Viral Video: ఆ బస్సును చేజ్ చెయ్.. యూట్యూబర్‌కు పోలీస్ రిక్వెస్ట్.. ఎందుకో తెలుసా?

రోడ్డుపై యూట్యూబర్‌ని ఆపిన పోలీస్

బస్సెక్కుతూ మందులు మర్చిపోయిన వృద్ధురాలికి ఓ పోలీస్ సాయం చేశాడు. రోడ్డుపై వెళ్తున్న యూబ్యూటర్‌ను ఆపి.. ఆ బస్సును చేజ్ చేసి మందులు ఇవ్వాలని చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే వాయు వేగంతో దూసుకెళ్లి బస్సును అందుకొన్నాడు ఆ యూట్యూబర్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
ఈ మధ్య కాలంలో పోలీసులు కేవలం శాంతి భద్రతలకే కాదు పౌర సేవలకూ అంకిత బావంతో పనిచేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ నినాదంతో ప్రజలకు చేరువవుతున్నారు. తమిళనాడులో తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఈ సంఘటనను చూసిన వారంతా ఆ పోలీస్​ చేసిన పనికి హ్యాట్సాఫ్​ చెబుతున్నారు. ఇంతకీ అతడు చేసిన గొప్ప పనేంటో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ మూల్య అనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగి తమిళనాడులోని తెన్కాశీకి బైక్​పై వెళ్తున్నాడు. అరుణ్​ ఒక యూట్యూబర్​. గత 10 సంవత్సరాల నుండి అనేక ప్రదేశాల్లో బైక్​పై తిరుగుతూ.. లైవ్ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్​లో అప్​లోడ్​ చేస్తున్నాడు. ఇదే క్రమంలో​ బెంగళూరు నుండి తమిళనాడులోని తన్కాశీకి వెళ్తుండగా అతనికి ఊహించని సంఘటన ఎదురైంది.

మార్గ మధ్యంలో ఒక పోలీసు అతన్ని ఆపి, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. దీనికి సమాధానంగా కర్ణాటక నుండి వస్తున్నా అని బైకర్​ తెలిపాడు. ఇంతలో పోలీసు అధికారి తన చేతిలోని ఒక మందుల డబ్బాను చూపిస్తూ .. నీ ముందు ఒక ప్రభుత్వ బస్సు వెళ్తుంది కదా!.. ఆ బస్సులో ఒక ముసలావిడ ఉంది. ఈ ముసలావిడ తన మందుల డబ్బాను ఇక్కడ జారవిడుచుకుంది. వెంటనే ఈ బస్సును ఛేజ్​ చేసి ఈ మందుల డబ్బాను ఆమెకు అందజేయమని కోరాడు. సరేనని చెప్పిన అరుణ్​ కుమార్​​ వేగంగా బైక్​ రైడ్​ చేసి.. ఆ బస్సును చేరకున్నాడు. డ్రైవర్​ను బస్సు పక్కకు ఆపమని సైగ చేశాడు. బస్సు పక్కకు ఆపగానే కిటికీ వద్ద ఉన్న ముసలావిడకు మందుల డబ్బాను ఇచ్చేశాడు. అతడు చేసిన మంచి పనికి ఆ ముసలావిడ కృతజ్ఞతలు తెలిసింది. బస్సులో మిగతా ప్రయాణికులంతా అతన్ని మెచ్చుకున్నారు. కాగా, అరుణ్​ బైక్​ను పోలీసు అధికారి ఆపిన దగ్గరి నుంచి.. ఆ ముసలావిడకు మందుల డబ్బా ఇచ్చే వరకు ప్రతి క్షణం వీడియోలో రికార్డయ్యింది. ఆ వీడియోను అరుణ్​ కుమార్​ తన యూట్యూబ్​ ఛానల్​లో అప్​లోడ్​ చేయగా.. వ్యూవర్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది.

తనకు ఎదురైన ఈ అద్భుతమైన సంఘటన గురించి అరుణ్​ మాట్లాడుతూ.. “పోలీసు నా బైక్​ని ఆపగానే కాస్త కంగారు పడ్డాను. కానీ, అతడు నాకొక టాస్క్​ చెప్పగానే అద్భుతంగా అనిపించింది. ఎలాగైనా ఆ ముసలావిడకు ఈ మందుల డబ్బా అందించాలి అనుకున్నా.. ఎట్టకేలకు ఆమెకు మందుల డబ్బా ఇచ్చాను. నా జీవితంలో ఇటువంటి వీడియోలను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నేను ఊహించనిది!” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ కాలంలో కూడా ఇంత మంచితనం ఉందా అంటూ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సదరు పోలీసు, బైకర్​పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘ఈ ఘటనతో మాకు పోలీసులపై మరింత గౌరవం పెరిగింది. మీరిద్దరూ మానవత్వాన్ని చాటుకున్నారు. మీ సమయస్ఫూర్తికి హాట్సాఫ్.’’​ అంటూ నెటిజన్లు కామెంట్స్​ చేస్తున్నారు.

కాగా, అరుణ్ కుమార్​ ఇప్పటివరకు గుజరాత్, రాజస్థాన్, లేహ్, లడఖ్, హిమాలయాల్లో బైక్​పై పర్యటించి తన యూట్యూబ్ ఛానెల్లో లైవ్ వీడియోలను అప్​లోడ్​ చేశాడు.
Published by:Shiva Kumar Addula
First published: