• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • MARRIAGE BARAAT PROCESSIONS ON CAMELS TO MAINTAIN COVID CURBS IN RAJASTHAN SK GH

Baraat on Camels: ఒంటెలపై బారాత్‌ వేడుకలు.. ఎక్కడ, ఎందుకో తెలుసా?

ఒంటెలపై బారాత్

Baraat on camels: పెళ్లి కొడుకు, అతని బంధువులు ఒంటెల మీద గంటపాటు ప్రయాణించి చేరుకున్నారు. మొత్తం 15 ఒంటెల మీద 31 మంది ఆ బారాత్‌లో పాల్గొన్నారు.

  • Share this:
పెళ్లికి స్నేహితులు, బంధువులతో బారాత్‌ ఘనంగా జరుగుతుంది. మన దగ్గర తక్కువ కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో బారాత్‌కు ఉన్న ప్రాధాన్యమే వేరు. అయితే రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన బారాత్‌ను చాలా కొత్తగా చేసుకున్నాడు. ఇదేదో సరదాకో, ముచ్చట తీర్చుకోవడానికో కాదు. కరోనా తీసుకొచ్చిన ఆంక్షల మూలంగా ఒంటెలపై ఊరేగింపు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌ అంటే ఎడారికి ప్రసిద్ధి. ఆ ఎడారి ఓడ అయిన ఒంటెల మీదే బారాత్‌ జరిగింది. ఇప్పుడిది కొత్త కావొచ్చు కానీ ఓ 40-50 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో బారాత్‌లు అలానే జరిగేవట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... రాష్ట్రంలోని పోఖ్రాన్‌లో బండేవా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి.. బర్మేర్‌ సమీపంలో కుసుంబ ప్రాంతానికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితుల కారణంగా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం బస్సుల్లో 50 శాతం మందే ప్రయాణించాలి. పెళ్లికి 31 మంది మించి హాజరు కాకూడదు. దీంతోపాటు సోషల్‌ డిస్టెన్స్‌ ఎలాగూ పాటించాలి.

ఈ నేపథ్యంలో పెళ్లి కుమార్తె ఇంటికి తన బంధువులతో ఎలా వెళ్లాలబ్బా అని అనుకున్నాడట. అదే సమయంలో తమ పురాతన సంప్రదాయం గుర్తొచ్చింది. అదే ఒంటెల మీద ప్రయాణం. వెంటనే ఒంటెల్ని తెప్పించి వాటి మీద బారాత్‌గా బంధువుల్ని పెళ్లి కూతురు ఊరికి తీసుకెళ్లాడట. పెళ్లి కొడుకు, అతని బంధువులు ఒంటెల మీద గంటపాటు ప్రయాణించి చేరుకున్నారు.. ఇదంతా గత నెల 30న జరిగింది. ఈ ప్రయాణాన్ని తమ కుటుంబ సభ్యులు చాలా ఎంజాయ్‌ చేశారని పెళ్లి కొడుకు బంధువు ఆనంద్‌ సింగ్‌ అంటున్నాడు. మొత్తం 15 ఒంటెల మీద 31 మంది ఆ బారాత్‌లో పాల్గొన్నారట. ఈ సమయంలోనూ తాము కొవిడ్‌ ప్రోటోకాల్‌ పక్కాగా పాటించామని చెబుతున్నారాయన.

ఎప్పుడో 70ల నాటి కాలంలో ఇలా బారాత్‌ జరిగేది అంటూ తమ బంధువులు ఆనందంగా మాట్లాడుకున్నారని ఆనంద్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ బారాత్‌ కోసం వినియోగించిన ఒంటెలను ముక్కు పుడకలు, అద్దాలు పొదిగిన దుస్తులతో అందంగా అలంకరించి నాటి రోజుల్ని గుర్తు చేశామని చెప్పాడు. తాము చేసిన పని వల్ల ఆ ప్రాంతానికి చెందిన చాలామంది గతంలో ఆ ప్రాంతంలో ఉన్నఈ ఆచారం గురించి తెలుసుకోగలిగారట. అలాగే మనమూ ఇలా ట్రై చేయొచ్చు అనుకుంటున్నారని ఆనంద్‌ సింగ్‌ చెప్పారు. మరోవైపు రాజస్థాన్‌లో ఒంటెల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. 2012లో ఆ రాష్ట్రంలో 3,25,713 ఒంటెలు ఉంటే.. ఇటీవల నిర్వహించిన ఒంటెల సెన్సస్‌లో 2,12,739 మాత్రమే ఉన్నాయని తేలింది. ఒంటెల పెంపకం స్థానికులకు ఆసక్తి తగ్గడం, రవాణా అంటేకార్లు, జీపులు లాంటివి గుర్తుకురావడమే దీనికి కారణమని లోఖిత్‌ పశు పాలక్‌ సంస్థాన్‌ డైరెక్టర్‌ హన్వంత్‌ సింగ్‌ రాథోడ్‌ చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published: