రైలు పట్టాలపై పడుకొని చనిపోయినట్లుగా యాక్టింగ్.. సోషల్ మీడియాలో వీడియో.. రంగంలోకి పోలీసులు.. చివరకు ఏమైందంటే..

Iffy Khan

చనిపోయినట్టు నాటకమాడిన సదరు యువకుడు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. తాను చేసింది తప్పేనని.. క్షమించాలని వేడుకుంటున్నాడు.

  • Share this:
కొన్నిసార్లు సరదాగా చేసే పనులే కొంప ముంచుతాయి. తాజాగా ముంబయికి చెందిన ఇఫ్ఫీ ఖాన్ (ఇర్ఫాన్ ఖాన్) అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ కూడా సరదాగా ఓ పనిచేసి కటకటాలపాలయ్యాడు. ప్రేమించిన ప్రియురాలు తిరస్కరిస్తే చనిపోవాలి అన్నట్లుగా అతడు వీడియో చిత్రీకరించాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్ లో 44 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో వారంతా షాక్ అయ్యారు. అలాగే ఆ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. చివరికి ఆ వీడియో బాంద్రా పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో సదరు పోలీసులు ఇర్ఫాన్ ఖాన్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

వీడియో లో ఏముందంటే..
ప్రేమించిన అమ్మాయి తనను పదేపదే తిరస్కరించిందని ఇర్ఫాన్ ఖాన్ వీడియోలో తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశాడు. తరువాత అతడు రైల్వే స్టేషన్‌కి వెళ్లి పట్టాలపై కూర్చున్నాడు. ఒక రైలు తనను ఢీ కొట్టినట్టు.. తాను చనిపోయినట్టు ఎడిట్ చేశాడు. ఇక ఆ వీడియోని తన ఖాతాలో షేర్ చేశాడు. అప్పుడు ఫాలోవర్లు ఆ వీడియో చూసి, ఇర్ఫాన్ నిజంగానే చనిపోయాడని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక ఫాలోవర్ ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీంతో దీనిపై చాలా మంది నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు. ఆ తరువాత నిజం తెలుసుకున్న పోలీసులు సదరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని జైల్లో వేశారు.

ఆత్మహత్య చేసుకోవాలని ప్రజలను ఇర్ఫాన్ ప్రేరేపించాడని చెబుతూ పోలీసులు భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 505 (1) కింద కేసు నమోదు చేశారు. న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు సెక్షన్-145 కింద మరో కేసు నమోదు చేశారు. తనకుతాను లేదా ఇతర ప్రాణాలకు అపాయం తలపెట్టేలా ప్రవర్తించినందుకు.. ఐపీసీ సెక్షన్ 336 కింద ఇంకో కేసు నమోదు చేశారు.

అయితే చనిపోయినట్టు నాటకమాడిన సదరు యువకుడు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. తాను చేసింది తప్పేనని.. క్షమించాలని వేడుకుంటున్నాడు. కేవలం వినోదం కోసమే వీడియో చేశానని కానీ ప్రజలు తప్పుగా తీసుకున్నారని చెబుతున్నాడు. తను ఇంకో వీడియోని కూడా విడుదల చేయాలని భావించినట్లు చెబుతున్నాడు. ఆ వీడియోలో తాను చనిపోయాననేది ఒక కల అని ప్రజలకు చెప్పదలుచుకున్నానని వివరించాడు. చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో రెండవ వీడియోలో చూపించాలనుకున్నట్లు చెప్పాడు. ప్రేమలో ఓడిపోయినంత మాత్రాన ఎవరూ కూడా చనిపోకూడదని చెప్పడానికే తాను వీడియో చేశానని ఇర్ఫాన్ చెబుతున్నాడు. అయితే వివాదం నేపథ్యంలో ఈ 28 ఏళ్ల సోషల్ మీడియా సెలబ్రిటీ తన ఫేక్ సూసైడ్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాడు.
Published by:Shiva Kumar Addula
First published: