ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un)కు సంబంధించిన ప్రతి విషయం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఆయనకు సంబంధించిన మరో వార్త సంచలనంగా మారుతోంది. కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వాదనకు బలం చేకూర్చే ఫోటో ఒకటి ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. కిమ్ తల వెనుక ఒక పెద్ద ఆకుపచ్చ రంగు మచ్చ ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలను ఇది మరింత పెంచింది. జులై 24-27 తేదీలలో జరిగిన మిలటరీ సమావేశంలో 37 ఏళ్ల కిమ్ పాల్గొన్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థలు విడుదల చేశాయి. కిమ్ తల వెనుక భాగంలో కుడి వైపు గాయం, దానికి బ్యాండేజీ ఉన్నట్లు ఆ ఫోటోలో కనిపించింది.
జులై 27- 29 మధ్య జరిగిన ఇతర కార్యక్రమాల్లో సైతం కిమ్ పాల్గొన్నారు. అప్పుడు తీసిన ఫోటోల్లో బ్యాండేజీ కాకుండా, ఆకుపచ్చ రంగులో ఒక పెద్ద మచ్చ కనిపించింది. అయితే జులై 11న జరిగిన కార్యక్రమంలో మాత్రం కిమ్ తలపై ఎలాంటి గాయాలు, బ్యాండేజీ కనిపించలేదు. ఉత్తర కొరియా వ్యవహారాలపై దృష్టి సారించే ఎన్కే న్యూస్ అనే వార్తాసంస్థ ఈ వివరాలను వెల్లడించింది. దీంతో కిమ్‌కు ఏదైనా సర్జరీ చేశారా లేదా గాయమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 40 ఏళ్లు కూడా లేని కిమ్‌కు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడి అధికారిక వార్తా సంస్థలు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నాయి.
NEW: Kim Jong Un appeared with a dark spot on the back of his head during public appearances last week:
-Visible from July 24-27, absent on June 29
-Covered with a bandage in some footage
-Cause or nature of the large, dark spot or bruise is unknownhttps://t.co/WvwRGFME7J pic.twitter.com/oLwQCwTsJX
— NK NEWS (@nknewsorg) August 2, 2021
భారీకాయుడైన కిమ్.. అతిగా మద్యం, పొగ తాగుతాడు. అతడికి ఊబకాయంతో పాటు ఇతర సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతడు 20 కేజీల వరకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అంతకు ముందు అధికారిక సమావేశాల్లో సైతం కిమ్ పాల్గొనలేదు. కొన్ని నెలల పాటు బయటకు రాలేదు. దీనికి అనారోగ్యమే కారణాలకు కావచ్చని వార్తలు వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్ 15న ఉత్తర కొరియాలో అత్యంత ముఖ్యమైన "ది డే ఆఫ్ ది సన్" ఈవెంట్‌కు కిమ్ హాజరుకాలేదు. అతడి తాత పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు దేశవ్యాప్తంగా సెలవు ప్రకటిస్తారు. దీంతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌కు కిమ్ రాకపోవడంతో, అతడికి ఏదో అయిందనే పుకార్లు బలంగా వినిపించాయి. అయితే కిమ్ ఆరోగ్యం ఏమంత అసాధారణంగా లేదని దక్షిణ కొరియా నిఘా సంస్థలు తాజాగా గుర్తించాయి. బ్యాండేజీ తీసివేసిన తరువాత అతడి తలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని మీడియా వర్గాలు సైతం వెల్లడించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kim jong un, North Korea, VIRAL NEWS