ఇప్పటిదాకా ప్రత్యర్థులే తప్ప, తొలిసారి సొంత పార్టీకి చెందిన, అందునా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఓ గవర్నర్.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి షాకింగ్ ఆరోపణలు చేశారు. కనీవినీ ఎరుగని స్థాయిలో వ్యక్తిత్వ దూషణకు దిగారు. అంతటితో ఆగకుండా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం రచ్చలోకి లాగుతూ.. మోదీని ఉద్దేశించి షా అసాధారణ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. మాజీ బీజేపీ నేత, ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గడిచిన కొద్ది రోజులుగా కేంద్ర సర్కారుపై, ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, తాజాగా ఆరోపణల పరంపరను మొదలుపెట్టారు. రైతుల విషయంలో ప్రధాని అహంకారిలా వ్యవహరించారని, మోదీ తనకు తాను ప్రజా సేవకుడిలా కాకుండా రాజులా ఫీలవుతున్నారని మాలిక్ మండిపడ్డారు. కేంద్రం ప్రతినిధి అయిన మేఘాలయ గవర్నర్ ఇంత తీవ్ర స్థాయిలో ప్రధానిపై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. మాలిక వ్యాఖ్యలతో కూడిన వీడియోను బీజేపీ ప్రత్యర్థి పార్టీలు వైరల్ చేస్తూ కేంద్రం పెద్దల బండారం బయటపడిందని విమర్శలు చేస్తున్నాయి. పూర్తి వివరాలివి..
ప్రధాని మోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఒక అహంకారి అని, హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధానికి మతిపోయిందని వ్యాఖ్యానించినట్లు మాలిక్ పేర్కొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమానికి తొలి నుంచీ మద్దతు పలికిన మేఘాలయ గవర్నర్.. రైతుల విషయంలో ప్రధానిపై గతంలోనూ కొన్ని వ్యాఖ్యలు చేసినా, ఈసారి మాత్రం అసాధారణ రీతిలో చెలరేగిపోయారు. ఆదివారం నాడు హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.
40కిపైగా రైతు సంఘాలకు చెందిన వేల మంది రైతులు ఏడాదికిపైగా ఉద్యమించడంతో కేంద్రం సాగు చట్టాల రద్దు చేయడం తెలిసిందే. పంటలకు మద్దతు ధర కల్పన, విద్యుత్ చట్టం ఉప సంహరణపై అన్ని రాష్ట్రాలు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ వేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో రైతులు నిరసనలను ముగించి ఇళ్లకు వెళ్లారు. కాగా, రైతుల ఉద్యమం ముగిసిన నెల రోజుల తర్వాత మేఘాలయ గవర్నర్ మాలిక్ మరోసారి ఆ అంశాన్ని లేవనెత్తడం గమనార్హం. రైతుల పెండింగ్ డిమాండ్లను అంగీకరించడంతోపాటు అన్నదాతలపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని మాలిక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోదీతో వ్యక్తిగతంగా జరిగిన వాదనను మాలిక్ వివరించారు..
‘రైతు సమస్యలపై మాట్లాడేందుకు ఇటీవలే నేను ప్రధాని మోదీని కలిశాను. అయితే ఐదు నిమిషాల్లోనే మా సంవాదం కాస్తా గొడవగా మారింది. రైతుల విషయంలో మోదీ అహంకారాన్ని ప్రదర్శించారు. మన రైతులు దాదాపు 500 మంది చనిపోయారని నేను ప్రస్తావిస్తుండగానే.. ‘వాళ్లు నా కోసం చనిపోయారా?’అంటూ ప్రధాని ఆగ్రహించారు. అందుకు నేను అవుననే బదులిచ్చాను. మీరు(మోదీ) రారాజు కాబట్టి రైతుల మరణాలకూ మీరే బాధ్యులని చెప్పాను. ఈ గొడవ తర్వాత ప్రధాని.. నన్ను వెళ్లి అమిత్ షాను కలవమని చెప్పారు. ఆ మేరకు..
ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఉచితంగా రూ.20వేలు.. పదో తరగతి పాసైతే రూ.15వేలు.. ఎలా పొందాలంటే..
ప్రధాని చెప్పినట్లుగానే నేను వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాను. ఆ సందర్భంలో అమిత్ షా ప్రధానిని ఉద్దేశించి ‘సత్యా.. ఆయన(మోదీ)కి మతి తప్పింది’అని అన్నారు. నిజమేమరి, ఎక్కడో కుక్క చచ్చిపోయినా సంతాప లేఖ పంపే ప్రధాని.. రైతుల మరణాలపై స్పందించకపోవడం దారుణం కాదా? ఆయన అహంకారాన్ని స్వయంగా చూసిన తర్వాత ఇక ప్రధానితో పోరాటానికి స్వస్తి పలకాలని నేను నిర్ణయించుకున్నాను’ అని సత్యపాల్ మాలిక్ అన్నారు. పదవి పోతుందనే భయం తనకు లేదని, కేంద్రం కావాలనుకుంటే తనను తొలగించుకోవచ్చనీ మాలిక్ దాదాపు సవాలు చేశారు. మేఘాలయ గవర్నర్ వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ పలువురు కాంగ్రెస్, ఇతర విపక్షాల నేతలు కేంద్రం తీరుపై విమర్శలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Farmers, Farmers Protest, Meghalaya, Pm modi