తన గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేయడంపై సినీ హీరో ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలోని తన గెస్ట్ హౌస్‌ను అధికారులు సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలం వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నియంత్రించాలని కోరుతూ సినీ నటుడు ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు కనీసం నోటీసులు ఇవ్వకుండానే తన గెస్ట్ హౌస్‌ను ఎలా సీజ్ చేస్తారని ప్రభాస్ ప్రశ్నించారు. గురువారం పిటిషన్ విచారణకు రాకపోవడంతో ప్రభాస్ తరఫు న్యాయవాది దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను అభ్యర్థించారు. పిటిషనర్ కొనుగోలు చేసిన 2083 చదరపు గజాల స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన న్యాయమూర్తులను కోరారు. ప్రభాస్ తరఫు న్యాయవాది అభ్యర్థనను మన్నించిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాన్నిఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదావేసింది.
ప్రభాస్ గెస్ట్‌హౌస్ సీజ్
రాయదుర్గం దగ్గర్లో 'పైగా' భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలోని పాన్ మక్తలో ఉన్న సినీ హీరో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేశారు. ప్రభాస్ అతిథి గృహం దగ్గర ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్ చేశామని అధికారులు తెలిపారు. అది ప్రభుత్వ స్థలం అని నోటీసుల్లో తెలిపారు.
రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తుంది. ఇదే సర్వే నెంబర్‌లో 2200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. జీవో నెంబర్ 59 కింద దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర సీజ్ చేశారు.
మూడునెలల కిందటే హైకోర్టు ఆ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు ఇచ్చింది. ఇక్కడ గతంలోనే పశువుల పాకలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. దగ్గర్లోనే ప్రభాస్ గెస్ట్‌హౌస్ ఉంది. తెలంగాణ ఎన్నికల దృష్ట్యా అధికారులు కొన్నాళ్లు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టలేదు. తాజాగా సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర, సిబ్బంది ఆ స్థలంలోని పాకలు, ప్రహరీలను జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ప్రభాస్ అతిథిగృహం కూడా కూల్చేస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో... ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Prabhas