NEW PROBLEM FOR WORK FROM HOME EMPLOYEES THIS COMPANY TO INSTALL CAMERAS IN EMPLOYEES HOME FULL DETAILS HERE PRN GH
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్... దీనికి ఒప్పుకోకుంటే జాబ్ గోవిందా...!
ప్రతీకాత్మకచిత్రం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాలం నడుస్తోంది. దీంతో ఉద్యోగులకు ఆఫీసులకు వచ్చే అవకాశం లేకపోవడంతో 90శాతం సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి. ఐతే ఓ కంపెనీ..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాలం నడుస్తోంది. దీంతో ఉద్యోగులకు ఆఫీసులకు వచ్చే అవకాశం లేకపోవడంతో 90శాతం సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి. ఈ విధానం కొందరికి బాగానే ఉన్నా.. మరికొందరికి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలో ఓ కంపెనీ ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. తమ ఉద్యోగుల ఇళ్ళల్లో కెమెరాలు ఇన్స్టాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. కెమెరాలు పెట్టేందుకు అంగీకరించని ఉద్యోగుల కొలువులు పీకేయడానికి కూడా సందేహించడం లేదు. దీంతో ఈ కంపెనీ తీరు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. టెలీ పర్ఫార్మెన్స్ అనే ఓ ప్రముఖ కాల్ సెంటర్ కంపెనీ ఉద్యోగుల ఇళ్లలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి, రికార్డ్ చేయడానికి ఏఐ-ఆధారిత కెమెరాలను ఇన్ స్టాల్ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే కొలంబియాలో వర్క్ చేస్తున్న ఉద్యోగులపై కెమెరాల ఏర్పాటుకు అంగీకరించాలని ఒత్తిడి తెస్తోంది. ఉద్యోగుల ఇళ్లలో ఏఐ కెమెరాల పర్యవేక్షణ, వాయిస్ అనలిటిక్స్ ఏర్పాటు చేయడంతో పాటు మైనర్లతో సహా కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన డేటా స్టోర్ చేసుకునేందుకు వీలుగా ఓ కాంట్రాక్టుపై సంతకం చేయాలని టెలీ పర్ఫార్మెన్స్ కంపెనీ ఒత్తిడి చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ బీపీఓ సంస్థలో 3.80 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. భారతదేశంలో 70,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. యాపిల్, గూగుల్, ఉబెర్ బార్ క్లేస్ లతో కలసి పనిచేస్తున్న ఈ కంపెనీ 2.4 లక్షల వర్క్ ఫ్రం హోం ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ తాజా నిర్ణయంతో వీరంతా ఆందోళన పడుతున్నారు. మేము బెడ్ రూమ్ లో పని చేస్తామని.. అలాంటప్పుడు కంపెనీ బెడ్ రూమ్‌లో కూడూ కెమెరా పెడుతుందా అని చాలా మంది ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు టెలీ పర్ఫార్మెన్స్ జైపూర్ బ్రాంచ్ మేనేజ్మెంట్ మాత్రం విస్తుపోయే సమాధానాలు ఇస్తుంది. భద్రతా కారణాల వల్ల కెమెరాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తోందని ఈ విభాగం చెబుతోంది. ఉద్యోగి తమ కంపెనీ సిస్టంలో కి లాగిన్ అయినప్పుడు.. సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి కెమెరాలు ఇన్స్టాల్ చేయబోతున్నట్టు కంపెనీ తెలిపింది.
పరిమిత క్లయింట్ ప్రోగ్రామ్‌లకు మాత్రమే అధిక స్థాయి భద్రత అవసరమవుతుందని కంపెనీ చెబుతోంది. కార్మిక చట్టాల అనుమతుల పరిధిలో భద్రతా ప్రోటోకాల్‌ల ప్రకారం ఎక్కువసార్లు స్నాప్షాట్లను తీసుకుంటున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. భద్రత నిమిత్తం కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి నిరంతరం పని చేయవని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగుల వ్యక్తిగత ప్రైవసీకి తమ సంస్థ కట్టుబడి ఉందని.. ఇతర సమాచారం సేకరించాల్సిన అవసరం తమకు లేదని ఈ సంస్థ వెల్లడించింది.
2020 చివర్లో, అల్బేనియాలోని టెలీ పర్ఫార్మెన్స్ ఉద్యోగులు వీడియో పర్యవేక్షణను ప్రవేశపెట్టాలనే కంపెనీ ప్రతిపాదనపై దేశ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ప్రొటెక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇళ్లలోని ఉద్యోగులను పర్యవేక్షించడానికి వెబ్‌క్యామ్‌లను ఉపయోగించరాదని కమిషనర్ అధికారులు తేల్చారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.