నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, సుమంత్, రానా, ప్రకాష్ రాజ్, దగ్గుబాటి రాజా, క్రిష్, నిత్యామీనన్, రకుల్ తదితరులు
కెమెరా: జ్ఞాన శేఖర్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నిర్మాత: నందమూరి వసుంధరా దేవి, నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
రేటింగ్: 3.5/5
మహానటుడు తెలుగువారి ఆరాథ్య నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ బయోపిక్‌ను అనౌన్స్ చేయగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ బయోపిక్‌లో తన తండ్రి పాత్రలో నటిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ముందు తేజ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ బయోపిక్‌ను ఆ తర్వాత క్రిష్ చేతుల్లోకి వెళ్లింది. మరి మహానాయకుడుగా, కథానాయకుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సఫలమైందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే...
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కథ విషయానికొస్తే..ఆయన జీవితమే కాదు..తెలుగు సినిమా ఇండస్ట్రీని బుడి బుడి అడుగులను చూపించడమే. 1984లో మద్రాస్‌లో బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్తో ఈ సినిమా స్టార్ట్ అవుతోంది. ఆ తర్వాత సొంత ఊరులో రిజిస్ట్ర్రార్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ పాత్రను స్టార్ట్ చేశారు. ఆ పరిస్థితుల్లో అక్కడ అవినీతిని భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి..నటుడవుదామని మద్రాస్ రైలు ఎక్కుతాడు. అక్కడా రామారావు..‘మనదేశం’ తర్వాత కథానాయకుడిగా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతాయి.
ఆ వెంటనే సినిమా రంగం వద్దనుకొని సొంతూరుకు వెళ్లాలనుకునే టైమ్‌లో బి.ఏ.సుబ్బారావు తన ‘పల్లెటూరి పిల్ల’లో అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత ‘పాతళా బైరవి’ సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఆ తర్వాత హీరోగా వెనుదిరిగి చూసుకోకపోవడం వంటివి ఈ సినిమాలో చూపించారు. ఆ తర్వాత దివిసీమ ఉప్పెనతో ప్రజల కష్టాలను చూసి చలించపోయిన రామారావు ...తెలుగు దేశం పార్టీ పెట్టడంతో కథానాయకుడు ముగుస్తుంది.
నటీనటుల విషయానికొస్తే..
బాలకృష్ణ తన సినీ జీవితంలో వందల సినిమాల్లో వేసిన పాత్రలు ఒకెత్తు..ఈ సినిమాలో స్వయంగా తండ్రిపాత్రలో నటించడం మరొక ఎత్తు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. ప్రపంచ సినీ చరిత్రలో ఒక వ్యక్తి బయోపిక్‌లో ఆయన తనయుడు నటించడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమా నిర్మాణ బాధ్యతను తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ముఖ్యంగా తండ్రి రామారావు పాత్రలో బాలయ్య నటన బాగుంది.
ముఖ్యంగా రామారావు మొండితనం, కృషి, సమయపాలన వంటివి ఈసినిమాలో చూపించారు. ఎన్టీఆర్ తన సినీ జీవితంలో ఎన్నో వందల సినిమాల్లో వేసిన ఎన్నో అద్భుతమైన పాత్రలను ఈ సినిమాలో పోషించాడు బాలకృష్ణ . ఈ రకంగా తండ్రి రామారావు చేసిన పాత్రలను తాను చేయలేదన్న లోటును పూడ్చుకున్నాడు.
మరోవైపు మద్రాసులో తన రూమ్ మేట్సైన దర్శకులు తాతినేని ప్రకాష్ రావు, యోగానంద్, సంగీత దర్శకుడు టీవీ.రాజులకు తన సొంత బ్యానర్లో దర్శకులుగాగా అవకాశం ఇవ్వడం వంటివి ఈ సినిమాలో రామారావు స్నేహబంధాన్ని అవిష్కరించారు. మరోవైపు తన దగ్గర మేకప్ మేన్‌గా పనిచేసిన పీతాంబరంతో ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమా చేసి..ఆ చిత్రం రిలీజ్ టైమ్‌లో దేశంలో ఎమర్జెన్సీ విధించడం...అలాంటి టైమ్‌లో తన సినిమాలను రిలీజ్ అయ్యేలా చేసి నిర్మాతకు నష్టం లేకుండా చేయడం వంటి వాటితో రామారావు గొప్పతనాన్ని తన పాత్రతో ఆవిష్కరించాడు బాలయ్య.
