MUNICIPAL OFFICER ENTERS MANHOLE TO INSPECT CLEANING WORK IN SAREE IN THANE VIDEO GOES VIRAL GH SK
Viral News: డ్రైనేజీలో దిగిన మహిళా ఆఫీసర్.. అందరూ ఫిదా.. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..
మ్యాన్ హోల్‌లో దిగిన మున్సిపల్ ఇన్‌స్పెక్టర్
నైరుతి రుతుపవనాల రాకతో మూడు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల ధాటికి మహానగర వీధులన్నీ జలమయంగా మారాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని మున్సిపల్ అధికారులు ప్రజలకు సూచించారు
ప్రభుత్వ అధికారులు కొందరు పూర్తి అంకిత భావంతో పని చేస్తారు. తమ విధులను మరింత నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజలకు మంచి చేస్తుంటారు. కిందిస్థాయి సిబ్బంది సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకుంటుంటారు. ఇలాంటి వారికి ప్రజల నుంచి మంచి ప్రశంసలు అందుతుంటాయి. తాజాగా ముంబైలో ఓ మున్సిపల్ అధికారి చేసిన పనికి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బివాండి-నిజామ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్ఎంసీ) శానిటరీ ఇన్స్పెక్టర్ సువిధ చౌహాన్ తన పరిధిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ క్రమంలో చీరకట్టులోనే ఆమె మ్యాన్హోల్లోకి దిగారు. నిచ్చెన సాయంతో కింద వరకు దిగి పనులను పరిశీలించారు. అక్కడ పరిశుభ్రత ఎలా ఉందో చూశారు. ఆ తర్వాత బయటికి వచ్చి సిబ్బందికి సూచనలు చేశారు.
ఇలా పారిశుద్ధ్య పనులను ఆమె అంకితభావంతో పర్యవేక్షిస్తున్నారు. బివాండి పరిధిలో పవర్లూమ్ అనే సంస్థ ఈ పనుల కోసం కాంట్రాక్టు తీసుకుంది. ఆ సంస్థ ఎలా పని చేస్తుందనే విషయాన్ని చౌహన్ తనిఖీలు చేస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం వర్షాకాలం రావడంతో డ్రైనేజీలో నీరు నిలిచిపోకుండా సరిగ్గా శుభ్రం చేయాలంటూ సిబ్బందికి సూచిస్తున్నారు.
చీరకట్టులో సువిధ చౌహాన్ మ్యాన్ హోల్‌లోకి దిగి పనులను తనిఖీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. “ఇలాంటి అధికారులు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకొంత మంది కావాలి. అప్పుడే ప్రజలకు ఇబ్బందులు ఎదురుకావు” అనే ట్యాగ్‌తో ఓ వ్యక్తి వీడియోను పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
“కార్పొరేషన్ నాకు పనిని కేటాయించింది. కాంట్రాక్టర్లు పనులు సరిగ్గా చేస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత నాది. అలాగే మురికిని తొలగించడం చాలా కష్టమైన పని. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా.. పనులు సరిగ్గా జరుగుతున్నాయో లేదో తనిఖీలు చేస్తున్నా. మ్యాన్హోల్లో దిగినప్పుడు నాకు భయం అనిపించలేదు. మా అధికారులు, కుటుంబ సభ్యులు నన్ను ప్రశంసిస్తున్నారు” అని సువిధ చౌహాన్ చెప్పారు.
నైరుతి రుతుపవనాల రాకతో మూడు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల ధాటికి మహానగర వీధులన్నీ జలమయంగా మారాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని మున్సిపల్ అధికారులు ప్రజలకు సూచించారు. భారీ వర్షాల కారణంగా కరోనా సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ఇప్పుడిప్పుడే కరోనా కష్టాల నుంచి కోలుకుంటున్న ముంబై నగరానికి వర్షపు కష్టాలు వచ్చాయి. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరమ శాఖ హెచ్చరించడంతో ముంబై కార్పొరేషన్ మరింత అప్రమత్తమైంది.