కరోనా వైరస్‌తో ప్రపంచమంతా వణికిపోతోంది. లక్షలాది మంది మరణించారు. దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పట్లో జనజీవనం సాధారణ స్థితి చేరేలా కనిపించడం లేదు. అయితే ఓ పాకిస్థానీ మాత్రం తన పైత్యం చూపించాడు. తలతిక్క వాదనతో ఏకంగా హై కోర్టుకు వెళ్లాడు.
కరోనా వైరస్ అనేది అసలు లేనేలేదని, ప్రభుత్వం వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదంటూ అజర్ అబ్బాస్ అనే వ్యక్తి లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2లక్షల పాకిస్థాన్ రూపాయల జరిమానా విధించింది. ఇలాంటి అనవసర పిటిషన్లను మరోసారి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎయిర్ కండీషనర్ల మెకానిక్‌గా పని చేస్తున్న అబ్బాస్.. ఏకంగా కరోనా వైరస్‌పై అనుమానాలు వ్యక్తం చేశాడు. కరోనా అనేది అంతర్జాతీయ కుట్ర అని పిటిషన్లో ఆరోపించాడు. అసలు షేక్ హ్యాండ్లు ఇవ్వడం ద్వారా వైరస్ వ్యాపించదని చెప్పాడు. దశాబ్దాలుగా కరోనా లక్షణాలు ఉంటున్నాయని, అసలు ఇది ప్రాణాంతకమే కాదని అతి తెలివి చూపించాడు. అయితే గాలి మాటలు చెప్పవద్దని, వైద్యపరంగా ఆధారాలు ఉన్నాయా అని అబ్బాస్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ మహమ్మద్ ఖాసిమ్ ఖాన్ ప్రశ్నించారు. కరోనా నిజం కాదని ఆధారాలు సమర్పించారని ఆదేశించారు.
అయితే అబ్బాస్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయాడు. అలాగే సమాధానాలు, వివరణలు సైతం పొంతన లేకుండా ఇచ్చాడు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన కుట్రే కరోనా అంటూ అడ్డంగా వాదించాడు. అలాగే పాకిస్థాన్ ప్రభుత్వం కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడం ఆపేయాలని సూచించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం అతడికి 2లక్షల పాకిస్థాన్ రూపాయలను జరిమానాగా విధించింది.
సమాజంలో అనిశ్చితి, భయాందోళనలు రేపే ఇలాంటి పిటిషన్లను వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పిటిషన్‌ను కోర్టు హెచ్చరించింది. మళ్లీ ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పింది. కాగా చైనా సహా ప్రపంచంలో వ్యాక్సిన్లు తయారు చేస్తున్న దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ డోస్‌లను దిగుమతి చేసుకుంటామని ప్రకటించింది.
కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. దేశంలో తయారు చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో ఉందని వెల్లడించింది. వ్యాక్సిన్ డోసులను దేశానికి త్వరితగతిన తీసుకొచ్చేందుకు ఆర్థిక పరమైన అంశంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.