మరోవైపు బసవ తారకం పాత్రలో విద్యాబాలన్‌కు మంచి పాత్రే దక్కింది. సినిమా స్టార్టింగ్‌లో విద్యాబాలన్ మేకప్ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉన్న సినిమా మొత్తం ఆమె పాత్రను చాలా హుందాగా చూపించారు. మరోవైపు కె.వి.రెడ్డిగా క్రిష్, నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్, చక్రపాణిగా మురళి శర్మ, హరికృష్ణగా కళ్యాణ్ రామ్, బీ.ఏ.సుబ్బారావుగా నరేష్ నటన బాగుంది. మరోవైపు ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో దగ్గుబాటి రాజా సినిమా మొత్తం ఉన్నారు. ఇక మిగతా పాత్రలు గెస్ట్ రోల్స్ అనే చెప్పాలి.
టెక్నీషియన్స్ విషయానికొస్తే..
దర్శకుడు క్రిష్ ...తాను అనుకున్న కథను ఎలాంటి తడబాటు లేకుండా ఒక పద్ధతి ప్రకారంగా షూట్ చేసాడు. ఇక్కడ రామారావు బాల్యపు ఫోటోను బసవ తారకం పాత్రతో చూపించి..ఏకంగా రిజిష్టర్ ఆఫీస్‌లో ఉద్యోగి పాత్రలో రామారావు పాత్రను ప్రారంభించాడు. ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎదిగిన వైనాన్ని చూపించారు. ముఖ్యంగా ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో కైలాస పర్వతం ఎత్తే సీన్ కోసం రామారావు 20 గంటల వరకు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా షోషించిన విషయాన్ని ఈ బయోపిక్‌లో చూపించారు. రాయలసీమ కరువు సమయంలో విరాళాలు స్వీకరించే విషయంలో ప్రజల మధ్యకు వెళ్లడం. ఆ సమయంలో విజయాధినేత నాగిరెడ్డితో గొడవను చూపించారు.
మరోవైపు దివిసీమ ఉప్పెన ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. అక్కడే రాజకీయాలకు ప్రవేశించాలనే నిర్ణయం తీసుకోవడం వంటివి చూపించడం బాగుంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు రెండు కళ్లలాంటి వారైన ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు ఒకేసారి కేంద్రం పద్మశ్రీ ప్రకటించడం వంటివి బాగున్నాయి. అక్కడ వీళ్లను మద్రాసీలుగా పిలవడం ..దానికి రామారావు ఇందిరా గాంధీతో మేము తెలుగువారమంటూ చెప్పడం. మరోవైపు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనే బిరుదు శ్రీశైల శంకరా చార్యా పీఠాధిపతి ప్రసాదించినట్టు ఈసినిమాలో చూపించారు. మరోవైపు 60 ఏళ్ల వయసులో 16 ఏళ్ల హీరోయిన్‌తో చిందేయడాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆక్షేపించడం వంటివి ఈ సినిమాలో చూపించారు. మొత్తానికి రామారావు జీవితంలో ముడిపడిన ముఖ్యమైన సన్నివేశాలకు దర్శకుడిగా క్రిష్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు.
సంగీత దర్శకుడిగా కీరవాణి..తన పాటలు, రీ రికార్డింగ్‌తో ఈసినిమాకు ప్రాణం పోసాడు. జ్ఞానశేఖర్ ఫోటోగ్రపీ, కళా దర్శకుడు పనితనం అన్ని బాగున్నాయి. మొత్తానికి అప్పటి తెలుగు సినిమా వైభవంతో పాటు కథానాయకుడిగా రామారావు సినీ ప్రస్థానాన్ని చూడాలనకునే వాళ్లు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ తప్పక చూడాల్సిందే.
మొత్తానికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు రామరావు కథే నాయకుడిగా నిలిచింది.