Lucky Lockdown: రెస్టారెంట్‌ను ఆదుకున్న అజ్ఞాత కస్టమర్.. 37 డాల‌ర్ల బిల్లుకు 16వేల డాల‌ర్ల టిప్

ప్రతీకాత్మకచిత్రం

ఐర్లాండ్‌లోని ఒక నగరంలో ఉన్న రెస్టారెంట్‌కు ఊహించని గిఫ్ట్ ప్రైజ్ ఇచ్చాడు ఒక కస్టమర్. కోవిడ్ కారణంగా ఎదురైన నష్టాలను పూడ్చుకోవడ?

  • Share this:
డ‌బ్బు సంపాదించ‌డం అంత ఈజీ కాదు. అలాగే దానం చేయ‌డ‌మూ అంత సులువు కాదు. ప‌దిరూపాయ‌లు ఇస్తేనే ప‌దిసార్లు త‌మ పేరు మోత మోగిపోవాల‌నుకునేవారున్న ఈరోజుల్లో.. ఒక అజ్ఞాత వ్య‌క్తి ఏకంగా 11 ల‌క్ష‌ల రూపాయ‌లు టిప్పు రూపంలో ఇవ్వ‌డం.. అది కూడా త‌న పేరు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని కోరుకోవ‌డం ఆశ్చర్యకరం. లాక్ డౌన్ కాలంలో చాలామంది త‌మకు తోచినంత దానం చేశారు. సాటి మ‌నుషుల కోసం చేశారు. మాన‌వత్వం మిగిలే ఉంద‌ని చాటారు. ఇండియాలో సోనూ సూద్ లాంటి వారు ఇప్ప‌టికీ త‌మ ఆప‌నహ‌స్తాన్ని అందిస్తూనే ఉన్నారు. అయితే ఐర్లాండ్‌లోని ఒక నగరంలో ఉన్న రెస్టారెంట్‌కు ఊహించని గిఫ్ట్ ప్రైజ్ ఇచ్చాడు ఒక కస్టమర్. కోవిడ్ కారణంగా ఎదురైన నష్టాలను పూడ్చుకోవడానికి భారీ మొత్తాన్ని టిప్‌గా ఇవ్వడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర ఐర్లాండ్‌లోని లండ‌న్ డెర్రీ న‌గ‌రంలో ‘స్టంబుల్ ఇన్ బార్ అండ్ గ్రిల్’ రెస్టారెంట్ ఉంది. లాక్ డౌన్ కారణంగా క‌ష్టాల్లో ఉన్న ఈ రెస్టారెంట్ ఉద్యోగుల‌కు అనుకోకుండా ఓ భారీ టిప్ ల‌భించింది. ఆ టిప్ మొత్తం విలువ 16 వేల డాలర్లు (రూ.11 ల‌క్ష‌లు) కావడం గమనార్హం. ఈ రెస్టారెంట్‌కు వ‌చ్చిన ఓ క‌స్ట‌మ‌ర్ చిల్లీ డాగ్స్‌, ఫ్రైడ్ పికెల్ చిప్స్‌, డ్రింక్స్ ఆర్డ‌ర్ చేశాడు. త‌న బిల్లుతోపాటు అత‌డు ఈ భారీ మొత్తాన్ని టిప్‌గా ఇచ్చాడు. ముందు ఈ విషయాన్ని ఎవ‌రూ గుర్తించ‌లేదు. కానీ బార్ మేనేజ‌ర్ సంబంధిత క‌స్ట‌మ‌ర్ తో మాట్లాడిన త‌రువాత అది పొర‌పాటు కాద‌ని అక్క‌డి ఉద్యోగుల‌కు టిప్పుగా ఇచ్చిన‌దే అని అర్థ‌మైంది. పైగా తనెవ‌రో బ‌య‌ట‌కు తెలియాల్సిన అవ‌స‌రం లేద‌ని, అజ్ఞాతంగానే ఉండనివ్వాలని కోరాడు.

ఈ క‌స్ట‌మ‌ర్ ఆర్డ‌ర్ చేసిన ఐటెమ్స్‌కు అయిన బిల్లు.. కేవ‌లం 37.93 డాల‌ర్లు మాత్రమే. దీంతో పాటు 16వేల డాల‌ర్ల టిప్‌ను క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించాడు. ఈ మొత్తాన్ని ఒకేచోట ఖ‌ర్చుచేయ‌కండి అని సదరు కస్టమర్ చెప్పినట్లు సిబ్బంది తెలిపారు. ఇంత మొత్తం టిప్పు రావ‌డంతో ఉద్యోగులు ఆశ్చ‌ర్య‌పోయారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే మీ రెస్టారెంట్ ఉద్యోగులు ఇంత టిప్పు పొంద‌డానికి అర్హులు అని స‌ద‌రు అజ్ఞాత క‌స్ట‌మ‌ర్ చెప్పిన‌ట్టు స్టంబుల్ ఇన్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్ యజమాని మైక్ జ‌రీల్లా వార్తా సంస్థలకు తెలిపారు. లాక్‌డౌన్‌లో ఈ రెస్టారెంట్‌ను కొన్ని నెల‌లు మూసివేశారు. ఆ సమయంలో ఈ రెస్టారెంట్ ఉద్యోగులు టేక్ అవుట్ ఆర్డ‌ర్లు, అవుట్‌డోర్ క్యాట‌రింగ్‌ సేవలందించారు.
Published by:Krishna Adithya
First published: