సాధారణంగా ఓ వ్యక్తి నాలుక 8 నుంచి 9 సెంటీమీటర్ల పొడవుంటుంది. కానీ తమిళనాడుకు చెందిన ఒక యువకుడి నాలుక ఏకంగా 10.8 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఈ ప్రత్యేకతతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు విరుత్తునగర్ జిల్లా తిరుత్తుంగాళ్‌కు చెందిన ప్రవీణ్. నాలుకతో బొమ్మలు గీయడం, తమిళ అక్షరాలు రాయడంలో అతడు శిక్షణ తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రత్యేకతలతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. నాలుకతో అందమైన పెయింటింగ్స్ వేయడంతో పాటు అక్షరాలు రాయడం ప్రవీణ్‌కు ఉన్న మరో ప్రతిభ. నాలుక సగభాగాన్ని ఓ చిన్న గ్లోవ్‌తో కప్పి అక్షరాలు రాయగలడు. దీంతోపాటు నాలుకతోనే దివంగత భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇతర నాయకుల రూపాన్ని చిత్రీకరించాడు. ఇవే కాకుండా నాలుకతో ముక్కును, మోచేతులను తాకడం లాంటి అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడు.
గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఆసియాగా రికార్డు..
మగవారికి సగటున 8.5 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఆడవారిలో అయితే 7.9 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ప్రవీణ్ నాలుక 10.8 సెంటీమీటర్లు ఉంది. అతడు నిమిషానికి 110 సార్లు నాలుకతో ముక్కును, నిమిషానికి 142 సార్లు మోచేతిని తాకాడు. దీంతోపాటు ఒక గంట 22 నిమిషాల్లో 247 తమిళ అక్షరాలు రాశాడు. మరోసారి నిమిషానికి 219 సార్లు నాలుకతో ముక్కును తాకి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఫలితంగా గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఆసియా రికార్డు కూడా దక్కించుకున్నాడు.
ఆర్థిక సాయం అవసరం..
"నా విజయాలు భారత్ లో నమోదైనప్పటికీ నా ప్రతిభను విశ్వవ్యాప్తంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఆర్థిక సాయం లేకపోవడంతో నా రికార్డులను ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించలేకపోతున్నాను. తమిళనాడు ప్రభుత్వం సహాయం అందిస్తే అనుకున్నది సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో 1330 తిరుక్కురల్ (తమిళ అక్షరాలు) రాయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను" అని ప్రవీణ్ మీడియాకు వివరించాడు. ప్రస్తుతం నాలుకతో కనురెప్పలను తాకడానికి చాలా కష్టపడుతున్నానని, కచ్చితంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకొని తమిళనాడుకు గర్వకారణమవుతానని ప్రవీణ్ చెబుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tamil nadu, VIRAL NEWS