Honey Ants: కొన్ని రకాల జంతువులు, కీటకాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. పక్షులు గూళ్లు అల్లుకోవడం, తేనెటీగలు తేనె (Honey) తయారు చేయడం అలాంటివే. అవి మాత్రమే చేయగలిగిన ప్రత్యేక పనులు ఇవి. భూమిపై నివసించే భిన్న రకాల తేనెటీగలన్నీ పుప్పొడి నుంచి తేనెను చక్కగా తయారు చేయగలవు. కొన్నిరకాల కందిరీగలూ ఆ పని చేస్తాయి. దీన్నే వేస్ప్ హనీ అంటుంటారు. అయితే వీటిలాగే ఓ రకం చీమలు కూడా తేనెను తయారు చేసుకుని తమ బొజ్జల్లో దాచుకుంటాయి. వాటి పేరే హనీ పాట్ చీమలు (Honey Pot Ants).
కొన్ని సందర్భాల్లో, హనీపాట్ చీమలు తమ పొట్టలో చాలా తేనెను దాచుకుని పెద్ద పరిమాణంలో పెరుగుతాయి. అప్పుడు అవి అధిక బరువుతో ఒక దగ్గర నుంచి మరో చోటుకు పాకుకుంటూ వెళ్లడం కూడా చాలా కష్టం అయిపోతుంది. దీంతో అవి ఒకే చోట వేలాడుతూ ఉండిపోతాయి. దీంతో ఇతర రకాలు చీమలు వాటిపై దాడి చేసి ఆహారాన్ని అంటే తేనెను లాగేసుకోవాలని చూస్తుంటాయి. ఆ చుట్టుపక్కల ఉండే ఇతర జీవులకు కూడా వీటి పుట్టలు ఆహార వనరుగా మారతాయి.
అత్యవసరాల కోసమే..
అట్లాస్ అబస్కురా వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం.. హనీపాట్ చీమలు తేనె(Honey)ను తయారు చేయగలవు. ఇవి కూడా తేనెటీగలలాగే ఒకేచోట నివసిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆహారం కోసం ఇవి తేనెను తయారు చేసుకుని వెనుక భాగాన ఉన్న పొట్టలో దాచుకుంటాయి. తమ కమ్యూనిటీ (చీమల పుట్ట) మొత్తం ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇవి పని చేస్తాయి. బంగారు రంగులో ఉండే తియ్యటి చిక్కటి లిక్విడ్‌ని ఇవి పొట్టలో పెట్టుకుంటాయి. ఆహారం కొరత వచ్చే సందర్భాలు ఉన్నప్పుడు పొట్ట నుంచి దాన్ని బయటకు తీసి మిగిలిన చీమలన్నింటికీ పంచి పెడతాయి. వీటి శాస్త్రీయ నామం కాంపోనోటస్ ఇన్ఫ్లాటస్.
Charred Chicken: కాల్చిన చికెన్ తినేవారికి హెచ్చరిక.. ప్రాణాలు తీసే ఈ కాన్సర్ వస్తుందట
నేచురల్ స్వీట్నర్
ఆస్ట్రేలియన్లు ఈ చీమల తేనెను తరచుగా ఆహార పదార్థాలలో వాడుతుంటారు. ఇది నేచురల్ స్వీట్నర్గా బాగా పాపులర్ అయింది. నేచురల్ హిస్టారియన్ డేవిడ్ అటెన్‌బరో 1990లో ‘ట్రయల్స్ ఆఫ్ లైఫ్’(Trials Of Life) పేరుతో హనీపాట్ చీమలపై ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. తేనెటీగల తేనె కంటే ఇది కొంచెం పల్చగా ఉంటుందట. రుచిలోనూ కొంచెం తేడా ఉంటుందని దీన్ని టేస్ట్ చేసిన వారు చెబుతున్నారు.
ఎక్కడ కనిపిస్తాయి..?
ఈ హనీ పాట్ చీమలు ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎడారి ప్రాంతాల్లో వీటిని చూడవచ్చు. సౌత్ వెస్ట్ అమెరికా, మెక్సికోలాంటి దేశోల్లోనూ ఇవి కనిపిస్తుంటాయి. అక్కడి వారు ఇవి ఉన్న ప్రాంతాలను గుర్తించి, పుట్టల నుంచి చీమలను సేకరిస్తారు. తర్వాత వీటి నుంచి తేనెను వేరు చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.