NITHYANANDA DEATH RUMOURS THAT KAILASA SPH JGM NITHYANANDA CLARIFIES THAT HE IS IN SAMADHI MKS
Nithyananda: సమాధిలోకి నిత్యానంద.. చనిపోయాడని భక్తుల శోకాలు.. చుట్టూ 27 మంది డాక్టర్లు..
సమాధిలో నిత్యానంద
కైలాస పేరుతో సొంత దేశాన్నే ఏర్పాటు చేసుకున్న వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు నిత్యానంద కన్నుమూశారనే వార్త ఆయన భక్తులను శోకసంద్రంలో ముంచింది. 44 ఏళ్లకే శివైక్యం పొందారంటూ నిత్యానందను తలుచుకొని ఆయన అభిమానులు శోకించారు. కానీ..
తమను తాము భగవంతుడి అవతారంగా చెప్పుకునే దొంగ బాబాలు అందరిలోకీ ఘటికుడుగా పేరుపొందాడు నిత్యానంద. ఏకంగా సొంత దేశాన్నే ఏర్పాటు చేసుకున్న ఈ వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు కన్నుమూశారనే వార్త కలకలం రేపింది. 44 ఏళ్లకే శివైక్యం పొందారంటూ నిత్యానంద భక్తులు శోకించారు. కానీ అంతలోనే స్వామీజీ నుంచే ట్విస్టింగ్ ప్రకటన వెలువడింది.
ప్రతి పండుగకు భిన్న వేషాలేస్తూ, ఏ దేవుడి పండుగైతే తాను ఆ అవతారాన్నంటూ కైలాసం నుంచి వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేయడం నిత్యానందకు నిత్యకృత్యం. తాగాజా ఆయన సమాధి ప్రక్రియకు చేపట్టాడు. అయితే స్వామి లీలల్ని సరిగా అర్థంచేసుకోలేకపోయిన భక్తగణం.. ఆయన చనిపోయారంటూ శోకాలు పెట్టింది. తాను చావలేదని, చనిపోయినట్లు జరుగుతోన్న ప్రచారం అంతా వట్టిదేనని, నిజానికి సమాధిలో ఉన్నానని, ఆ స్థితి మరణంగా కొందరు పొరపడ్డారని నిత్యానంద వివరణ ఇచ్చుకున్నాడు.
‘నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను. నేను మరణించినట్లు కొందరు పుకార్లను వ్యాప్తిచేస్తున్నారు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది డాక్టర్లు నాకు చికిత్స చేస్తున్నారు’అని నిత్యానంద పెన్నుతో పేపర్ పై రాస్తున్న వాక్యాల తాలూకు ఫొటోలను కైలాస దేశం అధికారికంగా సోషల్ మీడియాలో విడుదల చేసింది.
తమిళనాడుకు చెందిన అరుణాచలం రాజశేఖరన్ అలియాస్ నిత్యానంద చిన్నవయసులోనే ఆథ్యాత్మిక గురువుగా ఎదిగి, తానే భగవంతుడినని ప్రకటించుకోవడం, అనంతికాలంలోనే లక్షల కోట్లు విలువ చేసే ఆశ్రమాలు, భూములకు అధిపతి కావడం తెలిసిందే. తర్వాతి కాలంలో సినిమా హీరోయిన్లతో ఏకాంతంగా గడుపుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడం, లైంగిక దాడి ఆరోపణలపై అరెస్టు కావడం.. భారత్లో వికృత చేష్టలకు పాల్పడి జైలుపాలై.. బెయిల్పై ఉండగానే విదేశాలకు పారిపోవడం చకచకా జరిగిపోయాయి.
ఆ తర్వాత కొన్నేళ్లకు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ సొంత దేశాన్ని స్థాపించుకున్నాడు నిత్యానంద. ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొని ఏకంగా కొత్త దేశాన్ని స్థాపించి, దానికి కైలాస అని పేరుపెట్టి, దానికంటూ ప్రత్యేక కరెన్సీ, రాజ్యాంగం గట్రా రూపొందించి, తన దేశాన్ని గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితికి సైతం అప్పీలు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలతో నిత్యం చర్చలో ఉంటాడీ స్వయంప్రకటిత దేవుడు. నేరాలు, మోసాలకు పాల్పడినా ఆయనను నమ్మే, పూజించే భక్తుల సంఖ్య తగ్గలేదు సరికదా, ఈ మధ్య పెరుగుతూవస్తోంది. అట్లుంటది నిత్యానందతోని!
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.