PAWAN KALYAN BHIMLA NAIK SINGER KINNERA MOGILAIAH AMONG EIGHT PERSONS GETS PADM AWARDS FROM ANDHRA AND TELANGANA MKS
Padma Awards 2022: కిన్నెర మొగిలయ్యకు పద్మ శ్రీ పురస్కారం.. భీమ్లా నాయక్‌తో ఫేమ్.. తెలంగాణ, ఏపీ నుంచి పద్మాలు వీరే..
కిన్నెర మొగిలయ్య
73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది పేర్లున్నాయి. తెలంగాణకు చెందిన అరుదైన కళను బతికిస్తూన్న దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య)కు పద్మశ్రీ పురస్కారం లభించింది.
73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది పేర్లున్నాయి. తెలంగాణకు చెందిన అరుదైన కళను బతికిస్తూన్న దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య)తోపాటు రాంచంద్రయ్య, పద్మజారెడ్డిలకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లాకు సంయుక్తంగా పద్మ భూషణ్ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి గరికపాటి నరసింహారావు, గోసవీడు షేక్ హాసన్(మరణానంతరం), డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగిలయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. కళాకారుడుగా కిన్నెర పాటలతో ప్రతి ఒక్కరిని తన్మయత్వంలో ముంచెత్తుతున్న మొగిలయ్య.. తరాల తెలుగు జీవన విధానం, చారిత్రక గాధలు ఒడిసిపట్టి, పాట రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాద్యం పేరునే ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగిలయ్యగా స్థిరపడ్డారు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగిలయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది.
కిన్నెర మొగిలయ్య మొన్నటిదాకా కష్టాలు ఎదుర్కొన్నారు. కళాకారుల పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరవలేదు. ఆసరా పింఛను అడిగితే వయసు చాలదన్నారు. మొగిలయ్య భార్య చనిపోయింది. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. పెద్ద కొడుకు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. మూడో కుమారుడు పదోతరగతి చదువుతుండగా, రెండో కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. అతడి వైద్యానికి నెలకు రూ.4 వేల వరకూ ఖర్చవుతోంది. ఒక దశలో ప్రదర్శనలకు అవకాశం లేకపోవడంతో కుటుంబపోషణ కష్టమైంది. దీనావస్థలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి గత్యంతరం లేక ఆయన నలుగురినీ యాచించాల్సిన దుస్థితి ఏర్పడింది.
పాఠ్యపుస్తకంలో తన గురించి ఉన్న పాఠాన్ని చూపుతూ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో భిక్షాటన చేస్తూ కనిపించిన మొగిలయ్య దుస్థితిపై మీడియాలో కథనాలకు అందరూ చలించారు. తోచినంతలో ఆర్థికసాయం చేశారు. స్పందించిన ప్రభుత్వం ప్రత్యేకంగా.. కళాకారుల ఫించను రూపంలో.. రూ.10వేల సాయాన్ని అందిస్తోంది. మొగిలయ్య గురించి విన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు. ఇటీవలే విడుదలైన ఈ పాటలో మొగిలయ్య కూడా మనకు కనిపిస్తారు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయారీ కిన్నెర కళాకారుడు. ప్రముఖ ఛానెళ్లు కూడా ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ముందుకొచ్చాయి.
ఇలా వైవిద్యమైన కళకు ప్రాణం పోస్తూ.. బావితరాలకు తెలియజేస్తున్న మొగిలయ్య కృషిని గుర్తించిన కేంద్రం ప్రభుత్వం.. కళా రంగంలో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించటం అభినందనీయం. దర్శనం మొగిలయ్యతో పాటు కళా రంగంలో.. తెలంగాణకు చెందిన రామచంద్రయ్య, పద్మజా రెడ్డికి కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఏపీలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలుగా గరికపాటి నరసింహారావు, గోసవీడు షేక్ హసన్, డాక్టర్ సుంకర వెంకటఆదినారాయణ ఉన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.