news18
Updated: November 27, 2020, 7:00 PM IST
image credits reuters/ Twitter
- News18
- Last Updated:
November 27, 2020, 7:00 PM IST
ఆకలితో ఊగిపోతున్న కోతులను శాంతపరిచేందుకు అసాధ్యమైన పనే. కోతి చేష్టలే అదుపు చేయడం కష్టం అందునా ఆకలికి కోపంతో ఉన్న కోతులను కంట్రోల్ చేయడమంటే ఎంత కష్టమైన సవాలో... విపరీతమైన అల్లరి చేస్తూ, నానా భీభత్సం సృష్టిస్తున్న వీటిని అదుపుచేయడం ఎవరి తరం కాలేదు. వీటి ఆకలిని తీర్చి, వీటి మనసు కుదుట పడేలా చేసి, శాంతపరచడం మనుషులకు చేతకాకపోయినా, సంగీతానికి ఆ శక్తి ఉందని తేల్చారు ఓ పియానిస్టు. ఆశ్చర్యకరమైన ఆ సంఘటన థాయ్ ల్యాండ్ లోని లోప్ బురి నగరంలోని ప్రాచీన గుడి ఆవరణలో జరిగింది.
లోప్ బురి (Lopburi) నగరం అంటే కోతులకు ప్రసిద్ధి గాంచింది. ఈ సిటీలో వందలాది కోతులున్నాయి. ఇవన్నీ విపరీతమైన కొంటె చేష్టలు, అల్లరి చేస్తుంటాయి. కోతుల విధ్వంసానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఓ సంగీత విద్వాంసుడు వినూత్నమైన ప్రయోగం చేసి, సఫలవంతమై అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బ్రిటన్ కు చెందిన పియానో ప్లేయర్, పాల్ బార్టన్ క్లాసికల్ మ్యూజిక్ ట్యూన్స్ వినిపిస్తూ కోతుల గుంపుకు వినోదం పంచి, వాటిని శాంతపరచటం విశేషం. థాయ్ ల్యాండ్ లోని లోప్ బురిలోని వందలాది కోతులు 'Diary of love', 'greensleeves' అనే పాటల ట్యూన్లను పియానోలో వాయిస్తుంటే విని మైమరచి, ఆస్వాదించేసాయి.
టూరిస్టులకు చుక్కలే...
ప్రధానంగా టూరిజం పై ఆధారపడ్డ థాయ్ ల్యాండ్ లో లాక్ డౌన్ కారణంగా పర్యాటకుల (tourists) సంఖ్య విపరీతంగా పడిపోగా, ఇక్కడున్న కోతుల జాతులన్నీ ఆకలితో అల్లాడుతున్నాయి. ఈ ప్రాణుల కష్టాన్ని ప్రపంచానికి తెలిపేందుకు, వాటిని శాంతింపజేసేందుకు 59 ఏళ్ల పాల్ బార్టన్ అనే సంగీత కళాకారుడు ఇలా వినూత్నంగా ప్రయత్నం చేశాడు. "వీటి కడుపు నిండినప్పుడు ఇవి ఇంత అల్లరి చేసి, ధ్వంసానికి దిగవు, ఆకలి తీరితేనే వీటి ఆవేశం అదుపులో ఉంటుంది, వీటి ప్రవర్తన, స్పందన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది" అంటూ ఆయన తన మనసులో మాటను చెప్పారు. పియానో వాయిస్తున్న ఇతనిపై, పియానో కీస్ పై కూడా కోతులు ఎగిరి, గంతులేసినా, పియానిస్ట్ మాత్రం తదేక ధ్యాసతో ట్యూన్లను వాయించారు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు ప్రధానంగా కోతులు, వాటి చేష్టలను చూసి వినోదిస్తారు. అయితే ఈ కోతులు వారి సామాను, తిండి, కెమరాలు, ఫోన్లు, బ్యాగులు వంటివన్నీ లాగేసుకుని చుక్కలు చూపిస్తాయి.
మంకీ ఫెస్టివల్ కూడా..
ప్రపంచ పర్యాటకంలో లోప్ బురి అనే ఈ సిటీ అత్యంత ప్రాచీన నగరంగా పేరుగాంచింది. కోతులకు పెట్టింది పేరైన ఈ సిటీలో 'మంకీ ఫెస్టివల్' (monkey festival) ప్రతి ఏటా ఘనంగా సాగుతుంది. 'Rise of the planet of the Apes' అనే హాలివుడ్ (Hollywood) సినిమాను అడుగడుగునా మనకు గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ సిటీలోని కోతుల బెడద కారణంగా కొందరు పర్యాటకులు ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడరు. బ్యాంకాక్ కు 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సిటీకి కరోనా ముందు నిత్యం పర్యాటకులతో కిటకిటలాడేది. ఇక్కడికి వచ్చిన వారంతా కోతులకు ఆహారం తినిపిస్తారు. ప్రతి ఏటా నవంబరు చివరి ఆదివారం ఇక్కడ 'మంకీ ఫెస్టివల్' ను నిర్వహిస్తారు.
Published by:
Srinivas Munigala
First published:
November 27, 2020, 7:00 PM IST