‘అనుకుంటే కానిది ఏమున్నది.. మనిషనుకుంటే కానిది ఏమున్నది.. చలి చీమే ఆదర్శం.. పని కాదా నీ దైవం.. ఆయువే నీ ధనం.. ఆశయం సాధనం చేయరా సాహసం.. నీజయం నిశ్చయం’ అన్నాడో సినీ కవి. విజయం సాధించడానికి అంగవైకల్యం (Disability) అడ్డురాదని గతంలో ఎంతో మంది నిరూపించారు. తమ కృషి, పట్టుదల, క్రమశిక్షణతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇతరులతో పోలిస్తే తామేమీ తక్కువ కాదని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అటువంటి విజయాన్నే సాధించాడు పాలస్తీనా(Palestina) గాజా(Gaza) ప్రాంతానికి చెందిన యూసఫ్ అబూ అమీరా(Youssef Abu Amira) అనే 24 ఏళ్ల వికలాంగ యువకుడు.
యూసఫ్ పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేకుండా జన్మించాడు. అంతటి అంగవైకల్యం ఉన్నప్పటికీ, కరాటే(karate) నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. లక్ష్యానికి తన అంగ వైకల్యం (Disability) అడ్డు కాదని చెబుతూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తన అద్భుతమైన కరాటే నైపుణ్యాల(Karate Skills)తో అందిరి ప్రశంసలు పొందుతున్నాడు.
యూసఫ్ అబూ అమిరా ఎవరు?
పాలస్తీనాలోని గాజా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యూసఫ్ అంగవైకల్యంతో జన్మించాడు. అయినప్పటికీ, మొక్కవోని పట్టుదలతో ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ గాజా పరిధిలోని కాలేజ్ ఆఫ్ షరియా అండ్ లా(Law) నుంచి డిగ్రీ పట్టా సాధించాడు. ఇదే క్రమంలో తాను ఒక ప్రొఫెషనల్ కరాటే ఛాంపియన్ కావాలని కలలు కన్నాడు. కానీ, తన అంగ వైకల్యం దానికి సహరించట్లేదని మొదట్లో బాధపడ్డాడు. ఏదేమైనా, తాను అనుకున్న కలను నెరవేర్చుకోవాలని ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ కోచ్ హసన్ అల్రాయ్ వద్దకు చేరాడు. ఆయన నిర్వహిస్తున్న ‘‘అల్-మష్టల్ క్లబ్ ఫర్ మార్షల్ ఆర్ట్స్”(Al-Mashtal Club for Martial Arts) సంస్థలో చేరి క్రమం తప్పకుండా శిక్షణ తీసుకున్నాడు. తన స్టిక్ ఫైటింగ్ నైపుణ్యాల(Stick-fighting Skills)తో కరాటే ఆరెంజ్ బెల్ట్ సాధించాడు.
అంగవైకల్యంతో కూడా కరాటే నైపుణ్యాలు సాధించడంపై యూసఫ్ మాట్లాడుతూ "వైకల్యం అనేది మనస్సుకి మాత్రమే, శరీరానికి కాదనేది నా నమ్మకం. అందుకే, అంగవైకల్యం ఉన్నప్పటికీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. నేను దేన్నైనా సాధించగలను అని ప్రపంచానికి నిరూపించాలని గట్టిగా నిర్ణయించుకున్నా. దానికి కరాటేలో నైపుణ్యం సాధించడమే ఏకైక మార్గం అనిపించింది. ఎప్పటికైనా సరే, అంతర్జాతీయ ఛాంపియన్షిప్(International Championships)లలో పాల్గొనాలన్నదే నా కల. దాని కోసం నా ప్రయత్నాన్ని కొనసాగిస్తా." అని అన్నారు.
యూసఫ్ కరాటే కోచ్(Coach) హసన్ అల్-రాయ్(Hassan Al-Raai) మాట్లాడుతూ ‘‘కరాటే నేర్చుకోవడంలో యూసఫ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. అతడు ఎటువంటి వైకల్యం లేని వ్యక్తుల కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. అతని ప్రతిభ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.’’ అని అన్నాడు. కాగా, యూసఫ్ అబూ అమీరా.. గాజా బీచ్ సమీపంలోని శరణార్థి శిబిరంలో నివస్తుంటాడు. అతడు అంగవైకల్యంతో ఉన్నప్పటికీ, మోటరైజ్డ్ మొబిలిటీ స్కూటర్లో నగర వీధుల్లో ప్రయాణిస్తాడు.