MAN MISSING FROM SURAT LOCATED IN BENGALURU VIA COWIN PORTAL CHECK FULL STORY HERE JNK GH
CoWin Portal: తప్పిపోయిన వ్యక్తి జాడ కనిపెట్టిన కొవిన్ పోర్టల్.. ఎలా సాయం చేసిందంటే..
తప్పిపోయిన వ్యక్తి జాడ కనిపెట్టిన కోవిన్ పోర్టల్
కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ పోర్టల్ తప్పినపోయిన వ్యక్తుల జాడ కనిపెట్టడంలోనూ సాయపడుతోంది. సూరత్‌కు చెందిన ఓ తప్పిపోయిన విద్యార్థి జాడ ఈ పోర్టల్ ద్వారా తెలిసింది.
కొవిడ్-19 (Covid 19)వ్యాక్సిన్ (Vaccine) కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ పోర్టల్ తప్పి పోయిన వ్యక్తుల జాడ కనిపెట్టడంలోనూ సాయపడుతోంది. సూరత్‌కు చెందిన ఓ తప్పిపోయిన విద్యార్థి జాడ ఈ పోర్టల్ ద్వారా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన లతేశ్ పటేల్ వయస్సు 20 సంవత్సరాలు, నాసిక్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్‌లో కాలేజీలో చదువుకునేవాడు. 2018లో ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సూరత్‌లోని తన ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులకు ఆ పరీక్ష ఫలితాలు వచ్చాయి. అందులో లతేశ్ ఫెయిలయ్యాడు. అమ్మా నాన్న తిడతారనే భయంతో 2018లో ఇంటి నుంచి పారిపోయాడు. మహారాష్ట్రలోని నందర్బార్లోని బాబాయ్ ఇంటికి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు మెసేజ్ పెట్టాడు.
లతేశ్ తండ్రి ఆశిష్ పటేల్ తెల్లారి తన తమ్ముడికి ఫోన్ చేస్తే లతేశ్ అక్కడికి రాలేదని తెలిసింది. లతేశ్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. తెలిసిన వాళ్లందరితో మాట్లాడారు, అతని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులను అడిగారు. సోషల్ మీడియా (Social Media) అకౌంట్స్ కూడా చూశారు. కానీ ఎక్కడా లతేశ్ జాడ తెలియలేదు. దీంతో ఆశిష్ పటేల్ తన కుమారుడు కనిపించడం లేదని సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒకవేళ ఎక్కడ ఉన్నా లతేశ్ గనక కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటే అది కొవిన్ పోర్టల్‌లో రికార్డవుతుందని ఈ మధ్య వాళ్ల బంధువు ఒకరు భావించారు. లతేశ్ ఆధార్ కాపీ తీసుకొని వాళ్లు సూరత్‌లోని ఒక వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లారు. ఆ వ్యాక్సిన్ సెంటర్ సిబ్బంది సహకారంతో వాళ్లు లతేశ్ రెండు నెలల క్రితం బెంగళూరులోని నాన్మంగళం ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లో మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడని తెలుసుకున్నారు.
బెంగళూరులోని ఆ ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రానికి చెందిన ల్యాండ్ లైన్ నెంబర్ తెలుసుకొని అక్కడి అధికారులతో మాట్లాడారు. ఇలా తమ కొడుకు చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడని, మూడేళ్లుగా వెతుకుతున్నామని తమ బాధలన్నీ చెప్పారు. దీంతో అధికారులు లతేశ్ వాళ్లకిచ్చిన ఫోన్ నెంబర్ షేర్ చేశారు.
ఆ నెంబరుకు కాల్ చేస్తే లతేశ్ సిమ్ మార్చేస్తాడేమోనని అతని తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ లోపు అతను అక్టోబర్ 21న రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడని తెలిసింది. దీంతో లతేశ్ తల్లిదండ్రులు ఈ సోమవారం ఆ వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి అక్కడి సిబ్బందిని రిక్వెస్ట్ లతేశ్ అక్కడికి వచ్చేలా చేయమని కోరారు.
లతేశ్ తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకున్న ఆ సిబ్బంది, లతేశ్కు ఫోన్ చేసి ఆధార్‌లో ఏదో పొరపాటు జరిగిందని, మరోసారి వ్యాక్సిన్ సెంటర్‌కు రావాలని కోరారు. కానీ తనకు సెకండ్ డోస్ సర్టిఫికేట్ వచ్చిందని తానేమి రానని లతేశ్ స్పష్టం చేశాడు. దీంతో చేసేదేమి లేక లతేశ్ తల్లిదండ్రులు వెనుదిరిగారు. చివరి ప్రయత్నంగా ఓసారి లతేశ్కు ఫోన్ చేశారు. అతన్ని చూసేందుకు సూరత్ నుంచి బెంగళూరు వచ్చామని చివరిసారిగా చూసి పోతామని, అతన్నేమి వెంట తీసుకెళ్లమని ప్రాధేయపడ్డారు. తల్లిదండ్రుల బాధ నుంచి కరిగిపోయిన లతేశ్ వాళ్లకు తాను పనిచేస్తున్న ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు.
వెంటనే అక్కడికి వెళ్లి మూడేళ్ల తర్వాత లతేశ్ను కలుసుకున్నారు ఆ తల్లిదండ్రులు. తన తల్లిదండ్రులను లతేశ్ తన తోటి ఉద్యోగులకు పరిచయం చేశాడు. పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూరత్ రావాలని లతేశ్ను అతని తల్లిదండ్రులు కోరారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.