Home /News /trending /

MEET HINDU DOCTOR REKHA KRISHNAN WHO RECITES ISLAMIC PRAYER FOR MUSLIM WOMAN DYING OF CORONA VIRUS GH SRD

Viral News : ముస్లిం పేషెంట్​ చెవిలో ఇస్లామిక్​ ప్రార్థన..ఈ హిందూ డాక్టర్​కు నెటిజన్లు సలాం..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral News : దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆక్సిజన్, బెడ్లు దొరక్క చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, లేటెస్ట్ గా ఓ మహిళా వైద్యురాలు మానవత్వంతో చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న కరోనా మహమ్మారి.. కొన్ని చోట్ల మాత్రం మానవత్వాన్ని తట్టి లేపుతుంది. కులాలు, మతాలు, ప్రాంతాలు ఇలా మనుషులు పెట్టుకున్న అన్ని అడ్డుగోడలను తొలగిస్తుంది. తాజాగా ఓ మహిళా వైద్యురాలు మానవత్వంతో చేసిన పని ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన డాక్టర్ రేఖ కృష్ణన్ అనే వైద్యురాలు హిందూ మతానికి చెందినప్పటికీ, కోవిడ్ కారణంగా మరణపు అంచుల్లో ఉన్న ముస్లిం పేషెంట్​ చెవిలో ఇస్లామిక్​ ప్రార్థనలు వినిపించారు. పాలక్కాడ్ పట్టాంబిలోని సెవానా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్​లో మే 17 న చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.బీవతు అనే 56 ఏళ్ల ముస్లిం మహిళకు కరోనా సోకడంలో కొద్ది రోజుల క్రితం ఆమెను సెవానా హాస్పిటల్​లో చేర్చారు. అయితే, ఆమె పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్​ నిబంధనల ప్రకారం ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించలేదు ఆసుపత్రి యాజమాన్యం. ఈ క్రమంలో రోగి ఆరోగ్యం మరింత క్షీణించడం మొదలైంది. ఫలితంగా ఆమె అవయవాలు స్పందించడం మానేశాయి. ఇక, ఆశలు వదులుకున్న డాక్టర్లు ఆమెను వెంటిలేటర్​పై నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఆమె మరణపు అంచుల్లో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. ఆ సమయంలో, అక్కడ డాక్టర్​ రేఖా కృష్ణన్ మాత్రమే విధుల్లో ఉన్నారు.

రోగి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో చివరి ఘడియల్లో ఆమెకు కొంతైన ఓదార్పునిచ్చేందుకు ఇస్లామిక్ ప్రార్థన- షాహదత్ కలీమా- పఠించాలని నిర్ణయించుకున్నారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం, మరణించే వ్యక్తి చెవి వద్ద కలీమా ప్రార్థన పఠిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ప్రగాఢ విశ్వాసం. అందువల్ల, రేఖా కృష్ణన్​ సదరు ముస్లిం పేషెంట్​ చెవిలో కలీమా ప్రార్థన వినిపించింది.

మత సామరస్యానికి ప్రతీక..
డాక్టర్​ రేఖా కృష్ణన్​ సదరు పేషెంట్​ చెవుల్లో కాలీమా వినిపించగానే, ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకొని కాసేపటికి కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి రేఖ మాట్లాడుతూ ‘‘రోగి చివరి ఘడియల్లో పక్కన కుటుంబ సభ్యులు ఎవరూ లేనందున, ఆమె కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. నేను యూఏఈలో పెరిగినందున నాకు ముస్లిం ప్రార్థనలు, పద్ధతులు అన్నింటిపై అవగాహన ఉంది. దీంతో, ఆమె చివరి క్షణాల్లో ఓదార్పునిచ్చేందుకు ఇస్లాం ప్రార్థనను ఆమె చెవి వద్ద చదివి వినిపించాను. నేను హిందూ మతానికి చెందిన మహిళ అయినప్పటికీ, మానవత్వంతో ఆలోచించాను. ఆమె కుటుంబ సభ్యులు ఉంటే ఏదైతే చేసేవారో.. అదే పని నేను చేశాను.” అని తెలిపింది. డాక్టర్​ రేఖ చేసిన పని అందరూ ప్రశంసిస్తున్నారు. మత సామరస్యానికి రేఖ ప్రతీకగా నిలించిందని నెటిజన్లు కొనియాడుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Corona, Doctors, Trending, VIRAL NEWS

తదుపరి వార్తలు