• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • PEOPLE QUEUE UP AT ANAND DUM BIRYNAI POINT IN HOSKOTE KARNATAKA SK

Hoskote birynai: పొద్దుపొద్దునే మటన్ బిర్యానీ.. కి.మీ.ల క్యూలైన్.. ఏంటి దీని స్పెషల్

Hoskote birynai: పొద్దుపొద్దునే మటన్ బిర్యానీ.. కి.మీ.ల క్యూలైన్.. ఏంటి దీని స్పెషల్

పొద్దుపొద్దునే మటన్ బిర్యానీ.. కి.మీ.ల క్యూలైన్.. ఒక్కసారైనా తినాల్సిందే

Hoskote birynai: ఇక్కడ మాత్రం పొద్దు పొద్దున్నే ఆరగిస్తారు. షాపు ముందు ఉదయం 4 గంటల నుంచే క్యూలైన్ కనిపిస్తుంది. కనీసం 1.5 కిలో మీటర్ల మేర బిర్యానీ ప్రియులు బారుతీరుతారు.

  • Share this:
    తెలుగు ప్రజలు బిర్యానీ ప్రియులు. తమ ఇష్టమైన వంటకాల్లో చికెన్ లేదా మటన్ దమ్ బిర్యానీ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు మన హైదరాబాదీ బిర్యానీ వరల్డ్ ఫేమస్..! ఈ బిర్యానీ ఘుమఘుమలు ఇప్పుడు అంతటా వ్యాపిస్తున్నాయి. వీటిలో మన హైదరాబాదీ స్టైల్ టేస్ట్ మాత్రం వెరీ వెరీ స్పెషల్..! ఐతే కొన్ని ప్రాంతాల్లో వారి వారి లోకల్ స్టైల్లో పలు బిర్యానీలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. వాటిలో ఒకటి హోస్‌కోటె మటన్ దమ్ బిర్యానీ. బెంగళూరు ప్రజలకు చాలా సుపరిచతమైన బిర్యానీ ఇది. బెంగళూరుతో పాటు కర్నాటకలోని ఇతర ప్రాంతాల్లో చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి. కానీ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్‌కోటెలో లభ్యమయ్యే ఆనంద్ దమ్ బిర్యానీ మాత్రం చాలా ఫేమస్..! వెరివెరీ స్పెషల్..!

    హోస్‌కోటెలోని KHB కాలనీలో ఉంటుందీ ఆనంద్ దమ్ బిర్యానీ. 22 ఏళ్లుగా దీన్ని నడుపుతున్నారు. ఐతే వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఇక్కడ బిర్యానీ లభిస్తుంది. ఆది, మంగళ, శుక్రవారాల్లో మాత్రమే మటన్ బిర్యానీ విక్రయిస్తారు. చికెన్ ఉండదు. కేవలం మటన్ బిర్యానీ మాత్రమే వండుతారు. సాధారణంగా బిర్యానీ అంటే లంచ్ లేదా డిన్నర్‌లో తింటారు. కానీ ఇక్కడ మాత్రం పొద్దు పొద్దున్నే ఆరగిస్తారు. ఈ షాపు ముందు ఉదయం 4 గంటల నుంచే క్యూలైన్ కనిపిస్తుంది. కనీసం 1.5 కిలో మీటర్ల మేర బిర్యానీ ప్రియులు బారుతీరుతారు. అక్కడ ప్రతి ఆదివారం ఇదే సీన్ కనిపిస్తుంది. ఉదయం 7 తర్వాత వస్తే బిర్యానీ అస్సలు దొరకదు.

    ఆదివారం దాదాపు 500 కేజీల మటన్‌తో బిర్యానీని సిద్ధం చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఉదయం 05.30 నుంచి విక్రయం మొదలు పెడతామని తెలిపారు. అంత బిర్యానీ కేవలం 3 గంటల్లో అమ్ముడవుతుందని.. తమ బిర్యానీకి అంత డిమాండ్ ఉందని వెల్లడించారు. మంగళ, శుక్రవారాల్లో 300 కేజీల మటన్‌తో బిర్యానీ సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఆయా రోజుల్లో బిర్యానీని సిద్ధం చేసేందుకు ముందు రోజు నుంచే ముడి పదార్థాలను సిద్ధం చేసుకోవాలని.. రాత్రంతా నిద్ర ఉండదని చెప్పారు. అందుకే వారంలో మూడు రోజులు మాత్రమే బిర్యానీని అమ్ముతామని తెలిపారు.

    ఆనంద్ బిర్యానీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో వాడే అన్ని పదార్థాలు స్థానికంగా పండించినవే ఉంటాయి. బియ్యం నుంచి మొదులుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా.. ఇలా అన్నీ ముడి పదార్థాలన్నీ స్థానికుల నుంచే సేకరిస్తారు. శుద్ధమైన దేశీ నెయ్యిని వాడతారు. సిలిండర్లు వాడకుండా కేవలం కట్టెల పొయ్యిపైనే సంప్రదాయ పద్దతిలో బిర్యానీ వండుతారు. అందుకే ఎక్కడా లేని రుచి తమ బిర్యానీ సొంతమని చెబుతారు నిర్వాహకులు. ఉదయాన్నే జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చి.. ఈ మటన్ బిర్యానీని టిఫిన్‌గా తింటారని వెల్లడించారు. బిర్యానీ కోసం ఎగబడే జనంతో ట్రాఫిక్ కూడా జమవుతుందని పేర్కొన్నారు.

    భోజన ప్రియులను ఇంతల ఆకర్షించిన ఈ మటన్ బిర్యానీ అందుబాటు ధరలోనే లభిస్తుంది. ఫుల్ బిర్యానీ రూ.230, అదే సింగిల్ అయితే రూ.170. మటన్ పాయా రూ.130. బెంగళూరులో ఉండే తెలుగు ప్రజలకు కూడా ఈ ఆనంద్ బిర్యానీ సెంటర్‌కు వెళ్లి ఆరగిస్తున్నారు. ఐతే మన హైదరాబాద్ బిర్యానీ అంత రుచిగా లేకపోయినా.. కర్నాటకలో దొరికే బిర్యానీల్లో ఇదే బెస్ట్ టేస్ట్ అని చెబుతున్నారు. ఎప్పుడైనా కర్నాటక వెళ్తే మీరూ ఈ హోస్‌కొటె బిర్యానీని టేస్ట్ చేయండి.
    Published by:Shiva Kumar Addula
    First published: