ట్రెండింగ్‌లో కనిపించని ‘సైరా’ టీజర్... మెగా ఫ్యాన్స్ గుస్సా!

టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే అంటున్న మెగా ఫ్యాన్స్... ‘లేని హైప్ క్రియేట్ చేసినందుకే...’ అంటున్న యాంటీ ఫ్యాన్స్... తెరపైకి మరోసారి కులాల రచ్చ!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 22, 2018, 10:27 AM IST
ట్రెండింగ్‌లో కనిపించని ‘సైరా’ టీజర్... మెగా ఫ్యాన్స్ గుస్సా!
‘సైరా నరసింహారెడ్డి’ మూవీ పోస్టర్
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా’ టీజర్ నిన్న విడుదల చేసింది చిత్ర బృందం. చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ సినిమా టీజర్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక రోజులో 7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అయితే మిలియన్ల వ్యూస్ సాధించిన ‘సైరా’ టీజర్, యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్‌లో కనిపించకపోవడం విశేషం.

సాధారణంగా యూట్యూబ్‌లో ఏ వీడియోనైతే జనాలు ఎక్కువగా చూస్తున్నారో, అది ట్రెండింగ్‌లో కనిపిస్తుంటుంది. స్టార్ హీరోల సినిమాల టీజర్ గానీ, ట్రైలర్ గానీ విడుదలైతే కొన్ని గంటల్లోనే ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతుంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన మహేష్ బాబు ‘మహర్షి’, ఎన్.టీ.ఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రాలు ట్రెండింగ్‌లో మూడు రోజులకు పైగా టాప్‌లో నిలిచి, మంచి వ్యూస్ రాబట్టాయి. అయితే మిలియన్ల వ్యూస్ సాధిస్తూ, ఈ సినిమా టీజర్లు సాధించిన రికార్డులను కూడా అధిగమించిన మెగాస్టార్ సినిమా మాత్రం యూట్యూబ్ ట్రెండింగ్‌లో లేదు. దానికి బదులుగా వైవా హర్ష నటించిన ‘ది ప్రిన్స్‌పాల్’ కామెడీ షార్ట్ ఫిలిం టాప్‌లో కొనసాగుతోంది. ట్విట్టర్‌లో కూడా ‘సైరా’ ట్రెండింగ్‌లో కనిపించడం లేదు. ఇదే మెగా ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. టీజర్ విడుదలకు మూడు రోజుల ముందే హడావిడి, ప్రచారం మొదలెట్టింది చిత్ర యూనిట్. నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ అనిల్ రావిపూడి వంటి సినీ ప్రముఖులతో పాటు మెగాస్టార్ అభిమానులంతా ‘సైరా’ టీజర్‌ను షేర్ చేశారు.

మీడియా సమావేశం ఏర్పాటు చేసి అట్టహాసంగా టీజర్‌ను లాంచ్ చేశారు. దీంతో టీజర్‌కి మంచి వ్యూస్ వచ్చాయి. అయితే ఇక్కడే యాంటీ ఫ్యాన్స్ ఓ ప్రశ్న లేవనెత్తుతున్నారు. టీజర్ విడుదలయిన మొదటి 45 నిమిషాల్లో కేవలం 87 వేల వ్యూస్ మాత్రమే కనిపించాయి. కానీ గంట దాటగానే 11 లక్షల వ్యూస్ అంటూ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. దాంతో 15 నిమిషాల్లో 10 లక్షల వ్యూస్ ఎలా వచ్చాయంటూ? సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం యాంటీ ఫ్యాన్స్ కారణంగానే ‘సైరా’ టీజర్ ట్రెండింగ్‌లో లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం దాకా నందమూరి ఫ్యాన్స్‌కీ, మెగా ఫ్యాన్స్‌కీ మధ్య విరోధం బాగా ఎక్కువగా ఉండేది. కానీ చెర్రీ, తారక్ మిత్రులుగా కలిసిపోవడం, మల్టీస్టారర్ సినిమాకి రెఢీ అవుతుండడంతో వీరి ఫ్యాన్స్ మధ్య గొడవలు కాస్త తగ్గాయి. కానీ ‘బాహుబలి’ సినిమాతో యూనివర్సల్ ఇండస్ట్రీ హిట్టు కొట్టి, మిగిలిన హీరోలకు ఛాలెంజ్ విసిరాడు ప్రభాస్. దాంతో యంగ్ రెబల్ స్టార్‌పై పీకల్లోతు కోపంలో ఉన్నారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. ‘బాహుబలి’ సినిమా రికార్డులే లక్ష్యంగా ‘సైరా’ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా గుస్సా అవుతున్నారు. కొస్తాంధ్రలో అభిమానుల మధ్య ప్రస్తుతం ఈ విషయంపైనే తీవ్రస్థాయిలో డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. ఈ చర్చల్లో కులాల కంపు కూడా కొడుతుండడం కొసమెరుపు. దీంతో ‘సైరా’ టీజర్ ట్రెండింగ్‌లో లేకపోవడంతో టాలీవుడ్‌లో మరోసారి ఫ్యాన్స్ వార్ బయటికి వచ్చినట్టయ్యింది.
Published by: Ramu Chinthakindhi
First published: August 22, 2018, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading