈ డాక్టర్.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Corona

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు