Online food order: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? బిల్లులో ఈ విషయం గమనించారా?

ప్రతీకాత్మక చిత్రం

రెస్టారెంట్ వద్ద ఒక రేటు ఉంటే.. యాప్‌లో మరో రేటు పేర్కొంటున్నాయి. ఐతే డిస్కౌంట్ల పేరుతో ఆహార ప్రియులను ఆకర్షించి.. బురిడీ కొట్టిస్తున్నాయి. పెంచిన రేటు విషయం వారికి తెలియదు. డిస్కౌంట్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా చాలా మంది మోసపోతున్నారు.

  • Share this:
    ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా లాక్‌డౌన్‌తో చాలా మంది ఆన్‌లైన్‌లోన ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. లాక్‌డౌన్ ఈ సేవలకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు కొన్ని ఫుడ్ డెలివరీ సంస్థలు, రెస్టారెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అదనపు పన్నులు, చార్జీల పేరుతో ధరల మోత మోగిస్తున్నాయి. పన్నులు, ప్యాకింగ్ చార్జిలు, డెలివరీ చార్జీల పేరుతో దాదాపు రూ.60 నుంచి రూ.100 అదనంగా వసూలు చేస్తున్నాయి. అంతేకాదు ధరల విషయంలోనూ గోల్ మాల్ చేస్తున్నాయి. రెస్టారెంట్ వద్ద ఒక రేటు ఉంటే.. యాప్‌లో మరో రేటు పేర్కొంటున్నాయి. ఐతే డిస్కౌంట్ల పేరుతో ఆహార ప్రియులను ఆకర్షించి.. బురిడీ కొట్టిస్తున్నాయి. పెంచిన రేటు విషయం వారికి తెలియదు. డిస్కౌంట్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా చాలా మంది మోసపోతున్నారు.

    ఉదాహరణకు.. నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో సింగిల్ బిర్యానీ ప్యాకెట్ ధర రూ.180. కానీ అదే రెస్టారెంట్లో అదే బిర్యానీ ఫుడ్ డెలివరీ యాప్‌లో మాత్రం రూ.250గా చూపిస్తున్నారు. దీనిపై 20 శాతం డిస్కౌంట్ అంటూ వినియోగదారులను ఊరిస్తున్నారు. డిస్కౌంట్ పోగా దాని ధర రూ.200 చూపిస్తోంది. పైగా ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ చార్జీలు, పన్నులు కలుపుకుంటే.. ఆ బిర్యానీ ధర మళ్లీ రూ.250కి చేరుతుంది. రెస్టారెంట్‌లో రూ.180కే వచ్చే బిర్యానీ.. ఫుడ్‌ డెలివరీ యాప్‌లో మాత్రం రూ.250కి లభిస్తోంది. ఇలా రేట్లు పెంచి.. ఆఫర్లతో ఊరించి.. జనాలను మోసం చేస్తున్నాయి.

    ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించి ఇలాంటి ఫిర్యాదులు అనేకం వస్తున్నాయని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. ఏదేని ఫుడ్ డెలివరీ సంస్థ లేదా రెస్టారెంట్ ఇలాంటి మోసాలకు పాల్పడితే.. వినియోగదారుల మండలి లేదా తూనికలు కొలతలు, జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఫుడ్ ఆర్డర్‌పై ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ ధరలు వసూలు చేయడం, డెలివరీ ఛార్జీ వసూలు చేయడం వినియోగదారుడిని మోసం చేయడమేనని చెబుతున్నారు. దానికి రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.


    గతంలో హైదరాబాద్ తార్నాకకు చెందిన విజయ్‌గోపాల్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫుడ్ డెలివరీ సంస్థల మోసాలపై సవాల్ చేశారు. దీనిపై విచారించిన కమిషన్‌-2 బెంచ్‌ సంబంధిత రెస్టారెంట్‌కు రూ.10వేల జరిమానా విధించింది. కేసు ఖర్చుల కింద రూ.5వేలు ఆయనకు చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాదు నష్టపరిహారం కింద వినియోగదారుల సంక్షేమనిధికి రూ.50వేలు చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published: