మే 23 తర్వాత భారీగా పెరగనున్న పెట్రో ధరలు.. ఎందుకో తెలుసా?

ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవద్దని భారత్ సహా పలు దేశాలను అమెరికా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ ఆదాయ వనరులను దెబ్బతీయాలన్న లక్ష్యంలో భాగంగా ఆ దేశం ఈ చర్యలకు దిగింది. అయితే, ఆ ఆంక్షలకు భారత్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 24, 2019, 11:16 AM IST
మే 23 తర్వాత భారీగా పెరగనున్న పెట్రో ధరలు.. ఎందుకో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 11:16 AM IST
పెట్రోల్ అనగానే ఠక్కున అడిగే ప్రశ్న.. ధరలు పెరిగాయా? తగ్గాయా? అని. లీటరుకు పది పైసలు పెరిగినా సామాన్యుడికి భారమే. అయితే, త్వరలో ప్రజల నెత్తిన భారీ పెట్రో బాంబు పడనుందా? లీటరుకు దాదాపు రూ.10 వరకు పెంచనున్నారా? అంటే అవునని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. పెట్రో ధరలు భారీగా పెరుగుతాయని ప్రచారం కూడా చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించే మే 23 సాయంత్రమే అందుకు ముహూర్తం ఖరారైందని, అందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని, ఈ విషయం ప్రజలకు చెప్పకుండా దాచిపెడుతున్నారని ఆ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ఇప్పటికిప్పుడు పెట్రో ధరలు పెంచితే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు రావన్న భయంతో ఆ రోజు వరకు ధరలు పెంచవద్దని ప్రధాని మోదీ చమురు కంపెనీలను ఆదేశించారని ఆరోపించారు. ''తన సాహసాలను ప్రతిరోజూ కథలుగా చెప్పుకునే మోడీజీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సొంతం చేసుకునేందుకే ఆయన పెట్రో ఆంక్షలు, ధరలపై నోరు మెదపడం లేదు. మే 23 వరకూ ధరలు పెంచొద్దంటూ ఆయిల్ కంపెనీలను ఆదేశించారు'' అని రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

భారీ పెంపు ఎందుకు?
ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవద్దని భారత్ సహా పలు దేశాలను అమెరికా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ ఆదాయ వనరులను దెబ్బతీయాలన్న లక్ష్యంలో భాగంగా ఆ దేశం ఈ చర్యలకు దిగింది. అయితే, ఆ ఆంక్షలకు భారత్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంటే.. ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు ఆగిపోనున్నాయి. ఈ ప్రభావం పెట్రో ధరలపై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఆంక్షలతో ప్రపంచ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరిగాయి. భారత్ లోనూ పెట్రోల్ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారిక సమాచారం వెలువడనప్పటికీ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి పూర్తిగా నిలిపివేయడం ఖాయమని విశ్వసనీయ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవద్దన్న అమెరికా ప్రకటనను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొంది. ఈ ప్రభావాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. అమెరికా ప్రభుత్వం, ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.
విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్ కుమార్
ఆంక్షల నుంచి అమెరికా మినహాయింపు ఇచ్చే వరకు ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తామని భావించడం లేదని, ఇప్పటికైతే ఆ దేశం నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తున్నామని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేయడానికి గతంలో ఇచ్చిన మినహాయింపులను మే రెండోతేదీ తరువాత కూడా కొనసాగించాలని అమెరికాను కోరతామని, ఇందుకు సంబంధించిన చర్చలు ఈ నెలాఖరులో జరుగుతాయని అన్నారు.
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...