మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం. పెళ్లిళ్లు (Viral Wedding Videos) జరిగే సమయంలో హీరో లేకపోతే విలన్ ఎంట్రీ ఇవ్వడం, హీరోయిన్ గురించి కొన్ని డైలాగ్స్ చెప్పడం.. ఓ పెద్ద ఫైట్. ఇలాంటివి చూస్తుంటాం. కానీ, కొన్ని కొన్ని సార్లు మనం నిజజీవితంలో కూడా ఇలాంటివాటికంటే ఎక్కువ చిత్ర విచిత్రమైన సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక ఘటన తాజాగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral Videos in Telugu) మారింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని (Uttar Pradesh) గోరఖ్ పూర్‌లో (Gorakhpur) జరిగినట్టుగా చెబుతున్న ఆ వీడియో చూస్తే ‘ఇదేంటి.. ఇలా జరిగింది.’ అని అనుకోక మానరు.
ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు సహా కొందరు అతిథులు హాజరయ్యారు. అంతా హడావిడిగా ఉంది. పెళ్లికూతురు వరుడి కాళ్లకు దండం పెట్టింది. అతడు ఆమెను చేతులతో పట్టుకుని పైకి లేపాడు. ఆ తర్వాత వరమాల ఘట్టం జరగబోతోంది. వధూవరులిద్దరూ దండలు మార్చుకోవడానికి రెడీ అయ్యారు. వరమాల తర్వాత వధువు నుదుటి పైన పెళ్లికొడుకు బొట్టు పెడితే ఇక పెళ్లి అయినట్టే. మన తెలుగు సంప్రదాయాల్లో అయితే వరుడు వధువు మెడలో తాళి కట్టి, తలంబ్రాలు పోసే తతంగం అంతా ఉంటుంది. కానీ, ఉత్తరాదిన వరమాల, వధువు నుదుటిన సింధూరం పెట్టడం, ఆ తర్వాత హోమం చుట్టూ ఏడడుగులు నడవడం లాంటి సంప్రదాయాలు ఉంటాయి.
వధూవరులిద్దరూ వరమాల రెడీ చేసుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక యువకుడు వచ్చాడు. ఆమె నుదుటి మీద బొట్టు పెట్టాడు. తన జేబులో నుంచి ఓ కుంకుమ ప్యాకెట్ తీసి ఆమె ముఖం మీద పూసేశాడు. ఈ తతంగం అంతా అక్కడ వీడియో తీస్తున్న వారి కెమెరాలో రికార్డు అయింది. ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వచ్చిన ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్‌కి గురయ్యారు. అంతలో తేరుకున్నారు. అతడిని చితక్కొట్టారు.
ఇంతకీ విషయం ఏంటంటే ఆ యువకుడు ఎవరో తెలియని వ్యక్తి కాదు. గతంలో ఆమెను ప్రేమించాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఈ లోపు అతడు ఏదో పని చేసుకుంటా అని వేరే ఊరికి వెళ్లాడు. ఎలా తెలిసిందో మొత్తానికి ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయిందని తెలిసి వెంటనే ఆ ఊరికి వచ్చాడు. పెళ్లి మండపంలో ఇలా రచ్చ రచ్చ చేశాడు.
ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు అందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ యువకుడిని తీసుకెళ్లి తమదైన శైలిలో బుద్ధిచెప్పి పంపారు. ఏ అబ్బాయితో అయితే పెళ్లి ఆగిపోయిందే అదే అబ్బాయితో ఆ తర్వాత రోజు ఆ యువతి వివాహం జరిపించారు. దీంతో పెళ్లికి శుభం కార్డు పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, VIRAL NEWS, Viral Videos