పొగలు కక్కే నూడుల్స్, కోడి గుడ్డు కనురెప్పపాటులో గాల్లో అలా గడ్డకట్టిపోవటాన్ని మీరెప్పుడైనా చూశారా? సైబీరియన్లకు ఇది రొటీన్. ఇక ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సైబీరియాలో ఓ నెటిజన్ తన ఆహారాన్ని ఇలా ఫొటోలతో ట్వీట్ చేయగా అవిప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేసేస్తున్నాయి. -45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య తన నూడుల్స్, కోడిగుడ్డు గడ్డకట్టగా గాల్లో అలా అవి నీలుక్కుపోవటం విశేషం. దీంతో భూమికున్న గురుత్వాకర్షణ శక్తికి కూడా వణుకు పుడుతోందంటూ కామెంట్లు ఊపందుకున్నాయి. సైబీరియాలోని నోవోసిబిర్స్క్ లో క్లిక్ మన్న ఈ ఫొటో ఇప్పుడు భలే వైరల్ (Viral pics) అవుతోంది.
ఉత్తర ధ్రువంలో నివాసం ఉన్న ప్రజలు శీతాకాలంలో పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. మంచు దుప్పట్లో కూరుకుపోయిన ఈ ప్రాంతంలో జనజీవనం ఒక్కసారిగా స్థంభించిపోతుంది. ఇక వీరి రొటీన్ గడవటం కూడా గగనమే. ఉదాహరణకు వీళ్లు బట్టలు ఉతికి ఆరేద్దామన్నా రెప్పపాటులోనే ఆ బట్టలు గడ్డకట్టిపోతాయి. మరోవైపు యాహూ (Yahoo) వెదర్ ఫోర్ కాస్ట్ ప్రకారం మళ్లీ ఇది +4డిగ్రీస్ సెల్సియస్ కు చేరుకుని అటునుంచి +12 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది. ఆతరువాత -23 డిగ్రీలకు పడిపోయి..-30 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు చేరతాయంటూ ఒలెగ్ అనే ఓ నెటిజన్ చేసిన ట్వీట్ అందరినీ అశ్చర్యపరుస్తోంది.
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫార్మ్ లో ఈ ఫొటో ట్వీట్ కు క్షణాల్లో 14,500 లైకులు రాగా 3,700 సార్లు రీట్వీట్ అవ్వటం హైలైట్. ఈ ఫొటోపై సరదాగా స్పందిస్తున్న ట్విట్టరటీలు తెగ కామెంట్లు చేస్తున్నారు. "మా ప్రాంతంలో 23డిగ్రీల సెల్సియస్ కే మేం స్వెట్టర్లు వేసుకుని వణికిపోతాం తెలుసా" అంటూ ట్వీట్ చేశారు. ఇక మరో నెటిజన్ అయితే "ఉదయం 17 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి ఈరోజు మేం స్నానం చేయటం లేద"ని ట్వీట్ చేశారు. ఇలా నెటిజన్లు చేస్తున్న ట్వీట్లు మరింత ఆకట్టుకునేలా ఉండగా, ఒలెగ్ ను వీడియోలు కూడా అడుగుతున్నవారున్నారు. ఆహారం కనురెప్పపాటులో ఎలా గడ్డకడుతోందో చూపే ఆశ్చర్యకరమైన వీడియో కావాలంటూ అడుగుతున్న ట్విట్టర్ యూజర్స్ సైబిరీయా ఉష్ణోగ్రతలపై తెగ సర్చ్ చేస్తున్నారు.
అంటార్కిటికాలోనూ ఇంతే..
గతంలో అంటార్కిటికాలోని (Antarctica) ఇలాంటి సంఘటనలు కూడా ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. ప్రపంచంలో అత్యంత శీతలప్రాంతమైన అంటార్కిటికాలో -70 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గగ్గోలు సృష్టించింది. వింటర్ వండర్లాండ్లుగా (Winter Wonderlands) పేరుగాంచిన ఈ ప్రాంతాల్లో చలికాలంలో ప్రజలు దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది. ప్రకృతికి ఎదురీదుతూ వీరు మంచు తుపానులు సైతం తట్టుకుని నిలబడటం అంటే మాటలు కాదు. ఇక్కడి జీవితం ఏదో వేరే గ్రహంపై నివసిస్తున్నట్టు ఉంటుంది.
సైబీరియన్ పక్షులు అందుకే వలస వస్తాయి
ఇక ఇలాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న మూగ జీవాల బాధలు మాటల్లో చెప్పలేం. చలికి తట్టుకోలేక, తినడానికి తిండి దొరక్క ఇవి నానాఅగచాట్లు పడాల్సి వస్తుంది. ఇక పక్షుల విషయానికి వస్తే ఇక్కడి శీతాకాల ఉష్ణోగ్రతలకు ఇవి తట్టుకోలేక వలస పక్షులుగా మారిపోతాయి. ఏటా సైబిరీయన్ వలస పక్షులు (Siberian migratory birds) ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వలసపోతాయి. మనదేశంలోని ఎన్నో ప్రదేశాల్లో సైబీరియా పక్షులు శీతాకాలంలో దర్శనమిస్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ గంగా ఘాట్లు సైబీరియా వలస పక్షులకు అతిపెద్ద కేంద్రం. ప్రతిఏటా నవంబరులోనే ఈ పక్షులు పెద్ద ఎత్తున కాశీ చేరుకుంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ సైబీరియన్ వలస పక్షులు చలికాలంలోనే కనిపిస్తుంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.