ఈ సంవత్సరం కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. మహమ్మారికి భయపడి చాలామంది తమ ప్రయాణాలు, టూర్లను వాయిదా వేసుకున్నారు. దీనికి ఆర్థిక పరిస్థితులు కూడా తోడయ్యాయి. కొన్ని నెలల తరువాత ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో వచ్చే సంవత్సరం విహార యాత్రలకు వెళ్లేందుకు చాలామంది ప్రణాళికలు వేసుకుంటున్నారని తాజా అధ్యయనం చెబుతోంది. ఈఎంఐ ఫైనాన్సింగ్ సంస్థ జెస్ట్ మనీ, బై నౌ పే లేటర్ ప్లాట్‌ఫాం కలిసి సంయుక్తంగా సర్వే చేశాయి. ట్రావెల్ ప్లాన్స్ పై ప్రజల అభిప్రాయం ఏంటి, వచ్చే ఏడాది ఎంతమంది ప్రయాణాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే అంశాలపై అధ్యయనం చేశారు.
దేశంలోని మెట్రో, టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి 4,600 మంది అభిప్రాయం తీసుకున్నారు. గత మూడు నెలల్లో ఎలాంటి వెకేషన్ తీసుకోలేదని సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది చెప్పారు. 2021 ప్రారంభంలో టూర్లకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుంటున్నామని 57 శాతం మంది చెప్పారు.
దేశీయ పర్యటనలకే ఆసక్తి
ఎక్కువ మంది ప్రజలు దేశీయంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకే వెళ్లాలనుకుంటున్నారని సర్వే ద్వారా తెలిసింది. ఈ జాబితాలో గోవా (53.1 శాతం), కేరళ (32.9 శాతం), సిమ్లా (31.4 శాతం) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. లద్దాఖ్, కశ్మీర్, జైపూర్, ఆగ్రా, మైసూరు వంటి ఇతర ప్రసిద్ధ ప్రాంతాలకు వెళ్లనున్నట్లు చాలామంది చెప్పారు. కరోనా వల్ల హాలిడే, ట్రావెల్ బడ్జెట్ దెబ్బతిన్నట్లు 44 శాతం మంది చెప్పారు. ఖర్చులను తగ్గించేందుకు చాలామంది ప్రజలు తమ ప్రయాణాలు, టూర్లను రద్దు చేసుకున్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలుస్తోందని జెస్ట్‌మనీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు లిజ్జీ చాప్మన్ చెబుతున్నారు.
కరోనా ప్రభావంతోనే..
కరోనా ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపడంతో ప్రజలు ఖర్చులను తగ్గించారు. దీంతో ప్రతి సంవత్సరం యాత్రలకు వెళ్లేవారు ఈ సంవత్సరం ప్లాన్లను రద్దు చేసుకున్నారు. కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఖర్చులు తగ్గిస్తూ, డబ్బు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో కొత్త సంవత్సరంలో సెలవులను ఎంజాయ్ చేసేందుకు పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్టేకేషన్లు, టూర్ ప్యాకేజీలు, దేశీయ విమాన ప్రయాణాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.