అంబానీ అదుర్స్.. రిలయన్స్ రయ్ రయ్..

Reliance Industries : జియోతో సంచలనాలకు తెర తీసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది. దాంతో ఎలైట్ క్లబ్‌లో చేరినట్లైంది.

news18-telugu
Updated: November 21, 2019, 11:27 AM IST
అంబానీ అదుర్స్.. రిలయన్స్ రయ్ రయ్..
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ (File Photo)
  • Share this:
జియోతో సంచలనాలకు తెర తీసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది. దాంతో ఎలైట్ క్లబ్‌లో చేరినట్లైంది. అటు ఆ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఇటు రిలయన్స్ సంస్థలు నంబర్ వన్ దిశగా ముందడుగు వేస్తోంది. ప్రపంచంలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో బ్రిటీష్ మల్టీ నేషనల్ ఆయిల్ కంపెనీ ‘బీపీ’ని వెనక్కి నెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరవ స్థానంలో నిలిచింది. గత రెండు రోజుల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) స్టాక్స్ 6 శాతం పెరిగాయి. షేర్ విలువ తొలి సారి రూ.1500 మార్కు దాటింది. ప్రస్తుతం రూ.1534 వద్ద కొనసాగుతోంది. ఇక.. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లకు చేరింది. తర్వలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు నెలకొల్పనుంది. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ డిసెంబరు 1 నుంచి టారిఫ్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించిన తర్వాత రిలయన్స్ మార్కెట్ విలువ మరింత పెరగడం గమనార్హం. దానివల్ల జియో మరింత మంది యూజర్లను ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీపీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 131.53 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 133.21 బిలియన్ డాలర్లకు చేరింది. జియో, రిలయన్స్ రిటైల్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాది కాలంలో 31 శాతం వృద్ధిని సాధించింది.

మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ ఆయిల్ కంపెనీ తొలి స్థానంలో ఉంది. తర్వాత రాయల్ డచ్ షెల్, చెవ్రాన్ కార్ప్, టోటల్, పెట్రో చైనా ఉన్నాయి. బీపీని వెనక్కి నెట్టి ఆరవ స్థానంలో రిలయన్స్ నిలిచింది. బీపీ 7వ స్థానంలో, పెట్రోబ్రాస్ 8వ స్థానంలో, గ్యాజ్‌ప్రోమ్ 9వ స్థానంలో, చైనా పెట్రోలియం 10వ స్థానంలో ఉన్నాయి.

ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేశ్ అంబానీ కొనసాగుతున్నారు. షేర్ల విలువ ఒక్కసారిగా పెరగడంతో ఆయన నికర ఆదాయం 58 బిలియన్ డాలర్లకు చేరింది. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా అంబానీ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. ఆయన నికర ఆదాయం 42.8 బిలియన్ డాలర్ల వద్ద ఉంది.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు