Plant a Sapling: ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటండి... మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో డాక్టర్ అభ్యర్థన.. ఎక్కడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ఓ డాక్టర్ రోగులకు రాసిచ్చే ప్రస్కిప్షన్ వైరల్‌గా మారుతుంది. అందులో రోగి వాడాల్సిన మందులతో పాటు.. కోలుకున్నాక చెట్టును నాటాలని అభ్యర్థిస్తున్నాడు.

  • Share this:
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లోని హాస్పిటళ్లలో కరోనా రోగులకు ఆక్సిజన్ సైతం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ నిల్వలు పెంచేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రత్యేకంగా ఆక్సిజన్ రైలును సైతం ఏర్పాటు చేసింది. భారత్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ ఇంతలా మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఒక డాక్టర్, రోగులకు ఇచ్చే సూచన వైరల్ అవుతోంది. అనారోగ్యం నుంచి కోలుకున్న ప్రతి ఒక్క రోగి కనీసం ఒక మొక్కను నాటి ప్రాణవాయువు వృద్ధికి తమవంతు సాయం చేయాలని కోరుతున్నాడు. మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో అతడు ఈ మెస్సేజ్ రాస్తున్నాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మెడికల్ ఆక్సిజన్ కొరత భారత్‌ను వేధిస్తోంది. దేశమంతటా ఆక్సిజన్ నిల్వలపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే ప్రాణవాయువు ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించేలా చేసేందుకు ఇదే సరైన సమయమని భావించారు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన కోమల్ కసర్ అనే వైద్యుడు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే రోగులకు.. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటాలని ఆయన కోరుతున్నాడు. పేషెంట్లకు మెడిసిన్ రాసి ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌లో సొంతంగా ఇలా రాస్తున్నారు. డాక్టర్ కోమల్ కసర్ స్థానికంగా సంజీవని ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆయనకు అహ్మద్‌నగర్‌లో మంచి గుర్తింపు ఉంది.

ఆక్సిజన్‌ లోటు గురించి చర్చలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్ కోమల్ చెట్లను నాటాలని ప్రచారం చేస్తున్నారు. గత నెల నుంచి తమ హాస్పిటల్‌కు అనారోగ్యంతో వచ్చే రోగులకు ఇలా సూచనలు చేస్తున్నారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లోని ఫుట్ నోట్‌లో.. ‘అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత ఒక మొక్కను నాటండి’ అని రాస్తున్నారు.

ఈ విషయం గురించి డాక్టర్ కోమల్ మీడియాతో మాట్లాడారు. ‘మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నాకు కూడా రెమ్‌డెసివిర్ మందులు, వెంటిలేటర్ల కోసం చాలామంది కాల్స్ చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఆక్సిజన్ సిలిండర్ల కోసం కాల్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రాణవాయువు గురించి నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆక్సిజన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. అందుకే పేషెంట్ల మెడికల్ ప్రిస్క్రిప్షన్లలో నేను ఒక వాక్యం రాస్తున్నారు. మనకు సహజసిద్ధంగా ఆక్సిజన్‌ను అందించే మొక్కలు నాటాలని కోరుతున్నాను’ అని వివరించారు. ప్రతి ఒక్క రోగి మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో ఇలా రాయడం కష్టంగా మారడంతో ఆయన ఒక రబ్బర్ స్టాంప్‌ తయారు చేయించారు. చేతితో రాయాల్సిన అవసరం లేకుండా రబ్బరు స్టాంప్‌ ద్వారా ప్రిస్క్రిప్షన్‌పై మెస్సేజ్‌ను ప్రింట్ చేస్తున్నట్టు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published: