Sea Plane: సాధారణంగా పెద్ద పెద్ద చదువులు చదివిన తరువాత.. కొత్త వస్తువులు కనిపెట్టాలని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ కొత్త వస్తువులు కనిపెట్టేందుకు పెద్ద చదువులే అవసరం లేదు.. తెలివితేటలు ఉంటే సరిపోతాయని చాలామంది నిరూపించారు.
సాధారణంగా పెద్ద పెద్ద చదువులు చదివిన తరువాత.. కొత్త వస్తువులు కనిపెట్టాలని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ కొత్త వస్తువులు కనిపెట్టేందుకు పెద్ద చదువులే అవసరం లేదు.. తెలివితేటలు ఉంటే సరిపోతాయని చాలామంది నిరూపించారు. పల్లెటూళ్లకు చెందిన చాలామంది వ్యక్తులు ఇప్పటికే తమ ప్రతిభతో బుల్లి వాహనాల నుంచి వ్యవసాయంలో ఉపయోగించే వస్తువులు, పెట్రోల్ లేకుండా నడిచే గ్రీన్ వాహనాలు లాంటివి ఎన్నో తయారుచేశారు. అయితే వీటన్నింటి కంటే ప్రత్యేకంగా ఏకంగా ఓ సీ ప్లేన్ నే తయారుచేశాడు అస్సాంకి చెందిన ఓ వ్యక్తి. సంకల్పం తోడుంటే ఎంత కష్టమైన పనైనా సులువుగా మారిపోతుందని నిరూపించాడు రాష్ట్రంలోని జోర్హత్ జిల్లాకి చెందిన బాబుల్ సాయ్ కియా.అస్సాంలో మేస్త్రీ పని చేసే బాబుల్ తన మోటర్ బైక్ ఇంజిన్‌తో.. నీటిపై నుంచే టేకాఫ్, ల్యాండింగ్ అవ్వగలిగే ‘సీ ప్లేన్’ని తయారుచేశాడు. అంతేకాదు.. దాన్ని నడిపి చూపించాడు. తనకు చిన్నతనం నుంచి గాల్లో ఎగరాలని ఎంతో ఇష్టమని.. అదే తనని ఈ సీప్లేన్ తయారుచేసేలా ప్రోత్సహించిందని చెప్పుకొచ్చాడు బాబుల్. అయితే ఇది అంత సులువుగా జరిగిపోలేదని, చాలా సమస్యలే ఎదుర్కొన్నానని తెలిపాడు. ఎన్ని సమస్యలు ఎదురైనా తన ప్రయత్నాన్ని మాత్రం బాబుల్ ఆపలేదు. మొదట్లో తనకు ఎలాంటి ట్రైనింగ్, ఇతరుల సహకారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడట. అయితే ప్లేన్ తయారుచేయాలనే తన సంకల్పం ముందు ఇవి చాలా చిన్నవిగా మారిపోయాయి.
తాను రెగ్యులర్ గా చేసే మేస్త్రీ పనిని కొనసాగిస్తూ, డబ్బు సంపాదిస్తూనే తీరిక వేళల్లో ఈ పని చేయడానికి ప్రయత్నించేవాడు బాబుల్. తన సంపాదన చాలా తక్కువే అయినా ఈ ప్లేన్ తయారీకి అందులోంచి రెండు లక్షల రూపాయలను కేటాయించాడు. అలా రెండు లక్షల ఖర్చు, రెండు సంవత్సరాల శ్రమతో ఈ సీ ప్లేన్ సిద్ధమైంది. దీనికోసం బజాజ్ పల్సర్ 200 సీసీ బైక్ ఇంజిన్‌ను ఉపయోగించాడు బాబుల్. ప్లేన్ కి సంబంధించిన ప్రతి భాగాన్ని అతడే సొంతంగా తయారుచేయడం విశేషం.
ఈ ప్లేన్ కేవలం చూసేందుకే కాదు.. నడిపేందుకు కూడా అద్భుతంగా పనిచేస్తోందట. ఈ సీ ప్లేన్ పై ట్రయల్ వేసిన బాబుల్ తన ట్రయల్ లో ఎలాంటి నెగెటివ్స్ కనిపించలేదని.. మరి కొంత కాలం పాటు దీని కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ట్రయల్ సమయంలో నీటి మీద నుంచి ప్లేన్ పైకి దూసుకువెళ్తున్నప్పుడు తనకు ఎంతో ఆనందం అనిపించిందని.. తన రెండేళ్ల శ్రమ దీని ముందు తక్కువగానే అనిపించిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్లేన్ కి తుది మెరుగులు దిద్ది సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాడు బాబుల్. ఆ తర్వాత గాల్లో ఎగురుతూ తన కలను తీర్చుకోవాలనుకుంటున్నాడు.