కొంత కాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నా.. మరోపక్క ఆందోళన వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు. ఈ టెక్నాలజీ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయన్న వాదనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పాపులర్ వ్యక్తుల ఫోటోలను భిన్నంగా రూపొందించి వైరల్ చేస్తున్నారు. తాజాగా మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో నెటింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆయన చాలా వెరైటీగా, ఎప్పుడు ధరించని దుస్తుల్లో కనిపిస్తున్నారు.
ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై స్టైల్‌గా
జుకర్‌బర్గ్ ఈ ఫోటోల్లో లూయిస్ విట్టన్ దుస్తులను ధరించి ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్నట్లు ఉంది. సాధారణంగా జుకర్‌బర్గ్ ప్లెయిన్ మోనోక్రోమటిక్ దుస్తులను ధరిస్తుంటాడు. అయితే ఈ తాజా ఫోటోలను చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బిజినెస్ మీటింగ్‌లతో బిజీబిజీగా గడిపే ఆయన ఫ్యాషన్ షోలో పాల్గొనడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో భారీగా ఉద్యోగులను తొలగిస్తుండడంతో కొత్త కెరీర్‌గా ఫ్యాషన్‌ను ఎంచుకున్నాడని అని మీరు అనుకుంటే, తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అవి నిజమైన ఫోటోలు కావు. మిడ్‌జర్నీఇమేజ్ జనరేటర్ యూజ్ చేస్తూ ఏఐ ఆధారంగా ఈ ఫోటోలను రూపొందించారు. ఆండ్రూ కీన్ గావో అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫోటోలను షేర్ చేశారు. మిడ్‌జర్నీ ఏఐతో చేసిన ఈ ఫోటోలు, రియల్ ఇమేజ్‌ను పోలి ఉండే ప్రతిబింబాలు, నీడలు వంటి ఆకట్టుకునే వివరాలతో నమ్మశక్యంగా ఉన్నాయి. అయితే ఫోటోలను జూమ్ చేసి, నిశితంగా గమనిస్తే అవి రియల్ కాదని ఎవరైనా గుర్తించవచ్చు.
లూయిస్ విట్టన్ డ్రస్‌లో
ఈ వైరల్ ఫోటోల్లో మార్క్ జుకర్‌బర్గ్ ఎల్లో కలర్ లూయిస్ విట్టన్ డ్రస్ లో మెరిసిపోతున్నాడు. ఫ్యాషన్ ర్యాంప్‌పై స్టైల్‌గా నడుస్తున్నాడు. మరో ఫోటోలో పింక్ అవుట్‌ఫిట్‌లో కనిపించాడు. ఇంకో ఫోటోలో కళ్లకు బ్లాక్ కూలింగ్ గ్లాస్ ధరించి, ఎల్లో టీ షర్ట్, బ్లాక్ పాయింట్‌తో ఉన్నాడు. వీపుకు బ్యాగ్‌ను తగిలించుకుని నడుస్తున్నాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. జుకర్‌బర్గ్ ఫ్యాషన్ డిజైన్‌లో చేరాడా అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మరో నెటిజన్.. జుకర్‌బర్గ్ ఇలా చేయడం ఏంటీ నమ్మలేకపోతున్నాను అని ట్వీట్ చేశాడు.
* గతవారం పోప్ ఫోటోలు వైరల్
పాపులర్ వ్యక్తులకు సంబంధించి AIతో రూపొందించిన ఫోటోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గత వారం కూడా ఇంకో పాపులర్ పర్సన్ ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. పోప్ తెల్లటి పఫర్ జాకెట్ ధరించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు చాలా ఫన్నీగా ఉన్నాయని కామెంట్స్ చేశారు.
* ఏఐ పరిశోధనలు నిలిపివేయాలి?
ఏఐ టెక్నాలజీతో మానవాళికి ముప్పు ఉంటుందని, వెంటనే ఏఐ అభివృద్ధిపై చేస్తున్న పరిశోధనలు నిలిపివేయాలని స్టువర్ట్ రస్సెల్, స్టీవ్ వోజ్నియాక్, ఎలన్ మస్క్ వంటి ప్రముఖ వ్యక్తులు కోరుతున్నారు. ఈ మేరకు వారు ఇటీవల బహిరంగ లేఖ విడుదల చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mark Zuckerberg