మరింత పెరగనున్న పెట్రోల్ ధరలు.. సూయజ్‌ కాలువలో చిక్కుకున్న ఈ నౌకే కారణం

ప్రతీకాత్మక చిత్రం

ఎవర్ గివెన్ షిప్ 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పుతో నాలుగు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తుండగా మంగళవారం సూయజ్ కాలువలో చిక్కుకుపోయింది.

  • Share this:
ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ రవాణాలో కీలక మార్గమైన సూయజ్ కాలువలో ఒక భారీ నౌక ఇరుక్కుపోయింది. ఈజిప్టు సమీపంలో మధ్యదరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలిపే ఈ కాలువ.. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాల్లో ఒకటి. ఆసియా, మధ్యప్రాశ్చం, ఐరోపా దేశాలను కలిపే ఈ ఇరుకైన మార్గం నుంచి పెద్ద మొత్తంలో నౌకలు వెళ్తుంటాయి. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం సరకు రవాణా ఈ కాలువ ద్వారానే జరుగుతుంది. తాజాగా ఎవర్ గివెన్ అనే భారీ సరుకు రవాణా నౌక బలమైన గాలులతో కాలువలో అడ్డంగా చిక్కుకుపోయింది. దీని పొడవు 400 మీటర్లు (1,312 అడుగులు). ఈ నౌకను విడిపించడానికి రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఇక్కడి నుంచి రాకపోకలు సాధ్యపడకపోవడంతో మార్గానికి ఇరువైపులా భారీ సంఖ్యలో నౌకలు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. సూయజ్ కాలువ వద్ద రద్దీ పెరగడంతో ఈజిప్ట్ పాత మార్గాన్ని తిరిగి తెరిచింది. దీని ద్వారా కొన్ని చిన్న నౌకలను తరలించి రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

పనామాకు చెందిన ఎవర్ గివెన్ నౌక.. 2,20,000 టన్నుల సరకుతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవర్ గివెన్ షిప్ 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పుతో నాలుగు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో ఉంటుంది. తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ మెరైన్ అనే సంస్థ దీన్ని 2018లో కొనుగోలు చేసింది. ఇది చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తుండగా, మంగళవారం సూయజ్ కాలువలో చిక్కుకుపోయింది. నౌకలో సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు ఎవర్‌గ్రీన్ సంస్థ తెలిపింది. నౌక చిక్కుకుపోయిన ప్రాంతంలో ఇసుకను తవ్వి, దాన్ని సరైన మార్గంలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సూయజ్ కెనాల్ అథారిటీ (SCA) ఛైర్మన్ అడ్మైరల్ ఒసామా రబీ తెలిపారు.

గత సంవత్సరం ఈ మార్గం నుంచి 19,000 నౌకలు ప్రయాణించాయని సూయజ్ కెనాల్ అథారిటీ చెబుతోంది. అంటే సగటున రోజుకు 50 నౌకలు సూయజ్ కాలువ ద్వారా ప్రయాణిస్తున్నాయి. ఇది ప్రపంచ వాణిజ్యంలో 12 శాతానికి సమానంగా ఉంటుంది. ముఖ్యంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ వంటివి ఈ మార్గం నుంచి ఎక్కువగా రవాణా అవుతుంటాయి. మధ్య ప్రాచ్యం నుంచి ఐరోపా దేశాలకు సరకు రవాణా చేయడానికి సులభమైన, సురక్షితమైన మార్గం. ప్రస్తుతం ఇక్కడి నుంచి సరకు రవాణా సాధ్యపడకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు రెండు నుంచి నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కాలువకు ఇరువైపులా నౌకలు నిలిచి ఉండటం వల్ల సముద్రపు దొంగలు దాడి చేసి దోచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా షిప్పింగ్ కంపెనీలు భయపడుతున్నాయి.

2017లో ఒక జపనీస్ కంటైనర్ నౌక మెకానికల్ సమస్యలతో ఇక్కడ నిలిచిపోయింది. అప్పట్లో ఈజిప్టు అధికారులు సహాయక సిబ్బందిని పంపి నౌకను కొన్ని గంటల్లోనే అక్కడి నుంచి తరలించారు. ఆ తరువాత ఎవర్‌ గివెన్ మళ్లీ ఈ మార్గంలో చిక్కుకుపోయింది. ఈ కాలువ ఈజిప్టులోని సూయజ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన మూడు సరస్సులను తవ్వి.. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలిపారు. అప్పటి నుంచి ఈ 193 కిలోమీటర్ల పొడవైన కాలువ సరకు రవాణాకు కేంద్రంగా మారింది. 2015లో ఈజిప్ట్ ప్రభుత్వం సూయజ్ కాలువను విస్తరించింది.
Published by:Shiva Kumar Addula
First published: