Viral News: కొండలెక్కితే కానీ పరీక్షలు రాయలేరు.. ఈ విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా స్కూళ్లు, కాలేజీ మూతపడ్డాయి. పరీక్షలు, క్లాసులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. విద్యార్థులంతా ఇళ్లలో కూర్చునే పాఠాలు వింటున్నారు. కానీ మిజోరాంలోని ఈ గ్రామ విద్యార్థులు మాత్రం ఆన్‌లైన్ క్లాసులు, పరీక్షల కోసం కొండలెక్కుతున్నారు.

  • Share this:
అదో మారుమూల గ్రామం. చుట్టూ అడవులు, కొండలు తప్ప జన సంచారం పెద్దగా ఉండదు. అక్కడ ఉండే కొంత మంది విద్యార్థులు రోజూ కొండపైకి ఎక్కి.. కొంత సమయం అక్కడే గడుపుతారు. ఆ తరువాత కొండలు దిగి ఇళ్లకు చేరుకుంటారు. ఇంతకీ వారు ఎందుకు రోజూ కొండపైకి ఎక్కుతున్నారో తెలుసా? కేవలం ఇంటర్నెట్ కోసం అంటే మీరు ఆశ్చర్యపోక మానరు. ఇంటర్నెట్ సిగ్నల్ తక్కువగా ఉండటంతో రోజూ కొండెక్కి ఆన్ లైన్ క్లాసులు, పరీక్షలకు హాజరవుతున్నారు మిజోరాంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు. వివరాల్లోకి వెళ్తే.. మిజోరాంలోని సైహా జిల్లాలో ఉన్న మావ్రేయి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ పూర్తిగా లేదు. ఈ ప్రదేశం ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన కొంత మంది విద్యార్థులు మిజోరం వర్సిటీలో చదువుతున్నారు. ఈ నెలలో వారు పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా పరీక్షలను సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడి గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ఇంటర్నెట్ కోసం ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి దగ్గరలో ఉన్న త్లావ్ త్లా అనే పెద్ద కొండపైకి ఎక్కాల్సి వస్తుంది. నెట్‌వర్క్‌ సిగ్నల్ బాగా వచ్చే ఏకైక ప్రాంతం ఈ కొండ కావడంతో.. పరీక్షల కోసం విద్యార్థులు రోజూ ట్రెక్కింగ్ చేస్తున్నారు.

అంతేకాకుండా వర్షం, ఎండ లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ పొందడం కోసం అరటి ఆకులతో తాత్కాలికంగా వెదురు గుడిసెలను సైతం వారు నిర్మించుకున్నారు. కొండపైకి వెళ్లి ఆ పాకల్లో కూర్చొని పరీక్ష పూర్తి చేసి కిందకు వస్తున్నారు.

"మా గ్రామం సైహా జిల్లాలోనే అత్యంత మారుమూల ప్రాంతం. పూర్తిగా కొండలతో చుట్టుముట్టి ఉంటుంది. ఇక్కడ సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు" అని కేఎల్ వబీహ్రూసా అనే స్థానిక విద్యార్థి తెలిపాడు. "కొండపైకి ఎక్కి విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ గ్రామంలో 4జీ నెట్‌వర్క్ లేదు.. కానీ కొండపై మాత్రం సిగ్నల్ స్థిరంగా ఉండటంతో అక్కడికి వెళ్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని మారా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కు చెందిన బీరాసాచాయ్ స్పష్టం చేశారు.

మిజోరాం రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ నెలలో విశ్వవిద్యాలయం నిర్వహించే సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే మావ్రేయి గ్రామ ప్రజలు మాత్రం కొండపైకి ఎక్కి ఆన్ లైన్ పరీక్షలను పూర్తి చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం దేశం డిజిటల్ ఇండియా దిశగా దూసుకెళ్తుంది. మనమంతా 5జీ నెట్‌వర్క్‌ కోసం ఎదురుచూస్తున్నాం. కానీ 1700 జనాభా మాత్రమే ఉండే ఈ గ్రామంలో 5జీ కాదు కదా.. కనీసం 2జీ ఇంటర్నెట్ కూడా సరిగ్గా రాదు. ఒకవేళ వచ్చినా స్థిరంగా ఉండదు. ఫలితంగా స్థానిక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కొండలను ఎక్కి పరీక్షలు రాయడం కష్టంగా ఉందని చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: