Home /News /trending /

NEW PROBLEMS FOR ELURU PEOPLE AFTER MYSTERY DISEASE PRN

Mystery Disease: పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు.. ఏలూరు వాసులకు కొత్త సమస్య

News 18 Creative

News 18 Creative

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులకు కొత్త కష్టం వచ్చింది. శుభకార్యాలు, ఫంక్షన్లకు ఏలూరు వచ్చేందుకు ఇతర ప్రాంతాల వాసులు నిరాకరిస్తున్నారు. కొందరు స్థానికులు కూడా గ్రామాలకు తరలిపోతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి మిస్టరీ ఇంకా వీడలేదు. వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను డాక్టర్లు, శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. అన్నం తినాలన్నా, నీళ్లు తాగాలన్నా భయపడే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, ఏలూరు ప్రజలకు మరో కొత్త కష్టం వచ్చిపడింది. ఈ వింత వ్యాధి ప్రభావంతో ఇతర ప్రాంతాల వారు ఏలూరుకు రావడానికి జంకుతున్నారు. వింత వ్యాధి ప్రభావం ఎలా ఉందంటే..పెళ్ళిళ్లు, ఇతర శుభకార్యాలపై కూడా ప్రభావం చూపిస్తోంది. శుభకార్యాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి ఏలూరు రావాలంటే బంధువులు ముఖం చాటేస్తున్నారు. వింత వ్యాధి భయంతో రావడం లేదని బంధువులు సమాచారం ఇస్తున్నారు. బంధువుల పెద్దగా రాకపోవడంతో శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకున్నవారు నిరాశకు గురవుతున్నారు.

    అసలే కరోనా.. ఆపై వింత వ్యాధి
    గతంలో కరోనా వైరస్ ప్రబలడం వల్ల వివాహాలు వాయిదా పడ్డాయి. తాజాగా, కరోనా మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుతున్న తరుణంలో ఈ వింత వ్యాధి వ్యాప్తి చెందడం ఏలూరు వాసులను మరింత బాధిస్తోంది. శుభకార్యాల కోసం భారీగా ఏర్పాట్లు చేసుకున్నవారందరిదీ ఇదే దుస్థితి. ఈ పరిస్థితి పగవారికి కూడా రాకూడదంటూ వాపోతున్నారు. మరోవైపు వింత వ్యాధి భయంతో స్థానికులు కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. గ్రామాల నుంచి ఏలూరు వచ్చి సెటిలైన వారు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఖాళీ చేసి పోతున్నారు. ప్రజల్లో భయం పొగొట్టుకునేందుకు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఏ క్షణాన ఏం జరుగుతోందనని ఆందోళన చెందుతున్నారు.

    ప్రభుత్వం భరోసా
    మరోవైపు ఏలూరులో ప్రత్యేక వైద్యశిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎయిమ్స్ తో సహా ఇతర ప్రఖ్యాత సంస్థల నిపుణులు శాంపిల్స్ ను పరీక్షిస్తున్నారు. ముఖ్యంగా తాగునీటిలోనే ప్రమాదకర రసాయనాల అవశేషాలున్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ అయింది. ఇక ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం ఆళ్లనాని దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. శనివారం బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన ఆయన.. వారికి ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. వరుసగా రెండో రోజూ మంత్రి ఆళ్లనాని అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికంగా డ్రెయిన్లు, ఇళ్లను పరిశీలించి పారిశుద్ధ్యంపై మున్సిపల్, వైద్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు ఘటనలో ఇప్పటివరకు 615 మంది అస్వస్థతకు గురవగా వీరిలో 500మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు మృతి చెందారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Eluru

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు