మంచుకొండల్లో 23 రోజులు... మృత్యువుతో పోరాడి గెలిచిన యువకుడు

అతను నడుపుతున్న హెలికాప్టర్ క్యాబిన్ కాలిబూడిదైంది. చుట్టూ చూస్తే మైనస్ డిగ్రీల మంచు... అక్కడ 23 రోజులు ఎలా గడిపాడో తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 14, 2020, 9:57 AM IST
మంచుకొండల్లో 23 రోజులు... మృత్యువుతో పోరాడి గెలిచిన యువకుడు
టైసన్ (credit - FB - Alaska State Troopers (Official)
  • Share this:
అతని పేరు టైసన్ స్టీలే. అలస్కాలోని... అంకోరేజ్‌కి 112 కిలోమీటర్ల దూరంలో... మనుషులు జీవించని ప్రాంతంలో... స్వయంగా ఓ షెల్టర్ వేసుకొని... జీవించసాగాడు. అక్కడ ఎలాంటి కమ్యూనికేషనూ లేదు. చుట్టూ కొండలు, నదులు, అడవులు, సరస్సులు. 32 కిలోమీటర్లు వెళ్తే తప్ప బతికే అవకాశాలు లేవు. వాటిని ఎక్కుదామంటే... క్షణక్షణానికీ వాతావరణం భయంకరంగా మారిపోతోంది. తనతో తెచ్చుకున్న స్నో-షూస్ (మంచులో వాడే షూస్) కాలిపోయాయి. అలాంటి చోట... 30 ఏళ్ల... టైసన్... ప్రతీ గంట జీవన్మరణ పోరాటంలా గడిపాడు. 23 రోజులు మృత్యువుతో పోరాడాడు. అతను ప్రయాణించిన హెలికాప్టర్ క్యాబిన్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. మైనస్ డిగ్రీల మంచులో హెలికాప్టర్ కూలిపోయింది. అక్కడ చూస్తే ఎవరూ లేరు. ప్రాణాలతో బయటపడ్డాననుకున్న టైసన్... తను ఎలాంటి ప్రదేశంలో పడ్డాడో తెలుసుకొని షాకయ్యాడు. క్యాబిన్ కింద... ఓ గొయ్యిలా చేసుకొని... దానికి చుట్టూ కార్డ్ బోర్డ్ అట్టల్ని పెట్టి... చిన్న షెల్టర్‌లా మార్చుకొని అందులోనే ఉన్నాడు. హెలీకాప్టర్‌లో ఉన్న ఆహారంలో చాలా వరకూ కాలి బూడిదవగా... కొంత ఆహారాన్ని మాత్రం టైసన్ పక్కన పెట్టగలిగాడు. దానితోనే అతను అక్కడ జీవించాడు. అతి కష్టమ్మీద ఓ మంటను సృష్టించి... అది ఆరిపోకుండా చేసుకొని... దానితోనే తన ఆహారం వేడెక్కేలా చేసుకునేవాడు.

ఆ గడ్డ కట్టే చలిలోనే అతను 23 రోజులు బతకడం గ్రేట్. గత వారం స్టేట్ ట్రూపర్స్ అనుకోకుండా అటుగా వెళ్లారు. అక్కడ SOS అని మంచులో రాసి ఉంచిన అక్షరాలు వాళ్లకు కనిపించాయి. SOS అంటే నేను ప్రమాదంలో ఉన్నాను. నన్ను కాపాడండి అని అర్థం. సో... వెంటనే స్టేట్ ట్రూపర్లు అతన్ని కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. దురదృష్టమేంటంటే... ఈ ప్రమాదంలో... టైసన్‌ పెంచుకుంటున్న 6 ఏళ్ల కుక్క మంటల్లో చిక్కుకొని చనిపోయింది.

హాలీవుడ్ మూవీ కాస్ట్ ఎవే (Cast Away)లో కూడా ఇలాగే జరుగుతుంది. టైసన్‌ను చూసినప్పుడు ఆ సినిమా గుర్తొచ్చిందని స్టేట్ ట్రూపర్స్ తెలిపారు. శనివారం అతను తిరిగి ఉతాహ్‌లోని తన ఫ్యామిలీని కలుసుకున్నాడు. టైసన్‌ను కాపాడేటప్పుడు తీసిన వీడియోను అలస్కా స్టేట్ ట్రూపర్స్... తమ ఫేస్‌బుక్ పేజ్‌లో పెట్టారు. అది వైరల్ అవ్వడంలో ఆశ్చర్యం ఏముంది?

First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు