ఎక్కువమంది పిల్లలను కనేవారికి లక్షరూపాయల బహుమతి ప్రకటించారు మిజోరం క్రీడలు, యువజన వ్యవహారాలశాఖా మంత్రి రాబర్ట్ రొమావియా రైతే. ఈనెల 17న ఫాదర్స్ డే రోజున ఈ కీలకమైన ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో ఎవరికైతే ఎక్కువమంది పిల్లలుంటారో వారికి లక్షరూపాయల నగదు, జ్ఞాపికను అందిస్తానని రైతే తెలిపారు. నలభైమంది సభ్యులున్న మిజోరం అసెంబ్లీకి రైతే ఐజ్వాల్ తూర్పు నియోజకవర్గం రెండు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మన దేశంలో కుటుంబనియంత్రణ స్వచ్ఛందంగా అమలవుతున్నప్పటికీ, కొండప్రాంతాలైన మిజోరంలో జనాభా సమతుల్యత లోపిస్తోంది. జనాభా పరంగా చిన్నవిగా ఉండే మిజో తెగలలో జనాభాసంఖ్యను పెంచడానికి ఈ బహుమతిని ప్రకటించినట్టు రైతే చెప్పారు. అయితే కనిష్టంగా ఎంతమంది పిల్లలుండాలి గరిష్ఠంగా ఎంతమంది ఉండాలనే సంఖ్యను మాత్రం ఆయన ప్రకటించలేదు.మిజోరంలో చదరపు కిలోమీటరుకు కేవలం 52మంది జనాభా మాత్రమే ఉండగా, జాతీయ సగటు 382మందిగా ఉంది. ఇక రైతే ప్రకటించిన బహుమతి మొత్తాన్ని ఎన్ఇసిఎస్ (నార్త్ ఈస్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్) అందించనుంది. ఈ సంస్థ ఐజ్వాల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ యజమాని కూడా రైతేనే కావడం విశేషం. ఈయన మిజోరంలో క్రీడా నిర్వహణలో అగ్రస్థానంలో ఉంటారు. క్రీడలంటే అమితంగా ఇష్టపడే రైతే ఎడతెగని ప్రయత్నాలు చేసి, చివరకు క్రీడారంగానికి మిజోరంలో పరిశ్రమ హోదా లభించేలా చేశారు. తద్వారా పెట్టుబడిదారులను ఈ రంగం ఆకర్షిస్తుందని ఆయన భావన.
యువతకు ఉద్యోగాలు లభించడానికి వీలుగా క్రీడారంగానికి పరిశ్రమ హోదా ఇచ్చిన తొలి రాష్ట్రంగా మిజోరం నిలుస్తోంది. 54 ఏళ్ల రైతేకి ముగ్గరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు. మిజోరంలో జనాభా సంఖ్య తగ్గిపోవడం తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. తగినంత జనాభా లేకపోవడం వల‌్ల అనేక రంగాలలో తగినంత అభివృద్ధి సాధించడంలో మిజోరం వెనుకబడి ఉంది. చిన్న చిన్న తెగలకు, గిరిజనులకు అభివృద్ధి సాధించడానికి ఇదొక అవరోధంగా మారిందని తెలిపారు రైతే.
జనాభా పెరుగుదల కోసం రైతే బహుమతులు ప్రకటిస్తున్న సమయంలోనే మిజోరం పొరుగునే ఉండే అసోం సహా దేశంలోని అనేక రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థిస్తుంచడం విశేషం. భారతదేశంలోని విభిన్నత జనాభావిధానంలోనూ ఉండాలనే విషయం జనసాంద్రత లో కనిపిస్తున్న తేడాలు స్పష్టం చేస్తున్నాయని రైతే చెప్పారు. మిజోరంలోని కొన్ని చర్చ్‌లు, యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ) సహా అనేక పౌరసంఘాలు బేబీ బూమ్ పాలసీని ప్రోత్సహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని రైతే తెలిపారు.
భారతదేశంలోని తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో మిజోరం రెండో స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరంలో 11లక్షలమంది జనాభా మాత్రమే ఉన్నారు. క్రిస్టియన్లు, గిరిజనులు ఎక్కువ ఉండే ఈ రాష్ట్రం.. మయన్మార్, బంగ్లాదేశ్ లతో సరిహద్దులుగా కలిగి ఉంది. మొత్తం 21 వేల 87 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mizoram, Population, VIRAL NEWS