Man Gets Six Pack In 2 Days : సిక్స్ ప్యాక్... నేటి యువతకు క్రేజ్. కొన్నేళ్లుగా యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఫిట్నెస్ ట్రెండ్. సిక్స్ ప్యాక్ కోసం చాలామంది యువత జిమ్‌లకు వెళ్లి చెమటోడ్చుతారు. మరికొందరు జిమ్‌లో వర్కవుట్లు చేయలేక మధ్యలోనే వదిలేస్తారు. ప్రతి అబ్బాయికి సిక్స్ ప్యాక్ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ, అందుకు చాలా కష్టపడాలి. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవాలి. తగిన డైట్ పాటిస్తూ.. పొట్టను బిగువుగా మార్చుకోవాలి. అప్పుడే పొట్ట కండరాలు గట్టిపడి సిక్స్ ప్యాక్స్ బయటకు కనిపిస్తాయి. అవన్నీ చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి. అంత ఓపిక లేనివారు సిక్స్ మీద ఆశలు వదిలేసుకోవాలి. కానీ జిమ్ లో చెమట చిందించకుండా, కఠినమైన డైట్ పాటించకుండా సిక్స్ ప్యాక్ దేహం సాధ్యమా? అది కూడా రెండు రోజుల్లోనే.. ఔననే అంటున్నాడు ఇంగ్లండ్ లోని ఓ వ్యక్తి.
బ్రిటన్ లోని మాంచెస్టర్ లో నివసిసించే ఓ వ్యక్తి ఊబకాయంతో బాధపడుతున్నాడు. సినిమా హీరోల మాదిరిగా సిక్స్ ప్యాక్ సాధించాలనే కోరికతో.. జిమ్‌కు వెళ్లి ట్రైనర్ సూచించినట్లు కొంత కాలం వర్కవుట్లు చేశాడు. . అయితే జిమ్ లో ఎన్ని కసరత్తులు చేసినా అతడి కల నెరవేరలేదు. ఆ కష్టం తాను పడలేనని వినూత్నంగా ఆలోచించాడు. వెంటనే జిమ్‌కు గుడ్‌బై చెప్పి.. టాటూ షాప్వైపు అడుగులు వేశాడు. దక్షిణాఫ్రికాలో పుట్టి, టాటూ ఆర్టిస్ట్‌గా దేశదేశాలు తిరుగుతూ ప్రస్తుతం మాంచెస్టర్‌లో ఉన్న డీన్ గుంథెర్ను కలిశాడు. తనకు కడుపుపై టాటూ వేయాలని, అది అచ్చం సిక్స్ ప్యాక్‌లా ఉండాలని చెప్పాడు. దీంతో కలర్ రియలిజమ్లో నిపుణుడైన డీన్..2017లో వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ టైటిల్ గెలిచిన ఎడ్డీ హాల్‌ను స్ఫూర్తిగా తీసుకుని పని ప్రారంభించాడు. అతడి కడుపుపై అబ్స్ మాదిరిగా ఉండేలా టాటూ వేశాడు. అయితే డీన్..దీనికోసం ఎలాంటి డబ్బులు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఓ ప్యాషన్ ప్రాజెక్ట్‌లా చేపట్టాడంట.
View this post on Instagram
సిక్స్ ప్యాక్ టాటూ వేయడం అంత ఈజీ కాలేదు. ఒక రోజంతా కష్టపడి సగం టాటూ వేసేసరికి ఇక నా వల్ల కాదన్నాడు క్లయింట్. ఎలాగోలా బతిమిలాడి పని పూర్తి చేశాడు డీన్. రెండు రోజులు అయ్యేసరికి సిక్స్ ప్యాక్ కల నెరవేరింది. ఇప్పుడు అతడి పొట్టను చూస్తే నిజంగానే సిక్స్ ప్యాక్ బాడీ అని అనుకుంటారు. కానీ, అతడు షర్ట్ పూర్తిగా విప్పితే నవ్వేస్తారు. దీనికి సంబంధించిన వీడియోను టాటూ ఆర్టిస్ట్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు ఇంత ఈజీగా సిక్స్ ప్యాక్ పొందొచ్చా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uk, Viral Video