మరి కొన్ని రోజుల్లో 2020 సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ ఏడాది అందరిని ఆకట్టుకునేలా అనేక ఫోటోలు తెర మీదకు వచ్చాయి. అయితే, వాటిన్నింట్లో కెల్లా ఒక ఫొటో మాత్రం అందర్ని ఆకట్టుకొని అవార్డులను సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ ఫోటో ఏంటి అనుకుంటున్నారా?.. తమ భాగస్వాములను కోల్పోయిన రెండు వితంతు పెంగ్విన్లు(Penguins) ఒక దగ్గరకు చేరి ఏకాంతంగా కలిసి ఉన్న దృశ్యం. కాగా, జర్మనీ(Germany)కి చెందిన టోబియాస్ బామ్ గార్ట్నర్ అనే ఫోటోగ్రాఫర్ ఆస్ట్రేలియా(Australia)లోని మెల్బోర్న్(Melbourne) సెయింట్ కిల్డాలో ఈ చిత్రాన్ని తన కెమెరాలో బంధించాడు. కాగా, టోబియాస్ బామ్ గార్ట్నర్(Tobias Baum gaertner) తీసిన ఈ చిత్రం ఓషినోగ్రాఫిక్ మ్యాగజైన్(Oceanographic magazine) అందించే ఓషియన్ ఫోటోగ్రాఫ్ అవార్డులను గెలుచుకుంది. ఈ ఫోటోను పరిశీలిస్తే.. రెండు వితంతు పెంగ్విన్లు ఒకదానిపై ఒకటి ఆలింగనం చేసుకుని రాతిపై నిలబడి మెల్బోర్న్ లైట్లను చూస్తున్నట్లు ఉన్నాయి.
కాగా, ఈ చిత్రం గురించి ఫోటోగ్రాఫర్(photographer) టోబియాస్ బామ్ గార్ట్నర్(Tobias Baum gaertner) మాట్లాడుతూ.. ‘‘చిత్రంలో కనిపిస్తున్న రెండు ఆడ పెంగ్విన్లు తమ భాగస్వాములను ఈ మధ్యే కోల్పోయాయి. కొన్ని రోజుల తర్వాత ఈ రెండు పెంగ్విన్లు కలిసి ఒకే చోట గంటల తరబడి ఉంటున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత వీటిని నా కెమెరాలో ఎలాగైనా వీటిని బంధించాలి అనుకున్నా. ఈ ఫోటోలను తీసేందుకు మూడు రాత్రుల వరకు ఎదురు చూశాను. చివరికి అద్భుతమైన, అందమైన దృశ్యాన్ని నా కెమెరాలో బంధించాను.’’ అని ఆనందం వ్యక్తం చేశాడు. మెరైన్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన టోబియాస్ బామ్ గార్ట్నర్ ఎక్కువగా వన్యప్రాణుల చిత్రాలను క్లిక్ చేస్తాడు. అతను ఆస్ట్రేలియా(Australia)లోని స్వదేశీ సంఘాలతో కూడా పనిచేశాడు
.
ఓషియన్ ఫోటోగ్రాఫ్ అవార్డును గెలుచుకున్న అరుదైన చిత్రం..
కాగా, ఆస్ట్రేలియా(Australia)లోని మెల్బోర్న్ సమీపంలోని సముద్రతీర శివారు ప్రాంతమైన సెయింట్ కిల్డా(St Kilda) చిన్న-పరిమాణం గల పెంగ్విన్లకు ప్రసిద్ది చెందింది. వీటి ఎత్తు దాదాపు 33 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 1,400 చిన్న-పరిమాణ పెంగ్విన్లు నివసిస్తున్నాయి. వీటిని శాస్త్రీయంగా యుడిప్టులా మైనర్ అని కూడా పిలుస్తారు. అయితే, టోబియాస్ తీసిన ఈ చిత్రం ఇప్పటిది కాదు.
ఈ చిత్రాన్ని దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితమే తీశాడు. అయితే, 2020 మార్చిలో తన ఇన్స్టాగ్రామ్(Instagram) హ్యాండిల్లో పంచుకుంటూ, కమ్యూనిటీ ఛాయిస్ అవార్డు కోసం తన చిత్రానికి ఓటు వేయమని నెటిజన్లను కోరాడు. కాగా, ఈ హృదయపూర్వక చిత్రానికి నెటిజన్ల నుంచి అనేక సానుకూల స్పందనలు వచ్చాయి. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ “ఈ చిత్రం వెనుక ఉన్న కథ ఈ మహమ్మారి సమయంలో నాకు ఎంతో రిలీఫ్‌ను కలిగించింది.” అని అన్నాడు. మరొక నెటిజన్ స్పందిస్తూ "ఇది ఎప్పటికీ ఒక మధురమైన ఫోటోగా నిలుస్తుంది." అని అన్నాడు. కాగా, మరో వ్యక్తి "ఇది ఎప్పటికీ నాకు ఇష్టమైన చిత్రంగా మిగిలిపోతుంది." అని అన్నాడు.