దేశీయంగా అభివృద్ధి చేసిన మరో కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. డీఎన్ఏ వ్యాక్సిన్ అత్యవసర అనుమతుల ప్రక్రియకు ఏర్పాటు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ.. డీఎన్ఏ ఆధారిత కోవిడ్ -19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన తొలి దేశంగా భారత్ నిలవనుందని తెలిపారు. మొట్టమొదటి డీఎన్ఏ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు మన వారే కావడం గర్వించదగిన విషయమని వ్యాఖ్యానించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా ఇప్పటికే అత్యవసర టీకా వినియోగ అనుమతి కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది.
'సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' నెలకు 11 నుంచి 12 కోట్ల కొవిషీల్డ్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 'బయోలాజికల్ ఈ' సంస్థ ప్రస్తుతం మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తోందని చెప్పారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఈ సంస్థ టీకా ఏడున్నర కోట్ల డోసులతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇతర ఫార్మా కంపెనీలు కూడా స్థిరంగా టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయని వివరించారు.
కరోనా మరణాలు తక్కువగా నమోదు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై కూడా మాండవీయ స్పందించారు. కరోనా మరణాలు రికార్డు చేసే విషయంలో కేంద్రం ఎలాంటి పాత్ర పోషించదని స్పష్టం చేశారు. రాష్ట్రాలు కరోనా కేసులు, మరణాలు నమోదు చేస్తాయని చెప్పుకొచ్చిన ఆయన.. కరోనా మరణాలను దాచి పెట్టడానికి ఏం కారణం ఉంటుందని ప్రశ్నించారు.
పలు రాష్ట్రాల్లో ఏర్పడిన టీకా కొరత విషయంపై మాండవీయ స్పందిస్తూ.. 15 నుంచి 20 లక్షల వరకు వ్యాక్సిన్ డోసులు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ పెంచాలని కేంద్రాన్ని అడుగుతున్నాయని తెలిపారు. రాబోయే థర్డ్ వేవ్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో 1,573 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 316 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం కూడా పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్లాంట్లు ఆగస్టు నెల నాటికి పూర్తవుతాయని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending