సోలార్ పవర్ బ్యాటరీ కారు తయారుచేసిన రైతు... ఒకసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. వెళ్తుంది

సోలార్ పవర్ బ్యాటరీ కారు తయారుచేసిన రైతు (image credit - twitter - ANI)

ప్రపంచ కార్ల తయారీ కంపెనీలన్నీ చిన్నబోయే విషయం ఇది. ఓ సామాన్య రైతు సొంతంగా కారు తయారుచేయడం సంచలనం. ఎలా చేశాడో పూర్తి విశేషాలు తెలుసుకుందాం.

 • Share this:
  దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న సమయంలో... ఒడిశాకు చెందిన ఓ రైతు... తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది సోలార్ పవర్ బ్యాటరీతో పనిచేస్తుంది. మయూర్‌భంజ్‌కి చెందిన ఆయన తయారుచేసిన కారు 850 వాట్ల మోటర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ పవర్ 100 Ah/ 54 వోల్ట్స్ ఉంది. ఒకసారి దాన్ని చార్జ్ చేస్తే... ఆ కారు 300 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. అతని పేరు సుశీల్ అగర్వాల్. మయూర్‌భంజ్‌లోని కరంజియా సబ్ డివిజన్‌లో నివసిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ కారును తయారుచేసినట్లు తెలిపాడు. ఇంటిదగ్గరే ఓ గ్యారేజీ లాంటి వర్క్ షాప్ పెట్టుకున్న ఆయన... అక్కడే దాన్ని తయారుచేశాడు.

  ఈ కారు బ్యాటరీ పూర్తిగా చార్జ్ చెయ్యడానికి 8న్నర గంటలు పడుతోందట. "ఇది నెమ్మదిగా చార్జింగ్ అయ్యే బ్యాటరీ. కానీ ఈ బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నుతాయి. ఇది 10 ఏళ్ల పాటూ మన్నుతుంది" అని సుశీల్ అగర్వాల్ తెలిపాడు. ఈ వాహనంలోని మోటర్ వైండింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, ఛాసిస్ వర్క్ అన్నీ వర్క్ షాపులోనే జరిగాయి. ఇందుకు ఇద్దరు మెకానిక్స్, ఓ ఫ్రెండ్ సహకరించారు. వారు ఎలక్ట్రిక్ పనులపై సలహాలు ఇచ్చారు. కారును పూర్తి చేసి 3 నెలలు అయ్యింది. ఐతే... ఇప్పటికీ దాన్లో మార్పులు చేస్తూనే ఉన్నాడు.

  లాక్‌డౌన్ సమయంలో తనకంటూ సొంత కారు ఉంటే బాగుండేది అనుకున్నాడు అగర్వాల్. కొత్త కారు కొనే బదులు... తనే స్వయంగా చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అంతే... అప్పటి నుంచి దానికి కావల్సిన పార్టులను సంపాదిస్తూ... అసెంబ్లింగ్ చేస్తూ వచ్చాడు. "లాక్ డౌన్ వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. లాక్ డౌన్ తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయని అంచనా వేశాను. అందుకే సొంతంగా బ్యాటరీ కారు తయారచేసుకోవాలి అనుకున్నాను" అని అగర్వాల్ తెలిపాడు.


  ఓ సామాన్య రైతు ఇలాంటి కారు ఎలా చేశాడంటే... కారణం కొన్ని పుస్తకాలు, యూట్యూబ్ వీడియోలే. "ఇలాంటి కార్లు పర్యావరణానికి హాని చెయ్యవు. భవిష్యత్తులో అందరూ ఇలాంటివే వాడుతారు. సమాజం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాహనాలను ప్రోత్సహించాలి" అని ఆయన తెలిపాడు.

  ఇది కూడా చదవండి: Horoscope Today: మార్చి 15 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి శ్రమకు తగిన ఫలితం

  మొత్తానికి ఈ కారు చూడటానికి కారులాగా లేకపోవచ్చు. కానీ అగర్వాల్‌కి ఇది కారు లాగానే ఉపయోగపడుతోంది. ఆయన రోజువారీ అవసరాలు తీరుతున్నాయి. ఒక్కసారి రాత్రివేళ చార్జింగ్ పెడితే... ఓ వారం పాటూ హాయిగా వాడుకుంటున్నాడు. తక్కువ ఖర్చుతో పనైపోతోంది. అందుకే ఆయన క్రియేటివిటీని అంతా మెచ్చుకుంటున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: